Monday, December 23, 2024

వజ్రోత్సవ స్ఫూర్తి పతాక – కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR Inaugurates Vajrotsavam Celebrations

భారత జాతి చరిత్రలో గడచిన 75 సంవత్సరాలు అత్యంత కీలకమైనవి. గాంధీ, నెహ్రూ, భగత్ సింగ్, ఆజాద్ వంటి ఎందరెందరో వీరుల నాయకత్వాన సాధించిన స్వాతంత్య్ర మహా ప్రసాదాన్ని కళ్ళతో అందుకోవడానికి 75 ఏళ్ల క్రింద ప్రారంభమైన పండుగ స్వాతంత్య్ర దినోత్సవం. ప్రతి ఏటా ప్రజా విజయాన్ని, ప్రజాస్వామ్యాన్ని కీర్తించి నీరాజనాలు ఎత్తుతూ ప్రజలందరూ జరుపుకునే పండుగగా వర్ధిల్లుతూ వస్తున్నది. తమ జీవితాలను జ్యోతిర్మయం చేయడానికి సమస్తాన్ని అర్పించిన వీర యోధులను స్మరించుకొని వారి ఆశయాల కొనసాగింపుకు కంకణదారులమవుతావని ప్రతిజ్ఞ పర్వంగా 15 ఆగస్టు కొనసాగుతున్నది. అంతకు ముందు 300 సంవత్సరాలు బ్రిటిష్ సామ్రాజ్యవాదం, నిరంకుశత్వం కింద దారిద్య్ర, దైన్యాలతో ప్రజలు జీవించారు. స్వరాజ్య సాధన ఉద్యమాలలో రాజకీయ, సాంఘిక, ఆర్ధిక రంగ ఉద్యమాలు అంతర్భాగంగా ఉంటాయి. ఆంగ్లేయులు మన దేశా న్ని జయించడానికి, సుదీర్ఘ కాలం పాలించడానికి మన జాతి నైతిక పతనం ప్రధాన కారణం. బ్రిటిష్ వారు భారత్‌లో అడుగు పెట్టినప్పుడు నైతికంగా అగాధంలో ఉన్నాం.

నైతిక పతనం ఎంత సుళువో, దానిని తిరిగి నెలకొల్పడం చాలా కష్టమైన పని. మన దేశంలో మహమ్మారిలా వ్యాపించి వ్యవస్థీకృతమైన మత మౌఢ్యా లు, ప్రజలను చీలికలు పేలికలుగా చేసిన కుల, వర్ణ వ్యవస్థలు, సాంఘిక దురాచారాలు, నీచ స్వార్ధాలతో సిందియా, హోల్కర్లు వంటి కొందరి రాజుల, ఆర్కాట్, నిజాం వంటి నవాబుల అరాచక , భోగలాలస, వ్యక్తిగత అహంకారాల వలన యావత్తు ఉపఖండం దాస్యంలోకి వెళ్ళిపోయింది. విభజించు పాలించు అనే నీతిని వలస పాలకులకు అపాదించడం ఆశాస్త్రీయం. అనేక రకాలుగా చీలి విభజించబడి ఉన్న ఉన్న భారతీయ సమాజాన్ని చేజిక్కించుకోవడం బ్రిటిష్ వారికి నల్లేరు మీద నడకగా మారింది. ఊడిగం సిగ్గుచేటని గుర్తించనంత వరకు వెళ్ళింది.

