Saturday, October 5, 2024

చినజీయర్‌ను కలిసిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

 

CM KCR Meets Chinna Jeeyar Swamy at Ashramam

యాదాద్రి పునఃప్రారంభం, మహా కుంభ సంప్రోక్షణ, ఆహ్వానాలపై సలహాలు, సూచనలు
ముచ్చింతల్‌లో శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల ఏర్పాట్ల పరిశీలన, ఆశ్రమంలో యాగశాలల సందర్శన, విద్యుత్, తాగునీరు, భద్రతాపరమైన అంశాలపై అధికారులకు సిఎం ఆదేశాలు
ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, సిజెఐ సహా ప్రముఖులకు ఆహ్వానాలు

యాదాద్రి పున:ప్రారంభం, మహాకుంభ సంప్రోక్షణ, ఆహ్వానాలపై సలహాలు తీసుకున్న ముఖ్యమంత్రి
వచ్చే నెల 214 వరకు జరగనున్న శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల ఏర్పాట్లు పరిశీలన

మన తెలంగాణ/హైదరాబాద్/శంషాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పునఃనిర్మించ తలపెట్టిన యాదాద్రి శ్రీలక్ష్మినరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణ పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. త్వరలోనే యాదాద్రి ఆలయం అంగరంగ వైభవంగా పునఃప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నగర శివారులోని ముచ్చింతల్‌లో ఉన్న చినజీయర్ స్వామిని కలిశారు. సిఎం కెసిఆర్‌ను ఆశ్రమ రుత్వికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పూర్ణకుంభంతో ఆలయ పున: ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేయదలచిన మహాసుదర్శన యాగం, మహా కుంభ సంప్రోక్షణ తదితర క్రతువులు, ఆహ్వానాల ఏర్పాట్లపై చినజీయర్ స్వామి సలహాలు, అభిప్రాయాలను సిఎం కెసిఆర్ తీసుకున్నారు. ఆశ్రమ సందర్శన సందర్భంగా సిఎం ఇక్కడి యాగశాలను కూడా పరిశీలించారు. యాగశాల ఏర్పాట్లపై సిఎంకు చినజీయర్ స్వామి వివరాలు తెలిపారు. చినజీయర్ స్వామి ఖరారు చేసిన ముహూర్తం ప్రకారం మార్చి 28న గర్భాలయంలోని స్వయంభువుల నిజదర్శనాలను భక్తులకు కల్పించనున్నారు.

చినజీయర్ ఆశ్రమంలోని దివ్య సాకేతంలో వచ్చే నెల 2 నుంచి 14వ తేదీ వరకు జరగబోయే శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల సంరంభం సందర్భంగా సహస్ర కుండాత్మక లక్ష్మీనారాయణ యాగం నిర్వహించనున్నారు. ఇందులో 1,035 హోమగుండాలతో ప్రత్యేక యాగం చేయనున్నారు. ఇందుకోసం 2 లక్షల కిలోల ఆవు నెయ్యితో పాటు ఇతర హోమ ద్రవ్యాలు వినియోగించనున్నారు. సుమారు 200 ఎకరాల్లో భగవద్రామానుజుల 216 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. 12 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. రోజుకు కోటిసార్లు నారాయణ మంత్ర పఠనం ఉంటుంది. మొత్తం 128 యాగశాలల్లో హోమం నిర్వహిస్తారు. రూ.1200 కోట్ల రూపాయలతో సమతామూర్తి విగ్రహాన్ని రూపొందించారు. రెండో అంతస్తులో ఐదు అడుగుల బంగారు విగ్రహం ఉంటుంది. ఇందుకోసం 120 కిలోల బంగారాన్ని వినియోగించారు. ఈ సహస్రాబ్ది వేడుకల కోసం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఇప్పటికే ఆహ్వానించారు.

దేశంలోని అత్యంత ముఖ్యులు హాజరుకానున్న ఈ యాగానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సిఎం కెసిఆర్ ఆదేశించారు. యాగానికి సంబంధించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా యాగం జరిగే ప్రాంతంలో ఫైరింజన్లు సిద్ధంగా ఉంచాలన్నారు. దీంతో పాటుగా యాగ స్థలికి మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఎఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన సిఎం… యాగం సమయంలో నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలన్నారు. అలాగే మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. సిఎం వెంట మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్, మై హోం అధినేత రామేశ్వరరావు తదితరులు ఉన్నారు.

CM KCR Meets Chinna Jeeyar Swamy at Ashramam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News