మణుగూరు : అమరుల ఆకాంక్షలను సిఎం కెసిఆర్ నెరవేరుస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసన సభ్యులు, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. గురువారం మణుగూరు మండలంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు తెలంగాణ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆయన హాజరై అమరవీరుల స్మారక స్ధూపం వద్ద ఘన నివాళులర్పించారు. అనంతరం కొమరం భీం విగ్రహానికి, చాకలి ఐలమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్ది వేడుకలలో నేడు అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా నివాళుర్పించేందుకు హైదరాబాద్ నడి ఒడ్డున హుస్సేన్ సాగర్ తీరంలో నిర్మించిన అమరుల స్మారక చిహ్నంను సిఎం కెసిఆర్ ప్రారంభోత్సవం చేస్తున్నారన్నారు. ఆత్మ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్ర పాలన పగ్గాలు అందుకున్న ఉద్యమనేత సీఎం కేసీఆర్ సర్కార్ అమరవీరుల కుటుంబాలకు అడుగడుగునా అండగా నిలుస్తూ ఆసరాను అందిస్తున్నారని తెలిపారు.
నీళ్లు నిధులు నియాకాలతో కూడిన ఉద్యమ మాటలను పరిపూర్ణం చేసినందుకు నేడు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలలో అమరుల సంస్కరణ దినోత్సవం నిర్వహించుకోవడం గొప్ప విషయమన్నారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్ట్ నిర్మించి పంటలకు సాగు నీరు అందిస్తున్నారని, తెలంగాణ వస్తే రాష్ట్రంలో చీకట్లు అలుమ్ముకుంటాయని నాటి పాలకులు వెక్కిరించారని, కానీ సీఎం కేసీఆర్ రాష్ట్రం వచ్చిన కొద్ది నెలల్లోనే విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపించారన్నారు. ఈకార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.