Tuesday, November 19, 2024

దళితబంధు ఓ ఉద్యమం

- Advertisement -
- Advertisement -

CM KCR Meets Huzurabad Delit people at Pragathi Bhavan

 

దళితుల ఆర్థిక సాధికారత దిశగా పెద్ద అడుగు
దళితబంధు ఆర్థికాభివృద్ధి పథకాల జాబితా
లబ్ధిదారులకు దళితబీమా, రక్షణ నిధి
అర్హులకు గుర్తింపుకార్డులు, అందులో బార్ కోడ్‌తో కూడిన ఎలెక్ట్రానిక్ చిప్
పథకం అమలు సమాచారాన్ని పొందుపరిచే ఏర్పాటు
ప్రగతిభవన్‌లో 8 గంటల పాటు సాగిన తొలి అవగాహన సదస్సు

హుజూరాబాద్ ఆచరణే పథకం అమలుకు దిక్సూచి
సదస్సులో పాల్గొన్న వారందరూ దళితులకు అవగాహన కల్పించాలి
ఒక్కో రంగాన్ని బాగు చేసుకుంటూ వస్తున్నాం
అధికారులు దళితవాడల్లో మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలి
అన్ని రకాల భూ సమస్యలు పరిష్కరించాలి
వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించాలి
ఇతర రాష్ట్రాలు మన వద్ద నేర్చుకునేలా పని చేయాలి : దళితబంధు అవగాహన సదస్సులో సిఎం కెసిఆర్

వెలివాడల వాకిళ్లలో వెన్నెల్లే కురవాలి – ఎంఎల్‌సి గోరేటి వెంకన్న
ఈ పథకం దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పుకి దారులు వేస్తుంది – సిపిఐ రాష్ట్ర నేత బాల నర్సింహా
మేకలనే బలిస్తారు, పులులను కాదు అన్న అంబేడ్కర్ ఆశయం నేరవేరుతుంది – సిపిఎం అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి వెంకట్

నైపుణ్యం, ప్రతిభ ఉన్న దళిత వర్గాన్ని, అంటరాని తనం పేరుతో ఊరి అవతల ఉంచి ఉత్పాదక రంగానికి దూరం చేయడం బాధాకరం. మహిళలను జెండర్ పేరుతో అనుత్పాదక రంగానికి పరిమితం చేయడం తెలివి తక్కువ పని, ఇది దుర్మార్గం. మనలో నిబిడీకృతమై ఉన్న పులి లాంటి శక్తిని గుర్తించి ముందుకు సాగాలి. విజయం సాధించాలంటే దళారులు, శత్రువులను దూరం ఉంచాలి. దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసులో దోషులుగా తేలిన పోలీసులను ఉద్యోగంలోంచి ప్రభుత్వం శాశ్వతంగా తొలగించింది. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఎల్ల వేళలా అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వం స్వయంగా అండగా ఉన్నప్పుడు విజయం సాధించేందుకు దళిత సమాజం పట్టుదలతో స్వీయ అభివృద్ధికి పూనుకోవాలి. -ముఖ్యమంత్రి కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: ‘దళితబంధు పథకం’ లబ్ధిదారులకు ‘దళిత బీమా’ను వర్తింపచేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ప్రగతిభవన్‌లో సోమవారం హుజూర్‌నగర్ నియోజకవర్గానికి చెందిన దళిత బంధువులతో సిఎం కెసిఆర్ సమావేశమయ్యారు. సుమారు 8 గంటల పాటు సాగిన సమావేశంలో దళిత ప్రతినిధులకు ‘దళితబంధు పథకం’ గురించి వివరంగా సిఎం కెసిఆర్ తెలియచేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ దళిత బంధు కేవలం కార్యక్రమం కాదనీ, దీనిని ఉద్యమంగా భావించాలని -సిఎం కెసిఆర్ సూచించారు. గ్రామాల్లోని ఇతర వర్గాలు దళితుల వద్దకే అప్పు కోసం వచ్చే దిశగా దళితులు ఆర్థిక సాధికారత సాధించాలని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. హుజూరాబాద్ నుంచి వచ్చిన ప్రతినిధులు సాధించే విజయం మీద యావత్ తెలంగాణ దళిత బంధు విజయం ఆధారపడి ఉంటుందని అందరూ ఆ దిశగా ధృఢ నిశ్చయంతో ముందుకెళ్లాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. ఒక్కడితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం భారత రాజకీయ వ్యవస్థ మీద వత్తిడి తెచ్చి విజయం సాధించి పెట్టిందన్నారు. తాను నమ్మిన ధర్మానికి కట్టుబడి మన ప్రయాణం కొనసాగించినప్పుడే విజయం సాధ్యమని కెసిఆర్ పేర్కొన్నారు. డా.బాబాసాహెబ్ అంబేద్కర్ కృషితో దళిత సమాజంలో వెలుతురు ప్రసరించిందన్నారు. మనిషిని మనిషి వివక్ష చూపే దుస్థితి మీద (సెంటర్ ఫర్ సుభాల్టర్న్) స్టడీ ద్వారా తాను అధ్యయనం చేశానని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. మనలో పరస్పర అవిశ్వాసం, సహకారం పెరగాలని, కక్ష కార్పణ్యాలు ద్వేషాలు పోవాలని సిఎం కెసిఆర్ సూచించారు. దళిత వాడల్లో ఇప్పటికే నమోదైన పరస్పర కేసులను ఉపసంహరించుకోవాలని పరస్పర సౌభ్రాతృత్వాన్ని పెంచుకోవాలని, అప్పుడే మన విజయానికి బాటలు పడతామని సిఎం పేర్కొన్నారు. ఆర్థికంగా పటిష్టమయినప్పుడే దళితులు వివక్ష నుంచి దూరం అవుతారన్నారు.