హేతువు, మానవతవాదం బోధించిన బౌద్ధం చార్వాకం, మోక్షానికి సాధనం జ్ఞానం అని పేర్కొన్న ఉపనిషత్తుల మహోజ్వల సంస్కృతి, దివ్య ప్రభాద్యుతులతో సమస్త ప్రపంచానికి వెలుగుదారులను చూపించిన భారతదేశం ప్రతిఘాతక ధోరణులతో స్తబ్దత, జీవచ్ఛవంగా మునిగిపోయింది. ప్రవాహం తగ్గిన రక్తనాళాలతో, నిస్సత్తువ శరీరాలతో భారత సమాజం నవశక్తితో జ్ఞాన దీప్తితో వచ్చిన వలసవాదులకు పాదాక్రాంతమై పోయింది. శారీరకంగా, మానసికంగా నైతికంగా ఆదఃపతనం చెందిన భారత ఆత్మకు కొత్త రక్తం ఎక్కించి చైతన్య పూరితం చేసి శక్తి సంపన్నం చేసి స్వాతంత్య్రోద్యమ రూపురేఖలను దిద్దడానికి బాటలు వేసిన సాంఘిక విప్లవకారుల కృషి మరువలేనిది. దేశ దాస్యాన్ని అనివార్యం చేసిన నైతిక పతనంలో కూడా అప్పుడప్పుడు తిరుగుబాటు బావుటాలు చోటు చేసుకున్నాయి. 1757 ఫ్లాసి యుద్ధం, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు, 1800 ఆరంభంలో హిందూ సాధువులు తమ సాంప్రదాయక ఆయుధాలతో నిర్వహించిన సన్యాసి తిరుగుబాటు (ఈ ఉద్యమాన్ని ఇతివృత్తంగా బంకిం చంద్ర చటర్జీ ఆనందమఠం అనే నవల రాశారు) 1857లో ప్రజ్వలించిన ప్రథమ స్వాతంత్ర సంగ్రామం. ఈ యుద్ధాలలో మన ప్రజలనే సైన్యంగా మన డబ్బుతోనే, మన పాలకులలో కొందరి ప్రభువుల ధనలోభం, అధికార వ్యామోహం, స్వామి ద్రోహంతో ఆంగ్లేయులు యుద్ధాలలో విజయం సాధించారు. భారత్‌పై రాజకీయ అధికారాన్ని మూడు వందల సంవత్సరాలు అప్రతిహతంగా కొనసాగించింది. శ్రమ దోపిడీ, అణచివేతలతో తమ సామ్రాజ్యవాద విస్తరణకు, ప్రపంచ యుద్ధాలకు భారతదేశం నుండి రెండున్నర లక్షల సైన్యాన్ని ఉపయోగించుకుంది. రెండు వందల మిలియన్ల టన్నుల బొగ్గును, ఆరు మిలియన్ల ఇనుము ముడి ఖనిజాన్ని, రెండు మిలియన్ల ఉక్కును ఇంకాఅనేక విలువైన వనరులను తరలించుకుపోయింది. ఇవి జాతిలో తీవ్ర నైరాశ్యం, నిస్పృహలను కలిగించాయి.

1900 నుండి మళ్ళీ మొగ్గ తొడిగిన స్వాతంత్య్ర సమరానికి పునాదులు వేసిన వారు మాత్రం సామాజిక సంస్కర్తలు, కవులు, కళాకారులు.. రాజారామ్ మోహన్ రాయ్, ఫూలే దంపతులు, కేశవ్ చంద్రసేన్, గోవింద రనడే, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, సయ్యద్ అహ్మద్ ఖాన్, వివేకానంద, వీరేశలింగం వంటి సంస్కర్తలు, బంకిం చంద్ర, టాగోర్, ఇక్బాల్, ధీనబంధు మిత్రలాంటి కవులు, రచయితలు. వీరు జాతీయోద్యమ రథచక్రానికి సారథులుగా, ఇరుసుగా తోడ్పడ్డారు. వీరు దురాచారాల నిర్మూలన, విద్యా వ్యాప్తికి చేసిన కృషి వలన క్రమక్రమంగా భారత జాతి నైతిక పునరుత్తేజం పొందింది. ఇవి జాతి జనులను బానిసలుగా బతుకుతున్నారనే ఎరుకను తెలియపరచింది. ఆంగ్లేయుల ఆధిపత్యంలో బానిసలుగా ఉండడం సిగ్గుకరం అని పరిగణించడం, బానిసత్వపు బ్రతుకు హీనమనే భావం ప్రబలింది. 1880 నుండి గెలుపు ఓటమిలతో నిమిత్తం లేకుండా అలలు అలలుగా ఉప్పెనగా కొనసాగిన, 1905, 1917, 1921, 1929, 1942, 1947 వరకు ప్రజా వెల్లువలతో స్వాతంత్య్రం సాకారమైంది.
సంఘ సంస్కరణ ఉద్యమాలతో ఒక తిలక్, గాంధీ, ఒక జిన్నా ఒక నెహ్రూ, భగత్ సింగ్‌లు ఉద్భవించారు. వీరంతా రాజకీయ, సామాజిక విప్లవాలను జమిలిగా నడిపించి ప్రజలను ఐక్యం చేసి ఒక ఆశయ సాధనకు నడిపించేలా కృషి చేశారు. ఈ మహత్తర స్వాతంత్య్ర పోరాటంలో తెలంగాణ తన వంతు పాత్రను పోషించింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా రావి నారాయణరెడ్డి నాయకత్వంలో కమ్యూనిస్టు పార్టీ సాగించిన సాయుధ పోరాటం, స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో స్టేట్ కాంగ్రెస్ కొనసాగించిన సత్యాగ్రహం దేశాన్ని కదిలించాయి.

