Monday, December 23, 2024

జాతిని చీల్చే కుట్రలు

- Advertisement -
- Advertisement -

స్వాతంత్య్ర సమరం స్ఫూర్తితో మత ఛాందసవాదులపై పోరాటం

విశ్వ మానవుడు, జాతిపిత మహాత్మా
గాంధీనే కించపరుస్తున్నారు ఇలాంటి
శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
మహోజ్వలమైన స్వతంత్ర వజ్రోత్సవ
దీప్తి వాడవాడలా ప్రజ్వరించాలి
పేదరికం ఉన్నంతకాలం అలజడులు,
అశాంతులు తప్పవు ఈ దేశం నాది
అనే భావన ప్రతి ఒక్కరిలో కలగాలి
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ప్రారంభ
వేడుకలో ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : జాతిపిత గాంధీజీనీ కొందరు కించపరిచేలా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తం చేశా రు. మహాత్ముడు ఎప్పటికీ మహాత్ముడుగానే ఉంటాడని, ఆయన ఖ్యాతిని తగ్గించాలని ఎవరు ప్రయత్నించినా అది వారి మూర్ఖత్వమేనని మండిపడ్డా రు. ఏ దేశానికైనా స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఒక అపురూపమైన సందర్భమన్నారు. భారత స్వాతం త్య్రం కోసం సుమారు ఒకటిన్న ర శతా బ్దం పాటు కొనసాగిన ఈ పోరాటంలో ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్య్రాన్ని సా ధించారన్నారు. అప్పటి నేతల్లో ఉన్న స్వా తంత్య్ర స్ఫూర్తిని కొత్త తరానికి తెలియజేయాలన్నారు. ఈ నేపథ్యంలో నాటి స్వాతంత్య్ర పోరాటాలు నేటి యువతరానికి తెలియజేయాలన్న లక్షంతోనే రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ వజ్రోత్సవాలు అద్భుతంగా జరగాలని సిఎం ఆకాంక్షించారు. వజ్రోత్సవ వేడుకలను హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసిలో సోమవారం సిఎం చేతు ల మీదుగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జాతీయ జెండాను సిఎం కెసిఆర్ ఎగుర వేసి జెండాకు వందనం చేశారు. ఆ తర్వాత భారతమాత, మహాత్మా గాంధీ చిత్రపటాలకు ఆయన పూలమాలవేశారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు కార్యక్రమాలు ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి.

అనంతరం జరిగిన కార్యక్రమంలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ సేవలను కొనియాడారు. స్వాతంత్య్రాన్ని సముపార్జించి 75 సంవత్సరాలు (ఈ నెల 15వ తేదీ నాటితో) స్వయంపాలనలో భారతావని అప్రతిహాతంగా ముందుకుసాగుతోందన్నారు. సుదీర్ఘకాలం స్వయంపాలనలో సుసంపన్నమైన భారతదేశంలో తరాలు మారుతున్నాయన్నారు. కొత్త తరాలు వస్తున్నాయన్నారు. వారికి స్వాతంత్య్ర పోరాట సమయంలో జరిగిన సమరం, త్యాగాలు కొత్త తరానికి అంతగా తెలియవన్నారు. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు సందర్భోచితంగా కొత్త తరం వారికి తెలియజేయడం పాతతరం వారి కర్తవ్యం అని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

కొందరు చిల్లర మల్లరగా మాట్లాడుతున్నారు
గాంధీని కించపరిచే సంఘటనలు ప్రస్తుతం దేశంలో వినాల్సి వస్తుందని కెసిఆర్ బాధాతప్త హృదయంతో వ్యాఖ్యానించారు. భారతమాతకు సమానంగా గౌరవం ఇవ్వాల్సిన కొందరు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. అలాంటి వారిని చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు. జాతిని చీల్చే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైతే దేశం కోసం ముందుండి పోరాటం చేయాలని ఈ సందర్భంగా సిఎం పిలుపునిచ్చారు. తన చిన్ననాటి నుంచి నేటి వరకు అనేక వందలు, వేల సందర్భాల్లో ‘బోలో స్వతంత్ర భారత్‌కు జై మహాత్మా గాంధీకి జై అని నినదించిన నాలుక ఇదన్నారు. కోటానుకోట్ల మంది గాంధీ చిత్రపటాలను నెత్తిన పెట్టుకొని ఊరేగిన దేశమిదన్నారు. జాతిపితగా మనమే బిరుదాంకితుడిని చేసుకున్న గొప్ప మానవతావాది మహాత్మాగాంధీ అని అన్నారు.

అలాంటి వ్యక్తినికించపరిచే దురదృష్టకరమైన సంఘటనలు చూస్తుండడం విచారకమన్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదన్నారు. ప్రపంచంలో ఏ జాతి తన చరిత్రను తను మలినం చేసుకోదన్నారు. అటువంటి వెకిలి మకిలి ప్రయత్నాలు ఎక్కడ వచ్చినా మనందరం ఏకోన్ముకంగా, ఏకకంఠంగా ఖండించి మహాత్ముడి కీర్తిని విశ్వవాప్తమయ్యేలా ప్రయత్నం చేయాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. మంచికి ఏనాడూ విలువ తగ్గొద్దు అని వ్యాఖ్యానించారు. చౌటుప్పల్ వద్ద ఎవరో మహాత్ముడికి గుడికట్టిచ్చిన సందర్భం చూస్తున్నామన్నారు. తాను గాంధేయవాదిని అని చెప్పుకునేందుకు దేశంలో కోటానుకోట్ల మంది ఉన్నారన్నారు. అలాంటి మహాత్మునికి ఎట్టి పరిస్థితుల్లో మహాత్ముడికి ఎలాంటి కళంకం, ఆపదనలు సహించకుండా ముందుకుపోవాలని తాను మనవి చేస్తున్నానని అన్నారు.

సిపాయిల తిరుగుబాటు అత్యంత ప్రధానమైనది
స్వతంత్ర పోరాటంలో అనేక పోరాటాలు జరిగాయని…వాటిల్లో 1857 సిఫాయిల తిరుగుబాటును ప్రధానంగా తీసుకుంటామన్నారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విశేషమేంటంటే సిఫాయిలు తిరుగుబాటుతో బ్రిటీష్ రాజ్యం పడిపోవాలన్నారు. కానీ అలా జరగలేదన్నారు. సిపాయిల తిరుగుబాటును నాటి బ్రిటిష్ పాలకులు బలంగా అణచివేత ప్రారంభించారన్నారు. అయినా స్వతంత్ర ఉద్యమకారులు సిపాయిల తిరుగుబాటు ఫెయిల్ అయ్యిందని ఎనాడు నిరాశ చెందలేదన్నారు. అదే స్ఫూర్తితో వైఫల్యాన్ని పాఠంగా నేర్చుకొని పోరాటాన్ని మరింత ముందుకు కొనసాగించారన్నారు. బాలగంగాధర్ తిలక్ నేతృత్వంలో అనేక సాంస్కృతిక పోరాటాలు వచ్చాయని, అలాగే లాలాలజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్‌తో పాటు అనేక మంది వివిధ రూపాల్లో పోరాటాలు చేశారన్నారు. ఝాన్సీ లక్ష్మీభాయి, ఎంతో మంది రాజులు, సంస్థానాదీశులు యావత్ ఆసేతుహిమాచలం ఒక్కటై పోరాటం జరిపారన్నారు.

విశ్వమానవుడు మహాత్మా గాంధీ
మహాత్మాగాంధీని విశ్వమానవుడు అని కెసిఆర్ అభివర్ణించారు. బారిష్టర్ విద్యను అభ్యసించి చాలా సంపాదించుకునే అవకాశాలున్నప్పటికీ ఆయన ఏనాడు ఆ దిశగా ఆలోచించని మహోన్నత వ్యక్తి గాంధీ అని కొనియాడారు. దేశం కోసం వాటిని వదులుకుని స్వతంత్ర సమరానికి నాయకత్వం వహించారన్నారు. దక్షిణాఫ్రికాలో జాతివివక్షను ఎదుర్కొన్న ఆయన భారత్‌లో కూడా తనజాతి ఇదే పద్ధతిలో పోరాటం చేస్తోందని గ్రహించి ఆయన స్వదేశానికి (భారతకు) తిరిగి రావడం జరిగిందన్నారు. గాంధీ లాంటి గొప్ప బిడ్డను కన్నది మన భరత మాత అని సిఎం పులకించిపోయారు. భారతదేశ స్వతంత్ర సముపార్జన సారథే కాదు…యావత్ ప్రపంచానికే అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాంతిదూత, విశ్వమానవుడు మన మహాత్మాగాంధీ అని కొనియాడారు. తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న కాలంలో ఆనాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమా మన దేశానికి వచ్చారన్నారు.

ఈ సందర్భంగా పార్లమెంట్ జాయింట్ సెషన్‌లో ఒబామా ఉపన్యాసం ప్రారంభించే సమయంలో మాట్లాడుతూ… అత్యంత విలువైన మాట చెప్పారన్నారు. గాంధీ ఈ ప్రపంచంలో పుట్టకపోయి ఉంటే తాను అమెరికా అధ్యక్షుడిని అయ్యేవాడినే కాదన్నారు. అలాగే ఐనిస్టన్ అనే శాస్త్రవేత్త మహాత్మాగాంధీ అనే వ్యక్తి రక్తమాంసాలతో పుట్టి ఈ భూమిమీద నడయాడుతాడని అనుకోలేదన్నారు. అంతటి మహాత్ముడి గాంధీ అని వ్యాఖ్యానించారన్నారు. ఆఫ్రికాలో జాతి వివక్షపై సుధీర్ఘకాలం పోరాటం చేసిన నెల్సన్ మండేలా.. తనకు ప్రముఖమైన స్ఫూర్తి ప్రధాత గాంధీ అని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా కెసిఆర్ గుర్తు చేశారు. గాంధీ విశ్వమానవుడని… ఆయన పుట్టిన గడ్డ భరతమాత కావడం గర్వించదగ్గ విషయమన్నారు. భరత జాతికి వారసులమైన మనం స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలను ఆశయాలుగా చేసుకుని మత ఛాందసవాదులతో పోరాటం చేయాల్సిన ఆసన్నమైందన్నారు.

ప్రతి గడపకు స్వాతంత్య్ర స్పూర్తి తెలిసేలా….వేడుకలు
మహోజ్వలమైనటువంటి స్వతంత్ర వజ్రోత్సవ దీప్తి.. వాడవాడల గ్రామగ్రామాన చాలా అద్భుతంగా జరగాలని సిఎం కెసిఆర్ అభిలాషించారు.
గాంధీ వారసులుగా ఈ దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్న వ్యక్తులుగా మనం ప్రజా సేవరంగంలో మునిగి ఉన్నామన్నారు. మీ అందరికీ శ్రమ ఇచ్చి రాష్ట్రం నలుమూల నుంచి పిలిపించిన కారణం ఏంటంటే స్వాతంత్య్రం ఎలా సిద్ధించిందో ప్రతిగడపకు తెలిసేలా వజ్రోత్సవ వేడుకలను నిర్వహించాలన్నారు. జిల్లాలో మంత్రుల ఆధ్వర్యంలో కమిటీలు ఉన్నయన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలు, జెడ్‌పి అధ్యక్షులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు అందరు తమ పరిధిలో ఉజ్వలం నిర్వహించాలన్నారు. ఆ స్ఫూర్తిని ఈ వేదికగా మీరు పొంది తిరిగి మీ గ్రామాలు, పట్టణాల్లో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు రప్పించామన్నారు. ఏయే సందర్భంలో ఎవరు త్యాగాలు చేశారు, ఎన్ని రకాల పోరాటాలు చేశారు, అలవోకగా తమ అసువులు, ఆయుష్షును దేశ స్వాతంత్య్రం కోసం ధారబోశారు, మరణానికి వెనుకాడకుండా.. మడమ తిప్పకుండా పోరాటాలు చేశారన్నారు. అలాంటి స్ఫూర్తి, త్యాగనీరతితో మనం ముందుకు వెళ్లాల్సిన సమయం వచ్చిందని సిఎం కెసిఆర్ అన్నారు.

దేశాన్ని కలిపి ఉంచేందుకు ఎంతో కష్టపడ్డారు

ఆసేతు హిమాచలం పోరాటం జరిపి స్వాతంత్య్రం తెచ్చారన్న సిఎం కెసిఆర్…. స్వాతంత్య్రం వచ్చాక ఈ దేశాన్ని కలిపి ఉంచేందుకు ఎంతో కష్టపడ్డారన్నారు. ఈనాడున్న భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి చాలా సమయం పట్టింది. ఏ దేశం స్థిరపడాలన్నా అనేక రకాల ఒడిదుడుకులు, ఒత్తిళ్లు, దేశానికి సమగ్రత, స్వరూపం రావాలంటే చాలా సమయం తీసుకుంటుందన్నారు. దాని వెనుక చాలా ప్రయాస, శ్రమ, అనేక రకాల మేధోమధనాలు, ఆలోచనలు అవన్నీ కలగలిసి ఉంటాయన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు చాలా విచిత్రమై పరిస్థితి ఉండేదన్నారు. ఆ సమయంలో సుమారు 584 రాజులు పాలించే సంస్థానాలుండేవన్నారు. ఆ సంస్థానాలను మహాత్మాగాంధీ, వారివెంట ఉన్న వల్లభాయ్‌పటేల్, జవహార్‌లాల్ నెహ్రుతదితర పెద్దలందరు కూడా విశేష కృషిచేసి వారందరినీ ఒప్పించారన్నారు. ఒక దశలో రాజులకు రాజభరణాలు ఇస్తాం మిమ్మల్ని గౌరవిస్తాం మీకు రాజ్‌ప్రముఖ్ పేరుతో బిరుదులు ఇస్తాం అని ఒప్పించి దేశాన్ని ఒకటిగా చేయడానికి ఎంతో కృషి చేశారన్నారు. నాటి కష్టమే నేటి మన కళ్లముందు కనిపిస్తున్న భారతదేశమన్నారు.

ఇది నా దేశం అని అనుభవిస్తున్న భారతదేశాన్ని అందించేందుకు వారుపడ్డ ప్రయాస, చేసిన కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మనందరి తరఫున వారందరికీ వినయపూర్వకమైన జోహార్లు, నమస్సులు అర్పిస్తున్నానని తెలిపారు. తొలిత భారతదేశంలో 1947లో కశ్మీర్ విలీనం కాగా అదే సంవత్సరంలో జూనాగఢ్ అనే విలీనమైందన్నారు. 1948లో ఇండోర్ సంస్థానం, అదే సంవత్సరం హైదరాబాద్ దేశంగా ఉండి భారతదేశంలో విలీనమైందన్నారు. ఆ తర్వాత , 1954లో పాండిచ్చేరి దేశంలో విలీనమైందని, ఆ తర్వాత 1961లో గోవా పోర్చుగీస్ నుంచి విడిపోయి మన దేశంలో విలీనమైందని వివరించారు. చివరగా 1975లో సిక్కీం దేశం భారతదేశంలో విలీనమైంది. 1947 నుంచి 1975 వరకు రకరకాల ప్రక్రియల్లో ప్రస్తుతమున్న భారతదేశం ఏర్పడానికి పరిణామాలు దారితీశాయన్నారు.. దీనివెనుక ఎందరు పెద్దల కృషి, ఎంత కూర్పు, ఎంత సహనం, ఎంత మేధోమథనం, ఎన్ని అంతర్జాతీ, జాతీయ వేదికలపై ప్రయత్నాలు చేస్తే ఈ కూర్పు జరిగిందో ఆలోచన చేయాలన్నారు. ఎంత బాధ్యతాయుతమైన పద్ధతుల్లో ప్రయత్నాలు చేస్తే కష్టపడే ఈ దేశం వచ్చిందో ఇవన్నీ ఆలోచిస్తే మనకేం స్పురణకు వస్తుంది ఏది ఏమైనా ఈ దేశాన్ని యధావిథిగా బ్రహ్మాండంగా కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు.

రాష్ట్రంలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు
తెలంగాణ రాష్ట్రం వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. కొంతలో కొంత రాష్ట్రాన్ని బాగుచేసుకోగలిగామన్నారు. రాష్ట్రం కావాలనే పోరాటం, ఆ తదనంతర కాలంలో ఎనిమిది సంవత్సరాలు ప్రజలు మనకిచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని కొన్ని ప్రాథమిక మౌలిక వసతులు కల్పించుకోగలిగామన్నారు. ఇంకా పురోగమించాల్సింది చాలా ఉందని సిఎం అన్నారు. అయినప్పటికీ దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా జోడెద్దుల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని సిఎం కెసిఆర్ వివరించారు. అన్ని రంగాలకు సమూచిత ప్రాధాన్యత ఇవ్వడం వల్లే కేవలం ఎనిమిది సంవత్సరాల్లోనే రాష్ట్రం అప్రతిహతంగా ముందుకు సాగుతోందన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిఢవిల్లుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న కార్యక్రమాలు, తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు దేశానికి ఆదర్శంగా మారుతున్నాయన్నారు. ప్రదానంగా క్రీడారంగానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇవ్వడం వల్లే మన రాష్ట్రానికి చెందిన పలువురు క్రీడాకారులు దేశ, విదేశాల్లో జరుగుతున్న పలు క్రీడాల్లో మంచి ప్రతిభను కనబరిచి బంగారు పతకాలను సాధిస్తున్నారన్నారు. బర్మింగ్‌హోమ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడా పోటీల్లో మన రాష్ట్రానికి చెందిన నిఖత్ జరీన్ స్వర్ణం సాధించడం చాలా సంతోషంగా ఉందని సిఎం కెసిఆర్ అన్నారు..

పేదరికాని నిర్మూలిస్తేనే శాంతి, సౌభ్రాతృత్వం

దేశంలో పేదరికం ఉన్నంత వరకు ఆక్రందనలు, అలజడులు కొనసాగుతూనే ఉంటాయని సిఎం కెసిఆర్ తెలిపారు.పేదరికాన్ని నిర్మూలిస్తేనే మన సమాజానికి శాంతి, సౌభ్రాతృత్వం, సౌభాగ్యం లభిస్తుందన్నారు. దీన్ని అంతా గమనించాలన్నారు. ప్రజల ఆపేక్షలు అనుకున్న స్థాయికి చేరలేదన్నారు. పేదరికం ఇంకా కొనసాగుతుండడవల్లే దేశంలో వైషమ్యాలు కొనసాగుతున్నాయని అన్నారు. ప్రధానంగా దళిత సమాజం తమకు జరుగాల్సిన న్యాయం జరుగడం లేదని తీవ్ర అసంతృప్తితో ఉందన్నారు. మరికొన్ని అల్పాదాయవర్గాలు ఆదాయం సరిగా లేని అన్నిజాతులు, వర్గాల్లో ఉండే పేదలు మాకు ఇంకా జరుగాల్సి ఉందని తమ బాధను చెబుతున్నారు.