సదస్సులో పాల్గొన్న వారు దళితులకు అవగాహన కల్పించాలి
ప్రస్తుతం సదస్సులో పాల్గొన్న వారు హుజూరాబాద్‌లో విజయం సాధించి రానున్న రోజుల్లో, తెలంగాణ వ్యాప్తంగా దళితులకు అవగాహన కల్పించాలని సిఎం పిలుపునిచ్చారు. దళితబంధు కార్యక్రమం విజయవంతం చేస్తే దళితుల అభివృద్ధితో పాటు తెలంగాణ ఆర్థికాభివృద్ధికి దారులు వేస్తదని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. నైపుణ్యం, ప్రతిభ ఉన్న దళిత వర్గాన్ని, అంటరాని తనం పేరుతో ఊరి అవతల నుంచి ఉత్పాదక రంగానికి దూరం చేయడం బాధాకరమన్నారు. మహిళలను జెండర్ పేరుతో అనుత్పాదక రంగానికి పరిమితం చేయడం, తెలివి తక్కువ పని అని ఇది దుర్మార్గమని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. మనలో నిబిడీకృతమై ఉన్న పులి లాంటి శక్తిని గుర్తించి ముందుకు సాగాలని సిఎం కెసిఆర్ సూచించారు. విజయం సాధించాలంటే దళారులు, శత్రువులను దూరం ఉంచాలని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసులో దోషులుగా తేలిన పోలీసులను ఉద్యోగంలోంచి ప్రభుత్వం శాశ్వతంగా తొలగించిందని సిఎం కెసిఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఎల్ల వేళలా అందుబాటులో ఉంటుందని, ప్రభుత్వం స్వయంగా అండగా ఉన్నప్పుడు విజయం సాధించేందుకు దళిత సమాజం పట్టుదలతో స్వీయ అభివృద్ధికి పూనుకోవాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు.

ప్రభుత్వ లబ్ధిదారుడి భాగస్వామ్యంతో, శాశ్వత ప్రాతపదికన ‘దళిత రక్షణ నిధి’
ప్రభుత్వ వర్గాలతో పనితీసుకునే క్రమంలో నేటి సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు కాపలా వర్గంగా డేగ కన్నుతో పనిచేయాలని, పథకం పటిష్ట అమలుకు మమేకమై పనిచేయాల్సిన అవసరం ఉందని సిఎం కెసిఆర్ సూచించారు. ఎరువుల దుకాణాలు, మెడికల్ షాపులు, రైస్ మిల్లులు, వైన్స్ షాపులు తదితర ఆర్థిక అభివృద్ధికి అవకాశం ఉండే రంగాల్లో దళితులకు ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తుందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. దళిత బంధు పథకం ద్వారా అందించే ఆర్థిక సాయానికి అదనంగా, ప్రభుత్వ లబ్ధిదారుడి భాగస్వామ్యంతో, శాశ్వత ప్రాతపదికన ‘దళిత రక్షణ నిధి’ని ఏర్పాటు చేస్తామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. దళిత రక్షణ నిధిని ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణతో లబ్ధిదారుల కమిటీతో నిర్వహించ నున్నట్టు సిఎం తెలిపారు. ప్రతీ ఏటా కనీస డబ్బును జమ చేస్తూ, దళిత రక్షణ నిధిని నిరంతరంగా కొనసాగిస్తూ, ఆర్థికంగా మరింత పటిష్టంగా నిలదొక్కుకునే దిశగా వినియోగించుకుంటామని సిఎం తెలిపారు. ఆర్థికాభివృద్ధికి అవకాశం వుండే ఇతర రంగాలను గుర్తించాలని, వాటిలో దళితులకు రిజర్వేషన్ లు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశించారు.

అవకాశం లేక సహకారం లేక బాధ పడే వారి కోసం….
పవర్ టిల్లర్, హార్వెస్టర్, వరి నాట్ల వంటి వ్యవసాయ యంత్రాలు, ఆటోలు ట్రాక్టర్, కోళ్ల పెంపకం, టెంట్ హౌజ్, డైరీ పరిశ్రమ, ఆయిల్ మిల్లు పిండి మిల్లు, సిమెంట్ ఇటుకల ఇండస్ట్రీ, హోటల్, స్టీల్ సిమెంట్ వంటి బిల్డింగ్ మెటీరియల్ షాప్స్, ఫోటోగ్రఫీ, వీడియో గ్రఫీ, సెల్ ఫోన్ షాప్స్, మొబైల్ టిఫిన్ సెంటర్స్, హోటల్స్, క్లాత్ ఎంపోరియం, ఫర్నీచర్ షాప్ వంటి పలు రకాల ఉపాధి, పరిశ్రమ, వ్యాపార రంగాలను గుర్తించి వారి వారి ఇష్టాన్ని బట్టి, దళితబంధు పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తామని సిఎం తెలిపారు. ఎవరైతే అవ కాశం లేక సహకారం లేక బాధ పడుతున్నారో అటువంటి వర్గాలకు దళితబంధు దారులు వేస్తదని సిఎం తెలిపారు. మీ విజయం ఇతర కులాలకు వర్గాలకు, పక్క రాష్ట్రాలకు మాత్రమే కాదు, దేశానికే వెలుతురు ప్రసరింప చేస్తదని ఆయన పేర్కొన్నారు. దళితులు విజయం సాధించి వెలుగు దివ్వెలు, కరదీపికలుగా మారాలని, హుజూరాబాద్ గెలుపు దేశ చరిత్రలోనే స్థిరస్థాయిగా నిలుస్తుందని, ఆ పట్టుదల మీలో పెరగాలని, మీ దగ్గరినుంచి ప్రసరించే విజయం వెలుతురు రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ప్రసరించాలని సిఎం కెసిఆర్ ఆకాక్షించారు.

అర్హులకు గుర్తింపు కార్డును అందిస్తాం
దళితబంధు పథకం ద్వారా లబ్ధిపొందే అర్హులకు గుర్తింపు కార్డును అందిస్తామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ప్రతి లబ్ధిదారునికి ప్రత్యేకమైన బార్ కోడ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ చిప్‌ను ఐడి కార్డులో చేర్చి పథకం అమలు తీరును ఎప్పటికప్పుడు సమాచారాన్ని పొందుపరుస్తామన్నారు. నిరంతర పర్యవేక్షణ ద్వారా ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్తలు తీసుంటామని, లబ్ధిదారుడు తాను ఎంచుకున్న పని ద్వారా ఆర్థికంగా ఎదగాలి తప్ప జారి పడనివ్వమని ముఖ్యమంత్రి హామినిచ్చారు.

‘దళిత బీమా’ను వర్తింపచేసే దిశగా ప్రభుత్వం ఆలోచన
‘దళితబంధు పథకం’ లబ్ధిదారులకు, ‘దళిత బీమా’ను వర్తింపచేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని సిఎం తెలిపారు. రైతుబీమా మాదిరి పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి దళిత బీమాను అమలు పరుచుకుందామని ఆయన పేర్కొన్నారు. మంత్రి సహా, దళిత ప్రజా ప్రతినిధులు, ఎస్సీ డెవలప్ మెంట్ శాఖ ఉన్నతాధికారులు, ఈ దిశగా కార్యాచరణపై కసరత్తు చేయాలని ఆయన ఆదేశించారు. ఆమోదయోగ్యమైన కార్యాచరణను రూపొందించుకొని, కొంచెం ఆలస్యమైనా, దళిత బీమాను పటిష్టంగా అమలు చేసుకోవాలన్నారు.

మూడు దశలను పాటించాలి
దళితుల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా దళిత బంధు పథకం అమలు సందర్భంగా మూడు దశలను పాటించాలని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. అందులో భాగంగా దళితుల అసైన్డ్, గ్రామకఠం, తదితర భూ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని ఆయన సూచించారు. దళిత వాడల్లో మౌలిక వసతులను సంపూర్ణ స్థాయిలో మెరుగు పరచడంతో పాటు దళితబంధు పథకాన్ని అమలు చేయాలన్నారు.

ఒక్కో వర్గాన్ని, ఒక్కో రంగాన్ని బాగు చేసుకుంటూ వస్తున్నాం
రాష్ట్ర ఏర్పాటు అయినంకా ఒక్కో వర్గాన్ని, ఒక్కో రంగాన్ని బాగు చేసుకుంటూ వస్తున్నామని సిఎం తెలిపారు. అదే పద్ధతిలో దళిత సమాజ అభివృద్ధికి చర్యలు ప్రారంభించామని, దళితుల అభివృద్ధికి తెలంగాణ యావత్ సమాజ సంపూర్ణ సహకారం లభిస్తుంది –సిఎం కెసిఆర్ తెలిపారు. తెలంగాణ దళిత బంధు పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో వారికిష్టమైన పరిశ్రమను, ఉపాధిని, వ్యాపారాన్ని ఎంచుకొని, తెలంగాణ దళిత సమాజం వ్యాపార వర్గంగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. గ్రామాల్లోని ఇతర వర్గాలు దళితుల వద్దకే అప్పుకోసం వచ్చే దిశగా దళితుల ఆర్థిక సాధికారత సాధించాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అమల్లోకి తెచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం దళితాభివృద్ధి కోసం చేస్తున్న చారిత్రక కృషిలో విద్యావంతులైన దళిత సమాజం కదలిరావాలని సిఎం పిలుపునిచ్చారు.

తాగునీరు, రోడ్లు తదితర మౌలిక వసతులను వెంటనే కల్పించాలి
హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానున్న తెలంగాణ దళిత బంధు పథకాన్ని విజయవంతం చేయడం కోసం సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు పట్టుపట్టి పనిచేయాలన్నారు. తద్వారా తెలంగాణతో పాటు దేశ దళిత సమాజంలో అభివృద్ధి వెలుగులు ప్రసరింప చేసేందుకు దోహదపడాలన్నారు. దళితులను ఆర్థిక వివక్షనుంచే కాకుండా సామాజిక వివక్ష నుంచి దూరంచేసి వారి ఆత్మగౌరవాన్ని ఎత్తిపట్టేందుకే తెలంగాణ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నామని సిఎం పునరుద్ఘాటించారు. దళిత జాతి సముద్దరణలో భాగంగా, దళిత బంధు పథకం అమలుతో పాటు, దళిత వాడలల్లో మిగిలివున్న, తాగునీరు, రోడ్లు తదితర మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలని
అధికారు లకు సిఎం కెసిఆర్ ఆదేశించారు.

అసైన్డ్ సహా దళితుల అన్నిరకాల భూ సమస్యలను పరిష్కరించాలి
వారం పదిరోజుల్లో హుజూరాబాద్ లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి , అసైన్డ్ సహా దళితుల అన్నిరకాల భూ సమస్యలను పరిష్కారం చేయాలి- కలెక్టర్ కర్ణన్‌కు సిఎం కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. హుజూరాబాద్ నియోజక వర్గ దళిత ప్రజల డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్ సమస్యలన్నీ గుర్తించి, వారిని కలెక్టర్ ఆఫీస్‌కు పిలిపించుకొని పరిష్కరించాలని ఆయన కలెక్టర్‌కు సూచించారు.

వివిధ వ్యాధులతో బాధ పడుతున్న వారిని గుర్తించాలి
హుజూరాబాద్‌లోని ప్రతి దళిత వాడల్లో వివిధ వ్యాధులతో బాధ పడుతున్న వారిని గుర్తించాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన నివేదిక తయారు చేసి అధికారులకు అందజేస్తే వారికి ప్రభుత్వమే ఉచితంగా వైద్య సాయం అందిస్తుందని సిఎం హామినిచ్చారు. హుజూరాబాద్‌లో ఇల్లు లేని దళిత కుటుంబం ఉండొద్దని, వందశాతం పూర్తి కావాలని, హుజూరాబాద్‌లో ఖాళీ జాగాలు ఉన్న వారి ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తదని, దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు దీనిని అమలు చేస్తామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

ఇతర రాష్ట్రాలు నేర్చుకునే విధంగా పని చేయాలి
తెలంగాణాలో అన్ని పథకాలను చూసి నేర్చుకున్నట్టే, దళిత బంధు పథకాన్ని చూసి కూడా ఇతర రాష్ట్రాలు నేర్చుకునే విధంగా పని చేయాలి – సిఎం కెసిఆర్ సూచించారు. రేషన్ కార్డులు, పింఛన్లు సహా అన్ని రకాల సమస్యలను, హుజూరాబాద్ నియోజకవర్గ దళితవాడల్లో గుర్తించి అధికారులకు నివేదిక అందజేయాలని -సదస్సులో పాల్గొన్న ప్రతినిధులకు సిఎం కెసిఆర్ సూచించారు. పథకంలో ఇంకా ఏమైనా మార్పులు, చేర్పులుంటే సూచించాలని వారి అభిప్రాయాలను సిఎం కెసిఆర్ అడిగి తెలుసుకున్నారు. దళిత బంధు పథకం గురించి మీ కుటుంబ సభ్యులు ఏమని చర్చించుకుంటున్నారని సిఎం ఆరా తీశారు. దళిత బంధు పథకం తెలంగాణ దళితుల పాలిటి వరం అని ఈ సదస్సలో పాల్గొన్నవారు సిఎంకు ధన్యవాదాలు తెలిపారు.

మాకూ పాల్గొనే అవకాశం కల్పించండి: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
అద్భుతమైన స్కీం. ఈ ఆలోచన రావడమే గొప్ప. మీకు జాతి రుణపడి ఉంటది. పథకం పటిష్ట అమలు కోసం నోడల్ ఏజెన్సీని నియమించాలి. దళిత ప్రజా ప్రతినిధులను పైలట్ నియోజక వర్గంలో పాలుపంచుకునే అవకాశం కల్పిస్తే నేర్చుకుంటాం. రేపటినాడు మా నియెజకవర్గాల్లో అమలుకు మార్గం సులువవుతుంది.

సిఎం కెసిఆర్ ఏ పథకం పెట్టినా విజయవంతం: కడియం శ్రీహరి
ముఖ్యమంత్రి కెసిఆర్ ఏ పథకం పెట్టినా విజయవంతం అవుతది. రైతుబంధును ఆదర్శంగా తీసుకొని కేంద్రం దేశవ్యాప్తంగా రైతులకు కొంత ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. బ్యాంకుల ప్రమేయం లేకుండా, గ్యారెంటీ లేకుండా నేరుగా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. దళితులను పులులుగా మార్చే అవకాశం సిఎం కల్పించారు.

సిపిఎం అనుబంధ జాతీయ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి వెంకట్
మేకలనే బలిస్తారు….పులులను కాదు..అనే డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా, దళితులను పులులుగా మార్చే అవకాశం సిఎం కెసిఆర్ అమలు చేయ బోయే దళిత బంధు పథకం ద్వారా సాధ్యం అవుతుంది. ఈ విశ్వాసం కలిగినందునే తాను ఈ మీటింగ్‌కు వచ్చాను. తెలంగాణలో విజయం సాధించిన అనంతరం, దేశమంతా దళితబంధు పథకాన్ని అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. దళితులు వృథా ఖర్చులు చేస్తారనే అపోహను పటాపంచలు చేసి దళితులు కూడా అవకాశాలు వస్తే సద్వినియోగం చేసుకుంటారని, దళిత బంధు పథకాన్ని విజయం చేసి నిరుపిద్దాం. హుజూరాబాద్ లో విజయం సాధించి దేశ దళిత జాతి ఆర్థికాభివృద్ధి కి దారులు వేద్దాం. దళిత జాతి ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటుదాం.
దేశ వ్యాప్తంగా దళితబంధు వంటి పథకం అమలు కోసం పోరాడుతాం

సిపిఐ రాష్ట్ర నేత బాల నర్సింహా
గత పాలకులు, అరకొర నిధులతో దళితుల కోసం అమలు పరిచిన పథకాలు వారి ఆర్థికాభివృద్ధి దోహదం చేయలేదు. పైగా దళితులకు ప్రభుత్వాలు ఏవో చేస్తున్నాయని వారు సరిగ్గా వినియోగించు కోవడం లేదని దళితుల పట్ల అపోహలను పెంచాయి. రాజకీయాలకు అతీతంగా ఎక్కువ మొత్తం లో పది లక్షల రూపాయలతో సిఎం కెసిఆర్ అమలు పరుస్తున్న దళిత బంధు స్కీం దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పుకు దారులు వేస్తుంది. దేశ వ్యాప్తంగా దళితబంధు వంటి పథకం అమలు కోసం పోరాడుతాం. హుజూరాబాద్ పైలట్ ప్రాజెక్టు విజయవంతం కాకపోతే దాని ప్రభావం తెలంగాణతో పాటు దేశం మీద పడుతుంది. కాబట్టి దళితులు పట్టుదలతో ఒక యజ్ఞంలాగా భావించి పథకం అమలుకోసం కృషి చేసి, హుజూరాబాద్ దేశానికే దిక్సూచి కావాలి. పట్టుదలతో దళితుల సమాజిక ఆర్థిక అభివృద్ధికి పాటు బడుతున్న సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు.
ప్రస్తుతం దళితుల గురించి ఆలోచన చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుంది

కవి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న
చిన్న లోన్ కోసం తన్లాడిన దళితులకు పది లక్షల రూపాయలు దళిత బంధు ద్వారా ఉపాధి కోసం పూర్తి ఉచితంగా ఇవ్వడం సిఎం కెసిఆర్ మానవీయ నిర్ణయం. ఇది గొప్పది. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ తర్వాత దళితుల గురించి ఆలోచన చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుంది. ఇది దేశం లోనే విప్లవాత్మక మార్పులకు దారి తీస్తుంది. ఉద్యమ స్పూర్తితో జరుగుతున్న తెలంగాణ అభివృద్ధిలో మాలాంటి వాళ్లను ప్రజా ప్రతినిధులను చేసి భాగస్వామ్యం చేస్తున్నందుకు ధన్యవాదాలు. సిఎం కెసిఆర్ అందించే ఆర్థిక సాయం ద్వారా, అణచివేతకు గురైన దళిత జాతి తాము అభివృద్ధి చెంది పదిమందికి ఆదర్శంగా నిలిచి సంస్కారవంతమైన జాతిగా మారినప్పుడే, వివక్షను అధిగమించి ఆర్థిక సామాజిక ఆత్మ గౌరవంతో నిలిచినప్పుడే దళితులు సిఎం కెసిఆర్‌కు నిజమైన కృతజ్ఞతను తెలిపిన వాళ్లం అవుతాం.
‘దళితుల జీవితాల్లో మౌలిక మార్పుకు శ్రీకారం చుట్టాలె
సామాజిక సమరసత కు దారులు అదివేయాలె..
వివక్షతల అంతానికి చరమగీతం పాడాలె..
వెలివాడల వాకిల్లిలో వెన్నెల్లే కురువాలె ”….
సదస్సులో కవి ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న కవితాత్మక సందేశాన్ని వినిపించారు.

దళితులు ఆత్మగౌరవంతో తలెత్తుకోని తిరుగుతారు: రసమయి బాలకిషన్
‘దళిత బంధు పథకం’ ద్వారా తెలంగాణ దళితులు ఆత్మగౌరవంతో తలెత్తుకోని తిరుగుతారు. అణగారిన జీవితాల్లో వెలుగులు నింపే సాహసో పేత పథకం తెచ్చినందుకు దళిత జాతి తరఫున సిఎం కెసిఆర్‌కు కృతజ్జతలు తెలుపుతున్నా. ఇప్పటికే విదేశీ విద్యను దళితులకు అందించిన ఘనత సిఎం కెసిఆర్‌కు మాత్రమే దక్కుతుంది. అరవై లక్షల తెలంగాణ జీవితాలల్లో వెలుగులు నింపే గురుతర బాధ్యత హుజూరాబాద్ పైలట్ ప్రాజెక్టు విజయం మీద ఆధారపడి ఉంది

ఆర్థికాభివృద్ధి పథకాల జాబితా
తెలంగాణ దళిత బంధు పథకం అమలులో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు వివిధ రంగాలను ఉదహరిస్తూ సూచనాత్మక ఆర్థికాభివృద్ధి పథకాల జాబితాను ఎస్సీ సంక్షేమ శాఖ రూపొందించి సదస్సులోని ప్రతినిధులకు అందించింది. అందులో గ్రామీణ, ఉప పట్టణ, పట్టణ ప్రాంతాల్లో ఎంచుకునేందుకు అనువైన వ్యాపార, ఉపాధి, రంగాలను గుర్తించింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

