Monday, January 20, 2025

గిరిజనుల కలలను నిజం చేసిన గొప్ప వ్యక్తి సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

బాన్సువాడ/నస్రుల్లాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గిరిజన, బంజారాల దశాబ్దాల కలలను నిజం చేసిన గొప్ప వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అని, తాం డా లు, గిరిజన గూడేలు గ్రామ పంచాయతీలుగా రూపుదిద్దుకున్నాయని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని గిరిజన బాలుర గురకుల పాఠశాలలో జరిగిన తెలంగాణ గిరిజనోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా రూ. 7కోట్లతో నూతనంగా నిర్మించే గిరిజన బాలుర వసతి గృహం, సిబ్బంది క్వా ర్టర్స్ నిర్మాణానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన, భూమిపూజ చేశారు. అనంతరం సభాపతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించాక 9 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధ్దిని ప్రజలకు వివరించడానికే ఈ ఉత్సవాలన్నారు. గిరిజన దినోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలన్నారు.

నా రాజకీయ జీవితంలో నాకు అన్ని విధాలుగా గత ఎన్నో ఏండ్లుగా అండగా ఉంటున్న గిరిజనులందరికి పేరు పేరున ధన్యవాదాలు అన్నారు. గిరిజన, బంజారాల దశాబ్దాల కలలను నిజం చేసిన గొప్ప వ్యక్తి సిఎం కెసిఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 నుంచి నేటి వరకు గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు మొత్తం రూ. 53,417 కోట్లు అన్నారు. తాండాలు, గిరిజన గూడెలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామని గతంలో అనేక ప్రభుత్వాలు, సిఎంలు హామీ ఇచ్చినా నెరవేర్చలేదన్నారు. సిఎం కెసిఆర్ 3146 తాండాలను, గూడెంలను గ్రామ పంచాయతీలుగా మార్చారన్నారు. గిరిజనులకు విద్య, ఉద్యోగాలలో అధికంగా అవకాశాలు లభిస్తున్నాయన్నారు. కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా ఒక లక్షా 55 వేల మంది గిరిజన యువకులకు 1306 కోట్ల నగదు సహాయం అందించారన్నారు. సేవాలాల్ మహారాజ్ పుట్టిన రోజు అధికారికంగా జరుపుతున్నారన్నారు.

త్వరలో రాష్ట్రంలోని 1.50 లక్షల మంది గిరిజన రైతులకు 4 లక్షలకు పైగా ఎకరాల పోడు భూములకు చెందిన పట్టాలు అందుతాయన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో 2104 మంది గిరిజన రైతులకు 3830 ఎకరాల పోడు భూములకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేస్తామన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ప్రతి తాండాకు రోడ్డు సౌకర్యం కల్పించామన్నారు. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలలో జీపీ భవనాలకు రూ. 20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశామన్నారు. ప్రత్యేక డెవలప్‌మెంట్ ద్వారా నియోజకవర్గంలోని అన్ని తాండాలలో జగదాంబ, సేవాలాల్ మహారాజ్ దేవాలయాల కోసం రూ. 25 కోట్లు మంజూరు చేశామన్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి మంజూరైన గిరిజన బాలుర గురుకుల పాఠశాలలను ఈ ప్రదేశంలో ఏర్పాటు చేసి రూ. 5 కోట్లతో భవనం నిర్మించామన్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి కొత్తగా గిరిజన బాలికల గురుకుల పాఠశాల కూడా మంజూరైందన్నారు.

హన్మాజీపేట్, కోనాపూర్ వద్ద పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు. భవనాలు కట్టడానికి రూ. 12 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. నస్రుల్లాబాద్‌లోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో రామారావు మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విగ్రహాన్ని నా కుమారుడు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తన స్వంత ఖర్చులతో ఏర్పాటు చేయిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, ఆత్మ కమిటి చైర్మన్ మోహన్ నాయక్, జిల్లా నాయకుడు బద్యానాయక్, నస్రుల్లాబాద్ ఎంపీపీ పాల్త విఠల్, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, కంది మల్లేశ్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News