1947లో స్వాతంత్య్రం రాక ముందే మన తెలంగాణ గడ్డపై కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జాగిర్దార్ వ్యతిరేక పోరాటం జరిగిందని సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారకు. అది ప్రజల్లో కొంత చైతన్యం తెచ్చిందన్నారు. దాన్ని మనం వ్యతిరేకించలేమన్నారు. ఆ తర్వాత నక్సలిజం పోరాటాలు వచ్చాయన్నారు. ఇలా అనేక రకాలుగా అశాంతి ప్రజల నుంచి వ్యక్తం అవుతూనే ఉందన్నారు. వీటిన్నింటిని అధిగమించాలంటే ప్రజారంగంలో ఉన్న మనందరం.. ఇరుకైన సంకుచితమైన భావాలు పక్కనపెట్టి విశాల దృక్పథంతో, విశాలమైన ఆలోచనతో స్వార్థాన్ని పక్కనపెట్టి ప్రజాబాహుల్యం కోసం ఎవరైతే ఆర్తులు, దీనార్తులు, అన్నార్తులు, అర్హులున్నారో వారందరి సౌభాగ్యం కోసం ఈ వజ్రోత్సవ దీప్తితో కంకణధారులు కావాలని విజ్ఞప్తి చేశారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా హెచ్‌ఐసిసిలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రదర్శించిన పలు కళా ప్రదర్శనలు అమితంగా ఆకట్టుకున్నాయి. వేదికపై 75 మంది కళాకారులతో నిర్వహించిన వీణావాయిద్య ప్రదర్శన వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. శాండ్ ఆర్ట్ సంస్థ స్వతంత్ర పోరాట ఘట్టాల ప్రదర్శన ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురి చేసింది. వేదికపై దేశభక్తి ప్రబోధ నృత్యం, ఫ్యూజన్ డ్యాన్స్, లేజర్ షో అలరించాయి. ఈ కార్యక్రమంలో వజ్రోత్సవాల కమిటీ చైర్మన్, ఎంపి కె. కేశవరావు, శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇందిరారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, చేవెళ్ల ఎంపి రంజిత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డిజిపి మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి జరగనున్న కార్యక్రమాలు
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు జరిగే కార్యక్రమాలను వెల్లడించారు. కాగా నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు వజ్రోత్సవ వేడుకలు ప్రారంభిస్తారు. ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటా జాతీయ జెండా ఎగురవేసేందుకు ప్రభుత్వం 1.2 కోట్ల జెండాలను పంపిణీ చేయనుంది. ఈ నెల 9 నుంచి 21 వరకు రాష్ట్రంలో 562 సినిమా హాళ్లలో ఉదయం పూట పాఠశాలల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ’గాంధీ’ చిత్రాన్ని ప్రదర్శిస్తారు. ఈ నెల 21న శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. 22న ఎల్బీ స్టేడియంలో ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు.

అమరవీరులకు అంజలి
భరతమాత దాస్య శృంఖలాలను తెంచి, బ్రిటీష్ వలస పాలనను పారదోలాలని మహా సంకల్పంతో భారత స్వాతంత్య్ర సమరం లో భాగంగా ‘డు ఆర్ డై ’ అనే నినాదంతో మహాత్మాగాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా మహోద్యమాన్ని సిఎం కెసిఆర్ స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నాటి మహనీయులకు నివాళులర్పించారు. ఎందరో మహనీయుల త్యాగాల ద్వారా సాధించుకున్న స్వతంత్ర భారతాన్ని సగర్వంగా నిలుపుకోవడం ప్రతి భారతీయుని కర్తవ్యం అని సిఎం అన్నారు. మనం నేడు అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఎంతటి విలువైనవో..నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరమున్నదన్నారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడిచిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా నాటి అమరుల త్యాగాలను పదిహేనురోజుల పాటు వివిధ కార్యక్రమాల ద్వారా నివాళులర్పిస్తూ స్మరించుకోవాలని రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News