స్వతంత్ర పాలన తొలి నాళ్ళలో వైజ్ఞానికవేత్త, సోషలిస్టు నెహ్రూ, సామాజిక విప్లవనేత అంబేడ్కర్‌ల నేతృత్వంలో జాతీయోద్యమ ప్రజల ఆకాంక్షలకు అనువైన రాజ్యాంగంను రూపొందించారు. పీడిత ప్రజా కోటి వికాసానికి అనేక రక్షణలు కల్పించారు. ప్రజల మౌలిక ప్రగతికి తోడ్పడే విద్య, వైద్యం, రవాణా, గనులు శక్తి రంగాలను ప్రభుత్వ ఆధీనంలో ఉంచారు. మూడు వందల సంవత్సరాల వలస పాలనలో చెల్లాచెదురైన దేశానికి నిర్దిష్ట రూపం తెచ్చారు. దీక్షతో, ధైర్య సాహసాలతో విజ్ఞతతో వ్యవహరించి సంక్షేమ రాజ్య పునాదులను బలంగా నిర్మించారు. వేలాది సంవత్సరాలుగా విద్యలో, పాలనలో, ఆర్థిక విషయాలలో భాగస్వామ్యానికి నోచుకోని వారికి చోటు దక్కింది. వ్యవసాయ వైజ్ఞానిక రంగాలలో స్వాలంబన, అనేక విజయాలు సొంతం చేసుకున్నాం. వేలాది సంవత్సరాలుగా భారత సమాజాన్ని అంధకారంలో ఉంచిన మతమౌఢ్యం, విశ్వాసాల ప్రాతిపదికతో ప్రజలను చీల్చే రాజకీయాలు పురుడు పోసుకుని ప్రస్తుతం మహా విపత్తుగా మారాయి. జాతీయోద్యమంలోగాని, సాంఘిక విప్లవాలతో సంబంధంలేని శక్తుల పాలనలో జీవన ప్రామాణికతను సూచికల్లో అన్ని అధమ స్థానాలే. విద్య, వైద్యాలు అమానవీయ పెట్టుబడి చేతుల్లోకి వెళుతున్నది.

మళ్లీ నయా వలసవాదుల చేతుల్లోకి దేశం వెళుతున్నది. సాధించుకున్న అనేక హక్కులు, రాజ్యాంగ వ్యవస్థల ను రక్షణలను బలహీనం చేస్తున్నాయి. సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తిని తగ్గిస్తూ అప్రజాస్వామిక నియంత ధోరణులు చెలరేగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో స్వాతంత్య్ర సమరంలో అశేష త్యాగాలు చేసిన లక్షలాది ప్రజల ఆకాంక్షలను తిరిగి నెలకొల్పే భాధ్యతను విద్యావంతులు, ప్రజాస్వామిక వాదులు తీసుకోవాలి. స్వాతంత్య్ర సాధనకు తోడ్పడిన లౌకిక, సౌభ్రాతృత్వ విలువలు తిరిగి విలసింప చేయాలి. ఈ విలువలకు కట్టుబడి ఉండడంలో కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ సమున్నతంగా నిలబడుతున్నది. ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ ఇతివృత్తంతో స్ఫూర్తిదాయక, శుభ దాయక, చరిత్రాత్మక, మహత్తర సంబరాలను నిర్వహిస్తున్నది. దేశభక్తికి, వీరులపట్ల విధేయతకి మూర్తీభవించిన చిహ్నంగా తెలంగాణ నిలబడుతున్నది. జాతీయ ఉద్యమవీరుల ఆకాంక్షల వెలుగులో నడుస్తున్నది. దేశమంతా జీవనదులు, తరగని వనరులతో మానవ జీవనాన్ని పరిపుష్టం చేయాలని స్వాతంత్య్ర పోరాట యోధులు తలిచారు.

తన మేధోపర తృష్ణతో, వివిధ రంగాల నిపుణులతో, కష్టపడే రైతులతో, శ్రామికులతో తెలంగాణను అనతికాలంలోనే వికాస సౌధంపై నిలిపారు. స్వరాజ్య సౌధానికి గ్రామ పంచాయితీ పునాది, గ్రామోద్ధరణే దేశోద్ధరణ అన్న గాంధీ అభిమతానికి కెసిఆర్ నిలువెత్తు ప్రతీకగా ఉన్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీలు నిర్వహణలో దేశానికి నమూనాగా మారాయి. నాగరికత విస్తరణకు, సంస్కృతి వికాసానికి పాలకులు శాస్త్రీయ జిజ్ఞాస కలిగి ఉండాలి అని ఆచరించి చూపిన నెహ్రూకు కెసిఆర్ వారసులుగా నిలబడుతున్నారు. హైదరాబాదు నగరం అంకుర సంస్థలకు ఐటి సంస్థలకు ఇ కామర్స్ సంస్థలకు అత్యంత ఆకర్షణీయంగా మారింది. అభివృద్ధికి ఆటంకంగా ఉండే అవరోధాల పాత శకం స్థానంలో నవ శకానికి తెలంగాణ నాంది పలికింది. ఇప్పుడిది అభ్యున్నతి మార్గంలో మహాశకం వైపుగా దూసుకెళ్తున్నది. ఇది అమరులు మనపై మోపిన బాధ్యత. వారిని కొనసాగించడమే మనమిచ్చే నిజమైన నివాళి.

అస్నాల శ్రీనివాస్: 9652275560

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News