పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులిచ్చి నీటి కేటాయింపులు జరపాలి, కెఆర్‌ఎంబి, జిఆర్‌ఎంబి గెజిట్ అమలు వాయిదా వేయాలి, ఉమ్మడి ప్రాజెక్టులనే గెజిట్ నోటిఫికేషన్ పరిధిలో ఉంచాలి, రాష్ట్రం ఏర్పడక ముందరి 11 ప్రాజెక్టులను అనుమతి లేనివిగా పేర్కొనడం అభ్యంతరకరం
కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో భేటీలో ముఖ్యమంత్రి కెసిఆర్
పాలమూరు ప్రజాప్రతినిధులతో పాటు శనివారం నాడు ఢిల్లీలో కేంద్రమంత్రి షెకావత్‌ను కలుసుకున్న సిఎం కెసిఆర్
మన తెలంగాణ/ హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలు, నదీ యాజమాన్యబోర్డుల పరిధి నోటిఫికేషన్ సంబంధిత అంశాలపై కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సమావేశమై చర్చించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం కెసిఆర్ శనివారం పాలమూరు ప్రజాప్రతినిధులతో కలిసి కేంద్ర మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నీటిప్రాజెక్టులకు సంబంధించిన పలు అంశాలపై సుమారు 40 నిమిషాల పాటు చర్చించారు. ప్రాజెక్టులకు నిధులకేటాయిం పు, జాతీయ హోదా గుర్తింపుపై చర్చించారని తెలుస్తోం ది. ప్రధానంగా తెలంగాణ, ఎపి రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్టా, గోదావరి నదీ జలాల వివాదంపై సిఎం కెసిఆర్ చర్చించారు.
ఎపి ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు కారణంగా రాష్ట్రంలో పాలమూరుకు జరుగుతున్న నష్టాన్ని కేంద్రమంత్రికి సిఎం కెసిఆర్ వివరించారని తెలుస్తోంది. పాలమూరురంగారెడ్డికి అనుమతులు, నీటి కేటాయింపులు చేయాలని షెకావత్‌ను కోరారు. కెఆర్‌ఎంబి, జిఆర్‌ఎంబి గెజిట్ అమలు తేదీ వాయిదా వేయాలని కూడా కేంద్ర మంత్రి షెకావత్ దృష్టికి తీసుకొచ్చినట్లుగా సమాచారం. ఉమ్మడి ప్రాజెక్టులనే గెజిట్ నోటిఫికేషన్ పరిధిలోకి తీసుకరావాలని సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో తెలంగాణ ఏర్పడక ముందే ప్రారంభించిన 11 ప్రాజెక్టులను కేంద్రం జారీ చేసిన గెజిటి నోటిఫికేషన్‌లో అనుమతి లేని ప్రాజెక్టులుగా పేర్కొన్నారని కేంద్ర మంత్రి షెకావత్ దృష్టికి సిఎం కెసిఆర్ తీసుకొచ్చారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని సమాచారం. అలాగే రాష్ట్రానికి కేటాయించిన 967.94 టిఎంసిలు నీటి పరిధిలోనే ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. అందులో 758.76 టిఎంసిల వినియోగానికి సంబంధించిన ప్రాజెక్టులకు కేంద్ర జలసంఘం ఇప్పటికే అనుమతులు ఇచ్చిందని గుర్తుచేశారు.
మరో 148.82 టిఎంసిల సంబంధించి నీటి లభ్యతపై హైడ్రోలజీ డైరెక్టరేట్ అనుమతులు మంజూరు చేసిందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఇక చిన్ననీటి పారుదల పథకమైన కందుకుర్తి ఎత్తిపోతల పథకం 3300 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందిస్తుందని..దీనికి అనుమతులు అవసరం లేదన్నారు. రామప్ప పాకాల లింక్, తుపాకులగూడెం బ్యారేజ్, దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగం కాబట్టి కొత్తగా అనుమతి అవసరం లేదని కేంద్రమంత్రి షెకావత్‌కు వివరించారు. అలాగే కంతనపల్లి ప్రాజెక్టును కూడా అనుమతి లేని ప్రాజెక్టుల జాబితా నుంచి తీసివేయాలని కేంద్రమంత్రిని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ కోరారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో ఉమ్మడి పాలమూరు జిల్లా శాసనసభ్యులు సి. లకా్ష్మరెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి తదితరులు కూడా ఉన్నారు.
నేడు ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొననున్న కెసిఆర్
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేంద్రహోంశాఖ ఆదివారం ప్రత్యేకంగహా ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటుచేసింది. ఇందులో తెలంగాణ, ఎపి, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ జార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల సిఎంలు పాల్గొనే అవకాశం ఉంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.