Wednesday, November 6, 2024

రాష్ట్రంలో వరదలపై సిఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

- Advertisement -
- Advertisement -

CM KCR high level review on floods in telangana

హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వానలు, వరదలపై సిఎం కెసిఆర్ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలో ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది తన జన్మస్థలమైన మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం నుంచి బంగాళాఖాతం వరకు పొంగిపొర్లుతున్నదని పేర్కొన్నారు. గోదావరి ఉప నదులు కూడా నిండి ప్రవహిస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో పడ్డ చుక్క పడ్డట్టే వాగులు వంకలు దాటి, చెరువులు, కుంటలు పొంగి నదులకు చేరుకుంతున్నయని పేర్కొన్నారు. మరో రెండు మూడు రోజులు భారీ వర్శాలున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. ఇటీవలి కంటే ఎక్కువ వరదలు సంభవించే ప్రమాదం ఉన్నదని అధికారులను హెచ్చరించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి పరీక్షా సమయమన్నారు. కష్టకాలంలో ప్రజలను కాపాడుకునేందుకు సంబంధిత అన్నిశాఖల అధికారులు వారి ఉద్యోగ కేంద్రాలను వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదని సిఎం ఆదేశించారు.

ఈ మేరకు తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఇపుడు కురిసే వానలతో గోదావరి నది ఎల్లుండి వరకు ఉధృతంగా ప్రమాద హెచ్చరికలను దాటి ప్రవహించే పరిస్థితులు తలెత్తే ప్రమాదముందని కెసిఆర్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ మొన్నటి మాదిరిగానే వరద ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగు ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్యశాఖ, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్ అండ్ బీ, మున్సిపల్, మిషన్ భగీరథ తదితర శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసు యంత్రాంగాన్ని కిందిస్థాయి పోలీస్ స్టేషన్ల వరకు ఎస్.ఐ, సీఐలతోపాటు, పోలీసు సిబ్బందిని హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలని డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోని వర్షాలు, వరదలు, చెరువుల పరిస్థితిపై మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జలమండలి ఎం.డి. దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తదితరులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా నీటిపారుదలశాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా గోదావరి ప్రవాహాన్ని, శ్రీరాంసాగర్ నుంచి కడెం వరకు ప్రాజెక్టుల పరిస్థితులను, వరదలు ఎట్లా వస్తున్నాయనే విషయాలను సీఎం కేసీఆర్ కు వివరించారు. భారీ వర్షాలతో గోదావరి నదీ ప్రవాహం ఎస్సారెస్పీ నుంచి, కడెం నుంచి వస్తున్న ప్రవాహాలను, గంట గంటకూ మారుతున్న వరద పరిస్థితిని శాటిలైట్ ఆధారంగా రికార్డు చేసే విధానాన్ని ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ సీఎంకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రదర్శించారు. వాతావరణ హెచ్చరికలను ఆధారం చేసుకొని, కురవబోయే భారీ వర్షాల వల్ల సంభవించే వరదను ముందుగానే అంచనా వేస్తే.. లోతట్టు ముంపు ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు చర్యల కోసం ఈ టెక్నాలజీని వినియోగించుకోవచ్చని రజత్ కుమార్ వివరించారు. వాతావరణ శాఖ వానలను అంచనా వేస్తున్నదని, కానీ తద్వారా వచ్చే వరద ముప్పును పసిగట్టలేక పోతున్నదని, ఈ టెక్నాలజీతో వరద ముప్పును కూడా అంచనా వేయవచ్చని రజత్ కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News