Friday, November 22, 2024

కోలాహలంగా సెక్రటేరియట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ తెలంగాణ నూతన సచివాలయం గురువారం కోలాహలంగా మారింది. దాదాపు ఆరు దశాబ్దాల పాటు కొనసాగిన తెలంగాణ పోరాటాలు, త్యాగాల ఫలితంగా పార్లమెంట్ ప్రజాస్వామ్య పంథాలో స్వరాష్ట్రం తెలంగాణను సాధించుకున్నాం. అదికూడా అనతి కాలంలోనే దేశం గర్వించేలా పదేళ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని… అమరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

గురువారం డా.బిర్.అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యచరణపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరుగగా.. మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ముఖ్యమంత్రి సలహాదారులు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, సిఎంఒ కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, డిజీపి, పోలీసు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొనేందుకు నూతన సచివాలయంకు రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. అటు గ్రామ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు రోజు వారి కార్యక్రమాల గురించి, ఏరోజుకు ఏ కార్యక్రమం చేపట్టాలో కలెక్టర్లకు సిఎం సూచించడం గమనార్హం.

గ్రామాలు, నియోజకవర్గ, జిల్లాల వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి సిఎం వివరించారు. మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్లకు సిఎం దిశా నిర్దేశం చేశారు. దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఖర్చులకు గాను కలెక్టర్లకు 105 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ సిఎం నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ల సమావేశం నేపథ్యంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3.30 వరకు కలెక్టర్లు, ఎస్‌పిలు సచివాలయంలో సమావేశంలో బిజీ బిజీగా కనిపించారు. అటు సమావేశం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3.00 గంటల సమయంలో సచివాలయం వచ్చేలా ముందు భాగం నుండి సిఎం కెసిఆర్ వారితో ఒక గ్రూఫ్ ఫోటోను దిగారు.

పూలదండలు.. బొకేలతో పరస్పరం శుభాకాంక్షలు
కాగా జిల్లా కలెక్టర్ల సమావేశం నేపథ్యంలో సిఎం కెసిఆర్‌కు, సిఎస్ శాంతి కుమారికి, అలాగే డిజిపి తదితరులకు బోకేలు ఇవ్వడం, మరి కొందరు పూలదండలు కూడా వేసి శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయం ఏర్పాటు చేసిన తర్వాత అధికార కేంద్రబిందువులైన సిఎం సహా మంత్రులు, ఉన్నాధికార గణం అంతా సెక్రటేరియట్‌కు తరలి రావడంతో సచివాలయం లోపలే కాదు.. బయట కూడా పండుగ వాతావరణం కనిపించడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News