మన అన్ని రంగా ల్లో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోందని సిఎం కెసిఆర్ ప్రకటించారు. గద్వాల సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవనం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతిని కూర్చీలో కూర్చోబెట్టి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మా ట్లాడుతూ, దేశంలోని పెద్ద రాష్ట్రాలతో పోటీ పడుతూ ఇవాళ తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. విద్యుత్, తాగునీరు, ఒడిఎఫ్, ఇలా అనేక రంగాల్లో తెలంగాణ తన సత్తాచాటి మెరుగైన ఫలితాలను సాధిస్తోందని చెప్పారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో మన పద్ధతిలో ఎంతో పురోగతి సాధించామని అన్నారు. కొత్త ప్రాజెక్టును పూర్తి చేసుకున్నామని తెలిపారు. రానున్న ఐదేళ్లు కూడా ఇలాగే కష్టపడితే తెలంగాణకు ఎవరూ పోటీ ఇవ్వలేరని పేర్కొన్నారు. సంపద పెరుగుతుంది కాబట్టి.. ఇది సాధ్యమైంది. పట్టు వీడకుండా ఇదే పట్టుదలతో ముందుకు పోతే అనేక విజయాలు సాధిస్తామని అన్నారు. ఐటీ రంగంలో కూడా ముందు వరుసలో ఉన్నామని, పరిశ్రమలు, పెట్టుబడులు దండిగా వస్తున్నాయని కెసిఆర్ తెలిపారు.హరిత క్రాంతి సాధించిన తొలి రాష్ట్రం పంజాబ్ అని, గత 50 ఏళ్లుగా వరి ధాన్యం ఉత్పత్తిలో వారిదే రికార్డు అని పేర్కొన్నారు.
ఇవాళ పంజాబ్‌ను అధిగమించి తెలంగాణ అగ్రస్థానంలోకి వెళ్లిందని తెలిపారు. ఇదే స్పూర్తితో మనం ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజల సహకారం ఉంటేనే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గద్వాల జిల్లా పరిపాలన భవనం తన చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని సిఎం తెలిపారు.జిల్లా ప్రజాప్రతినిధులను, ఉద్యోగులను, ప్రజలను ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ అభినందించారు. ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి అనేక సంక్షేమ పథకాలు తీసుకువస్తుందని తెలిపారు. స్టంటింగ్ ప్రాబ్లం అని ఒకటి ఉంటుందని, పిల్లల పెరుగుదల ఆగిపోతే దానికి కారణం మాల్ న్యూట్రిషన్ కారణమని పేర్కొన్నారు.
ఒకసారి ఒక జనరేషన్ స్టంటింగ్ బారిన పడితే.. అది రిపేర్ కావడానికి 150 సంత్సరాలు పడుతుందని చెప్పారు. మన దగ్గర లాంటి బాధ రావొద్దనే అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో ఎవరూ ఆలోచించని విధంగా కంటి వెలుగు కార్యక్రమం తీసుకున్నామని అన్నారు. ఇలాంటి హ్యుమన్ యాంగిల్ ప్రపంచంలో ఎక్కడా కనిపించదని, ప్రజల ఆయురారోగ్యాలు బాగుండాలని అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు.