పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి అనేక చర్యలు చేపట్టాం
పద్దులపై జరిగిన చర్చలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
మనతెలంగాణ/హైదరాబాద్: గ్రామాలు అభివృద్ధి చెందాలన్నదే సిఎం కెసిఆర్ ఉద్ధేశ్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీలో పద్దులపై జరిగిన చర్చలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పల్లె, దేశంలోనే ఆదర్శంగా నిలవాలన్నదే సిఎం కెసిఆర్ ఆశయమన్నారు. పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లి విరియాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. 2018 నుంచి సిఎం కెసిఆర్ రూపొందించిన పల్లె ప్రగతి కార్యక్రమం అమలవుతోందని, ఇప్పటివరకు నాలుగు విడతలుగా పల్లె ప్రగతి కార్యక్రమం జరిగిందన్నారు. ప్రతి గ్రామంలో మౌలిక వసతులైన, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలను ఏర్పాటు చేసుకున్నామని మంత్రి తెలిపారు. పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి అనేక చర్యలు చేపట్టామని రాష్ట్ర గ్రామీణ ముఖచిత్రం మారాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు.
పెరిగిన పంచాయతీలు రాష్ట్రంలో ఇదివరకు 8, 690 గ్రామ పంచాయతీలు ఉండేవని, ప్రస్తుతం గ్రామ పంచాయతీలను 12, 769కు పెంచామన్నారు. దీంతోపాటు 3, 146 తండాలు, ఆదివాసీ గూడెంలను గ్రామ పంచాయతీలుగా మార్చుకున్నామన్నారు. గతంలో కేవలం 3 వేల 396 మంది గ్రామ కార్యదర్శులు మాత్రమే ఉండేవారని, ఒక్కో కార్యదర్శికి 5, 6 పంచాయతీలు బాధ్యతలు ఉండేవన్నారు. ప్రతి గ్రామానికి కచ్చితంగా ఒక గ్రామ కార్యదర్శి ఉండేవిధంగా 9,355 మందిని కొత్తగా నియమించుకున్నామన్నారు. -నూతన గ్రామ పంచాయతీ చట్టంలో సర్పంచ్‌లు, కార్యదర్శులకు అధికారాలతో పాటు బాధ్యతలు స్పష్టంగా నిర్ధేశించామన్నారు. రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శుల జీతాలకు సమానంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వేతనాలను రూ.15 వేల నుంచి 28 వేల 710 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాన్ని 8 వేల 500 రూపాయలకు పెంచామని మంత్రి తెలిపారు. గతంలో కేవలం 9 మంది మాత్రమే జిల్లా పంచాయతీ అధికారులు (డిపిఓలు) ఉంటే, ఆ సంఖ్యను 32కు పెంచామన్నారు.
అన్ని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు
డిఎల్‌పివోల సంఖ్యను 28 నుంచి 68కి, మండల పంచాయతీ అధికారుల సంఖ్యను 438 నుంచి 539కు పెంచామని అన్ని కేడర్లలో పదోన్నతులు కల్పించామన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా పల్లెలు, పట్టణాల ప్రగతిని పర్యవేక్షించడానికి ఒక ఐఏఎస్ అధికారిని అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) గా నియమించామన్నారు. పిఆర్సీకి అనుగుణంగా స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు పెంచామని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ వచ్చే నాటికి రాష్ట్రంలో అన్ని పంచాయతీల్లో కలిపి కేవలం 87 ట్రాక్టర్లు ఉంటే, ప్రస్తుతం 12,769 గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లను సమకూర్చినట్టు ఆయన తెలిపారు. గతంలో ట్రాక్టర్లను కిరాయికి తెచ్చేవారని, ఉపాధి హామీ నిధుల ద్వారా ప్రతి గ్రామ పంచాయతీలో టాంకర్ ద్వారా నీళ్లు పోస్తే ప్రతి ట్యాంకర్‌కు రూ. 600లు- ఇవ్వడం జరుగుతుందన్నారు. -ఇప్పటివరకు టాంకర్ల ద్వారా నీళ్లు పోసినందుకు రూ. 180 కోట్ల 50 లక్షలు విడుదల చేయడం జరిగిందని, ఈ నిధులన్నీ గ్రామ పంచాయతీలకు అదాయంగా మారాయన్నారు.