Monday, January 20, 2025

విజన్ ఉన్న నాయకుడు సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

తొర్రూరు : తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ఒక విజన్‌తో ముందుకు వెళ్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తొర్రూరు, పెద్దవంగర, రాయపర్తి మండలాలకు కలిపి మహిళా సంక్షేమం కార్యక్రమాన్ని తొర్రూరు డివిజన్ కేంద్రంలోని రామ ఉపేందర్ గార్డెన్‌లో నిర్వహించారు. బతుకమ్మ బోనాలు, కోలాటాలు, డప్పు చప్పుళ్ల మధ్య మంత్రి దయాకర్‌రావుకు ఆడపడుచులు ఘన స్వాగతం పలికారు.

జ్యోతి ప్రజ్వలన చేసి ఎస్‌హెచ్‌జీ ప్రార్థన గీతం సాంప్రదాయం కూచిపూడి నృత్యం, తెలంగాణ సాంస్కృతిక సారధి సంక్షేమ అభివృద్ధి గీతాలు, జానపద నృత్యాలతో కన్నుల పండువగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ గతంలో ఆడబిడ్డ పుట్టిందంటే అమో ఆడబిడ్డ అని ఆందోళన చెందేవారని ఇప్పుడు పరిస్థితులు మారాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఆడబిడ్డల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. తొమ్మిదేండ్ల సుపరిపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ కొండంత భరోసాను కల్పిస్తుందని చెప్పారు.

అమ్మాయి పుట్టగానే కేసీఆర్ కిట్ పథకంతో మొదలుకొని పెండ్లికి ఆర్థిక సాయాన్ని అందజేస్తుందన్నారు. పలు రంగాల్లో నిర్ణయాత్మక పాత్రను పోషిస్తున్న మహిళల స్వావలంబన, సాధికారత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాల్లో మహిళలు అనుకున్న పురోగతి సాధించలేదని గుర్తించిన సీఎం కేసీఆర్ మహిళల కోసం తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. మహిళల రక్షణ, పోషణకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారానే వారి అభివృద్ధి సాధ్యమని కేసీఆర్ నమ్మకమన్నారు. అందుకే ఆరోగ్యలక్ష్మి, భరోసా కేంద్రాలు, షీ టీమ్స్ వంటి పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. గత తొమ్మిదేండ్లుగా ఆడబిడ్డల పెండ్లికి భారమైన పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తుందన్నారు.

ప్రపంచంలోనే ఎవరూ ఊహించని విధంగా తెలంగాణలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. కడుపులో బిడ్డ పెరుగుతున్న నాటి నుంచి భూమిపైకి వచ్చే రోజు వరకు తల్లిని, బిడ్డను సురక్షితంగా కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. బిడ్డ పుట్టినప్పుడు ఆర్థిక సహాయం, కేసీఆర్ కిట్, పెళ్లినాటికి కల్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాలతో ఆదుకుంటుందని చెప్పారు. స్వరాష్ట్రంలో సుపరిపాలనను ప్రజలకు అందిస్తూ ప్రపంచానికే రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. కల్యాణలక్ష్మితో ఇంటి పెద్దలా, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌తో ఇంటి డాక్టర్‌లా, కేసీఆర్ కిట్‌తో మేనమామలా, అమ్మ ఒడితో సంరక్షకుడిలా, ఆరోగ్యలక్ష్మితో ఆరోగ్య దాతగా, షీ టీంతో రక్షకుడిగా సీఎం కేసీఆర్ అండగా నిలిచారని అన్నారు.

వితంతువులకు, ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్లు అందిస్తూ అండగా నిలుస్తుందన్నారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు ద్వారా పదివేల మందికి ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ అందించడంతో పాటు వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌లో ఉద్యోగాల అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఈ అవకాశాలను వినియోగించుకోవాలన్నారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని చెప్పారు. మహిళల కోసం పెద్దపీట వేస్తూ అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మహిళలకు కుట్టుమిషన్‌లో శిక్షణ ఇవ్వడంతో పాటు ఉచితంగా కుట్టుమిషన్లను అందిస్తున్నామని చెప్పారు. మంత్రి దయాకర్‌రావు పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్, మంత్రి దయాకర్‌రావుకు అండగా ఉంటూ వెన్నుదన్నుగా నిలవాలని కోరారు.

మహిళల సంక్షేమమే బీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్షమని ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. గతంలో మహిలలు మంచినీటి కోసం బిందెలతో కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి నీటిని తీసువచ్చేవారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఇంటింటికి సురక్షితమైన మంచినీటిని అందిస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ మహిళలకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాల్లో అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ముందుందని చెప్పారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద పతకం ఎత్తిపోతల పథకమని అన్నారు. మీ రుణం తీర్చుకుంటానని, తనను రెండు సార్లు ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు.

అనంతరం వరంగల్ కలెక్టర్ పి.ప్రావిణ్య, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్‌లు మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. మహిళల భద్రత కోసం షీటీం, సఖీ, భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల కార్యక్రమాలను చేపడుతుందని చెప్పారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మహిళల కోసం కుట్టు మిషన్‌పై శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లను అందజేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలన్నారు. తొర్రూరు మండలంలోని 90ఎస్‌హెచ్‌జీ సంఘాలకు రూ.ఎనిమిది కోట్లు, పెద్దవంగర మండలంలోని 70 ఎస్‌హెచ్‌జీ సంఘాలకు రూ.ఐదు కోట్లు బ్యాంకు లింకేజీల ద్వారా అందజేశారు. రెండు మండలాలకు రూ.1.26కోట్ల శ్రీనిధి రుణాలను అందజేయడం జరిగిందని అధికారులు తెలిపారు.

కార్యక్రమ అనంతరం పరిపాలనలలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళా ప్రజాప్రతినిధులను, అధికారులను, ఉద్యోగులను మంత్రి దయాకర్‌రావు, ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ కలెక్టర్ పి.ప్రావిణ్య, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక, అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్‌లు షీల్డ్, ప్రశంస పత్రం, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీడబ్లూసీ చైర్మన్ నాగవాణి, ఎంపీపీలు ఈదురు రాజేశ్వరి, తూర్పాటి చిన్న అంజయ్య, జెడ్పీటీసీలు జ్యోతిర్మయి, మంగళపల్లి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రాంచంద్రయ్య, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, ఏఎంసీ చైర్మన్ పసుమర్తి శాంత, జిల్లా అధికారులు సన్యాసయ్య, డీఏఓ చత్రునాయక్, డీసీఓ ఖుర్షిద్, డీఈఓ రామారావు, ఆర్డీఓ రమేశ్, తహశీల్దార్ నాగేంద్రప్రసాద్, ఎంపీడీఓ సింగారపు కుమార్, జిల్లా, మండల స్థాయి అధికారులు, మహిళా సంఘాలు, మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News