Saturday, November 23, 2024

నిజమైన నేత నోముల

- Advertisement -
- Advertisement -

ప్రజా సేవలోనే జీవితమంతా గడిపారు

నాగార్జునసాగర్ ఎడమకాలువ రైతుల కోసం ఎన్నో పోరాటలు చేశారు
అతడి ప్రసంగాలు విశేషంగా ఆకర్షించేవి, వ్యక్తిగతంగా నాకు ఎంతో సన్నిహితుడు
పోరాట పురిటిగడ్డ నల్లగొండ, చైతన్యాన్ని పునికిపుచ్చుకున్నాడు
నోములతో పాటు కీర్తిశేషులైన 9మంది మాజీ ఎంఎల్‌ఎలకు సంతాపం వ్యక్తం చేసిన శాసనసభ

మన తెలంగాణ/హైదరాబాద్: నోముల నర్సింహయ్య నిజమైన ప్రజా నాయకుడని సిఎం కెసిఆర్ కొనియాడరు. ఆయన జీవితాంతం ప్రజాసేవలోనే గడిపారని గుర్తుచేశారు. ముఖ్యంగా నాగార్జున సాగర్ ఎడమ కాల్వ రైతుల ప్రయోజనాల కోసం ఎన్నో పోరాటాలు చేశారన్నారు. అంతేగాక నల్లగొండ జిల్లా రైతుల సాగునీటి హక్కుల కోసం నిరంతరం పోరాడారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎన్నికై ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడ్డారని సిఎం వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం నోముల నర్సింహయ్య మృతి పట్ల సిఎం కెసిఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈసందర్బంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. నోముల నర్సింహయ్య గొప్ప ఉద్యమశీలి అన్నారు. ఆయన సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపించిన వ్యక్తి అన్నారు. పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ చైతన్యాన్ని పుణికిపుచ్చుకొని బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసమే ఆయన జీవితాన్ని అంకితం చేశారని సిఎం అభిప్రాయపడ్డారు. విద్యార్థి, న్యాయవాది, కమ్యూనిస్టు నాయకుడిగా, శాసన సభ్యునిగా నోముల నిరంతరం ప్రజా సేవలోనే గడిపారన్నారు. ఆయన ప్రసంగాలకు ఎంతో మంది ఆకర్శి ంచేవారన్నారు. 64 ఏళ్ల వయస్సులోనే ఆయన గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడం తెలంగాణ ప్రజలకు, టిఆర్‌ఎస్ పార్టీకి తీరని లోటని సిఎం అన్నారు. ప్రజా పోరాటాలను అభిమానించే వారందరికీ ఆయన మరణం తీరని దు:ఖాన్ని మిగిల్చిందన్నారు. వ్యక్తిగతంగా నాకెంతో సన్నిహితులైన నోముల నర్సింహయ్య తెలంగాణ అభివృద్ధి కోసం ఆయన ఆలోచనల్ని నిత్యం తనతో పంచుకునేవారని సిఎం గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మీయత, విలువల పట్ల కలిగి ఉండే నిబద్ధతను తాను ఎప్పటికీ మరువలేనని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. నిజమైన ప్రజా నాయకుడిగా నోముల నర్సింహయ్య తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని కెసిఆర్ పేర్కొన్నారు.
సభలోని సభ్యులు సంతాపం…
సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి సభలోని సభ్యులంతా మద్ధతు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లితో పాటు ఎంఎల్‌ఏలు సండ్ర వెంకటవీరయ్య, చిరుమర్తి లింగయ్య, రాజాసింగ్, బొల్లం మల్లయ్య యాదవ్, రవీంద్ర నాయక్, జైపాల్ యాదవ్ తదితరులు మాట్లాడుతూ..కార్మికులు, కర్షకులు కోసం నోముల ఎంతో కృషి చేశారన్నారు. ముఖ్యంగా ‘తనకు నోముల నర్సింహయ్యల మధ్య మామ అల్లుళ్ల సంబంధం ఉందని మంత్రి ఎర్రబెలి’్ల అన్నారు.
9 మందికి సంతాపం వ్యక్తి చేసిన సభ…
తెలంగాణ అసెంబ్లీలో నోముల నర్సింహయ్య సంతాప తీర్మానం పూర్తికాగానే మరో ఎనిమిది మంది మాజీ సభ్యులకూ శాసనసభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆ సభ్యుల పేర్లను మంగళవారం సభలో ప్రవేశపెట్టారు. మాజీ సభ్యులు గుండా మల్లేషం, నాయిని నర్సింహారెడ్డి, కమతం నర్సింహారెడ్డి, కటికనేని మధుసూదన్‌రావు, కట్టా వెంకట నర్సయ్య, దుగ్యాల శ్రీనివాసరావు, చెంగల్ బాగన్న, కె వీరారెడ్డిలకు స్పీకర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం సభ రెండు నిమిషాల పాటు మౌనం వహించింది.
నోముల ప్రస్థానం ఇలా…
నోముల నర్సింహాయ్య 1956, జనవరి 9న నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం, పాలెం గ్రామంలో యాదవ కుటుంబంలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ, ఎల్.ఎల్.బి పూర్తి చేశారు. విద్యార్థి దశ నుండే ఉద్యమాలకు నాయకత్వం వహించారు. న్యాయవాదిగా పనిచేస్తున్న తరుణంలోనూ ఆయన పేదలపక్షం వహించి, ప్రజల న్యాయవాదిగా గొప్ప పేరు తెచ్చుకున్నారు. కమ్యూనిస్టు దృక్పథం కలిగిన నర్సింహయ్య సమాజంలో దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్మించారు. తన ఆశయాలకు అనుగుణంగా సిపిఎం పార్టీలో చేరారు. నకిరేకల్ ఎంపిపి అధ్యక్షుని గా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం శాసనసభా పక్ష నాయకుడిగా ఎదిగేదాకా సాగింది. శాసనసభలో తెలంగాణ నుడికారం ఉట్టిపడే విధంగా సామెతలు, ఛలోక్తులతో కూడిన నోముల నర్సింహయ్య ప్రసంగాలు ప్రత్యేకంగా ఆకర్శించేవి.
ప్రతిపక్ష నేతగా, శాసనసభలో ఏ విధంగా వ్యవహరించాలో?హుందాతనాన్ని ఎలా ప్రదర్శించాలో? ప్రజల సమస్యలను ప్రభావ పూర్వకంగా సభలో ఎలా ప్రస్తావించాలో? నేటితరం నాయకులు నోముల నర్సింహయ్యని చూసి నేర్చుకోవాలని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా సిపిఎం పార్టీకి విశేష సేవలందించిన నోముల నర్సింహయ్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరితో విభేదించి పార్టీ నుంచి వైదొలిగారు. తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారానే తెలంగాణ ప్రయోజనాలు నెరవేరుతాయనే విశ్వాసంతో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. 2018లో టిఆర్‌ఎస్ తరఫున నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. ఆ నియోజక వర్గం అభివృద్ధి కోసం చివరిశ్వాస వరకు కృషిచేశారు. యాదవ కుటుంబంలో జన్మించిన నోముల నర్సింహయ్య బడుగువర్గాల ప్రతినిధిగా వారి సంక్షేమం కోసం నిరంతరం తపించారు.

CM KCR introduced condolence resolution on Nomula death

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News