‘దళితబంధు పథకం’లో భాగంగా ఆర్థికాభివృద్ధి పథకాల జాబితా
రూరల్ (గ్రామీణ) ప్రాంతాల్లో..
మినీ డెయిరీ యూనిట్, పందిరి కూరగాయల సాగు, వరినాటు యంత్రాలతో పాటు పవర్ టిల్లర్, వేపనూనె పిండి తయారీ, ఆటో ట్రాలీ పథకాలున్నాయి.
రూరల్ (గ్రామీణ), ఉప పట్టణ (సబ్ అర్బన్) ప్రాంతాల్లో..
వ్యవసాయ సాగు కొరకు యంత్ర పరికరాల సేల్స్, మట్టి ఇటుకల తయారీతో పాటు ఆటో ట్రాలీ, ట్రాక్టర్ మరియు ట్రాలీ, కోళ్ల పెంపకంతో పాటు ఆటో ట్రాలీ (సుగుణ, వెంకోబ్ ఫ్రాంచేజ్) పథకాలున్నాయి.
రూరల్ (గ్రామీణ), సబ్ అర్బన్ (ఉప పట్టణ), అర్బన్ (పట్టణ) ప్రాంతాల్లో..
సెవన్ సీటర్ ఆటో, ప్యాసింజర్ ఆటో రిక్షా, త్రీ వీలర్ ఆటో ట్రాలీ, విత్తనాలు/ఎరువుల, క్రిమిసంహారక మందుల దుకాణం (ప్రభుత్వ అనుమతితో), టెంట్ హౌస్‌తో సహా డెకొరేషన్ లైటింగ్, సౌండ్ సిస్టమ్ తోపాటు, ఆటో ట్రాలీ, మడిగల నిర్మాణం, వ్యాపారం, ఆయిల్ మిల్, పసుపు, కారం, బియ్యం పిండి గిర్నీల పథకాలున్నాయి.
సబ్ అర్బన్ (ఉప పట్టణ), అర్బన్ (పట్టణ) ప్రాంతాల్లో..
ప్రయాణికులు/సరుకుల రవాణాకు నాలుగు చక్రాల వాహనం, ఎలక్ట్రానిక్ గూడ్స్ సేల్స్, డయాగ్నస్టిక్ ల్యాబ్, మెడికల్ షాప్, ఎలక్ట్రికల్ షాప్, బ్యాటరీ సేల్స్ అండ్ సర్వీసెస్, హార్డ్ వేర్ శానిటరీ షాప్‌త్ పాటు ఆటో, సిమెంట్ ఇటుకలు/ రింగుల తయారీ ప్రీ కాస్టింగ్ స్ట్రక్చర్‌తో పాటు ఆటో ట్రాలీ, సెంట్రింగ్/ఆర్‌సిసి రూఫ్ మేకింగ్ (స్టీల్, వుడెన్), కాంక్రీట్ రెడీ మిక్స్ తయారీ యంత్రం, అకృలిక్ షీట్స్, టైల్స్ వ్యాపారంతో పాటు ఆటో ట్రాలీ పథకాలున్నాయి.
హాస్టళ్లకు కూరగాయలు, ఆహార పదార్థాల సరఫరా కోసం 2 ఆటో ట్రాలీలు
హోటల్, క్యాటరింగ్ (ధాబా)తో పాటు ఆటో ట్రాలీ, ఐరన్ గేట్స్, గ్రిల్స్ తయారీ యూనిట్ తో పాటు ఆటో ట్రాలీ, మెడికల్- జనరల్ స్టోర్స్ (ప్రభుత్వ అనుమతితో), మినీ సూపర్ బజార్, డిటిపి, మీసేవ, సిఎస్సీ ఆన్‌లైన్ సర్వీస్, ఫొటో స్టుడియో, బిల్డింగ్ మెటీరియల్ స్టోర్స్/హార్డ్ వేర్, మార్బుల్, పాలిషింగ్ /గ్రానైట్ కటింగ్/పీఓపీ, ఫుడ్ రెస్టారెంట్, సిమెంట్/ స్టీల్ దుకాణం (సబ్ డీలర్ షిప్), పశువులు, కోళ్లదాణా తయారీ కేంద్రంతో పాటు ఆటో ట్రాలీ, చెప్పులు/లెదర్ గూడ్స్ షాపు, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ డ్రోన్ కెమెరా (అన్ని ఫంక్షన్ల కోసం), ప్రభుత్వ అనుమతులతో రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లకు కూరగాయలు, ఆహార పదార్థాల సరఫరా కోసం 2 ఆటో ట్రాలీలను అందించే పథకాలున్నాయి.
పట్టణ (అర్బన్) ప్రాంతాల్లో..
మొబైల్ టిఫిన్ సెంటర్ (4 వీలర్స్), క్లాత్ ఎంపోరియం-టెక్స్ టైల్, రెడీమేడ్ గార్మెంట్స్ షోరూం, పేపర్ ప్లేట్స్/గ్లాసెస్, బ్యాగ్స్, తయారీ యూనిట్ (ఆటో ట్రాలీతో కలిపి), కార్ టాక్సీ (క్యాబ్), ఎంబ్రాయిడరీ, టైలరింగ్, లేడీస్ ఎంపోరియం, కిచెన్ వేర్- ఫర్నీచర్ షాప్ (సేల్స్, సర్వీస్), ఫ్లెక్సీ, వినైల్ డిజిటల్ ప్రింటింగ్ (ఆటో ట్రాలీతో కలిపి), డిజిటల్ ఫొటో స్టుడియో ల్యాబ్, ఆటో మొబైల్ షాప్- సర్వీసింగ్ యూనిట్, డిస్పోజబుల్ పేపర్ ప్లేట్స్, గ్లాసెస్, పేపర్ న్యాప్కిన్స్ సేల్స్ షాపు మొదలైన పథకాలున్నాయి.
హుజూరాబాద్‌కు చెందిన సుమారు 450 మంది ప్రతినిధుల హాజరు
సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రారంభమైన తెలంగాణ దళిత బంధు అవగాహన సదస్సులో దళిత సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, గోరటి వెంకన్న, ప్రభాకర్, రాజేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, తాటికొండ రాజయ్య, ఆరూరి రమేశ్, రసమయి బాలకిషన్, గ్యాదరి కిషోర్, చంటి క్రాంతి కిరణ్, సండ్ర వెంకట వీరయ్య, దుర్గం చిన్నయ్య, హన్మంత్ షిండే, సుంకె రవిశంకర్, కె.మానిక్ రావు, కాలె యాదయ్య, మెతుకు ఆనంద్, జి.సాయన్న, విఎం అబ్రహం, చిరుమర్తి లింగయ్య, సిపిఎం, సిపిఐ జాతీయ నేతలు వెంకట్, బాలనర్సింహ., ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, టిఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, సిఎంఓ అధికారి ప్రియాంక వర్గీస్, ఎస్సీ కార్పొరేషన్ ఎండి కరుణాకర్, కరీంనగర్ కలెక్టర్ కర్ణన్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, ప్రభుత్వ ఉన్నతాధికారులు, హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన సుమారు 450 మంది ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

CM KCR Meets Huzurabad Delit people at Pragathi Bhavan

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News