మన తెలంగాణ/హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తున్న కేంద్ర బలగాల (సిఆర్‌పిఎఫ్) ఓవరాక్షన్‌పై ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి తిరిగివచ్చిన వెంటనే ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి స మావేశంలో అధికారులు ఈ విషయా న్ని తన దృష్టికి తెచ్చినప్పుడు సిఆర్‌పిఎఫ్‌పై మండిపడ్డారు. హైవేపై టోల్‌గేట్‌ల వద్ద తనిఖీల పేరుతో ప్రతి వాహనాన్ని ఆపి చెక్ చేస్తుండటంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతోందని, హైవే వాహనాలకు మునుగోడు ఎన్నికలకు సంబంధం లేకపోయినా సిఆర్‌పిఎఫ్ సిబ్బంది అవగాహనా రాహిత్యంతో ఓవరాక్షన్ చేస్తుండడం మూ లంగా జనం బాధలు పడుతున్నారని, స్థానిక పోలీస్ అధికారులు చెప్పినా వారు వినిపించుకోవడం లేదని ఆ అధికారులు ముఖ్యమంత్రికి వివరించిన ట్లు తెలిసింది. రాష్ట ప్రభుత్వ సలహా లు, సూచనలను సంఘం అధికారులు పట్టించుకోవడంలేదని, సాధారణంగా ఎన్నికల సంఘం అధికారులు ఎక్కడి నుంచి వచ్చినా స్థానిక ప్రభుత్వ అధికారులు, పోలీస్ అధికారుల సలహాలు, సూచనలను పాటిస్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటారు. కానీ మునుగోడు ఉప ఎన్నికలకు విధులు నిర్వర్తించడానికి వచ్చిన కేంద్ర అధికారులు, సిఆర్‌పిఎఫ్ బలగాలు చేస్తూ జనాన్ని ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
అంతర్జాతీయ ప్రచారం చేయాలి
అంతర్జాతీయ స్థాయి కంపెనీలు, పెట్టుబడిదారులను రాష్ట్రానికి రప్పించాలంటే అన్ని రంగాల్లో ఘనమైన విజయాలు సాధిస్తేనే సాధ్యమవుతుందని, ఈ నేపధ్యంలో హైదరాబాద్ నగరానికి దక్కిన అరుదైన గౌరవాన్ని కూడా ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నట్లు తెలిసింది. హైదరాబాద్ నగరానికి వచ్చిన ‘వరల్డ్ గ్రీన్‌సిటీ అవార్డు- 2022’ విషయాన్ని ఎంతో ఘనంగా, గొప్పగా ప్రపంచ దేశాలకు తెలిసేలా చేయాల్సి ఉండిందని, కానీ ఆ పనిచేయడంలో అధికారులు వైఫల్యం చెందారని వ్యక్తం చేసినట్లు తెలిసింది. హైదరాబాద్ నగరానికి, రాష్ట్రానికి ఎంఎన్‌సిలు వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే వారిని ఆకర్షించే, ఆకట్టుకునే అంశాలు మన దగ్గర ఉన్నాయనే విషయాలను తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు వచ్చిన విషయాన్ని జాతీయ, అంతర్జాతీయంగా ప్రచారం చేయాల్సి ఉందని, అదే జరిగితే పెట్టుబడిదారులు హైదరాబాద్‌కు ఆకర్షితులవుతారని వారికి సిఎం వివరించినట్లు తెలిసింది. కొత్తగా కంపెనీలు ఏర్పాటు చేసే వారికి, పెట్టుబడిదారులకు అనేక రాయితీలు, నాణ్యమైన విద్యుత్తు, భూములు, నీరు, రవాణా, రోడ్డు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే సరిపోదని, ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి హాస్పిటాలిటీ ఉందని తెలిస్తే పెట్టుబడిదారులు మరింత ఉత్సాహంగా ముందుకు వస్తారన్నారు. పారిస్, మెక్సికో సిటీ, బ్రెజిల్‌లోని పోర్ట్ అలిజ వంటి నగరాలకు వెనక్కునెట్టి ఒక్క హైదరాబాద్ నగరానికి వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు రావడమంటే ఎంతో గొప్ప విషయమని, భారతదేశంలో ఏ ఒక్క నగరానికి కూడా ఇప్పటి వరకూ ఇలాంటి అవార్డు రాలేదని, అలాంటిది హైదరాబాద్‌కు వచ్చిన అవార్డు విషయాన్ని పెట్టుబడిదారులందరికీ తెలిసేటట్లు చేయాల్సి ఉండిందని అధికారులతో అన్నట్లు తెలిసింది. అందుకు తగినట్లుగా ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు విషయం ప్రపంచంలోని ఎంఎన్‌సిలు, పెట్టుబడిదారులకు తెలిసేటట్లుగా పక్కా ప్రణాళికతో రావాలని చీఫ్ సెక్రటరీ సోమేష్‌కుమార్, మున్సిపల్ వ్యవహారాల శాఖ స్పెషల్ సిఎస్ అరవింద్‌కుమార్ తదితర ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిసింది.
మాదకద్రవ్యాలపై మరింత కఠినంగా
హైదరాబాద్ నగరంలో కూడా డ్రగ్స్, ఇతర మాదకద్రవ్యాలపైన మరింత కఠినంగా వ్యవహరించాలని సమీక్షలో పాల్గొన్న హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రలను సిఎం ఆదేశించినట్లు తెలిసింది. మహానగరంలో ట్రాఫిక్ నియంత్రణ, డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా సావదానంగా, ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించినట్లు తెలిసింది. ఇంకా రాష్ట్రంలో అమలులో ఉన్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపైన కూడా ముఖ్యమంత్రి ఆరా తీసినట్లు తెలిసింది. దళితబంధు నిధుల పంపిణీ, గొర్రెల పంపిణీ పథకం వంటివి ఆన్ గోయింగ్ పథకాలే కాబట్టి అవన్నీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనల కిందకు రావుకదా… ఆ పథకాల అమలుకు కూడా ఎన్నికల సంఘం బ్రేకులు వేసిందని అధికారులు సిఎంకు నివేదించినట్లు తెలిసింది. దీనిపై సుధీర్ఘంగా చర్చించిన మీదట ఆన్ గోయింగ్ పథకాలు అడ్డంకులు సృష్టించవద్దని, ఈ పథకాలను ఆపితే ప్రజలు ఇబ్బందులు పడతారనే విషయాలను ఎన్నికల సంఘం దృష్టికి తెస్తూ లేఖలు రాయాలని నిర్ణయం తీసుకొన్నట్లుగా తెలిసింది. ఎన్నికల సంఘం వ్యవహార శైలి ప్రజలకు, ప్రభుత్వాన్ని ఇబ్బందికరంగా మారాయని కూడా అధికారులు సిఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఎన్నికల సంఘం ఇకనైనా ఆన్ గోయింగ్ పథకాలకు మోకాలడ్డకుండా అనుమతులు ఇస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.
CM KCR Meeting Police Officials in Pragathi Bhavan