పెండింగ్‌లోని విభజన అంశాలపైనా పార్లమెంట్‌లో పట్టుపట్టాలి
అందుబాటులోని ఎంపిలు, మంత్రులతో భేటీలో ముఖ్యమంత్రి కెసిఆర్ సూచన
మన తెలంగాణ/హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల అంశానికి సంబంధించి పార్లమెంట్‌లో తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి? ఎలా ముందుకు వెళ్దాం? అన్న అంశాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ సమాలోచనలు చేశారు. ఇందులో భాగంగా అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీలోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, అధికారులతో శనివారం ప్రగతిభవన్‌లో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బియ్యం కొనుగోళ్లపై రెండు రోజుల క్రితం పార్లమెంట్‌లో కేంద్రం చేసిన ప్రకటనపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలోని బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్రం స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి? భవిష్యత్తులో రైతులను వరి కాకుండా ఇతర ప్రత్యామ్నాయ పంటలు వేసేలా ఎలా ప్రొత్సహించాలి? తదితర అంశాలపై సిఎం కెసిఆర్ కూలంకషంగా చర్చించారు. అలాగే ధాన్యం కొనుగోలుపై పార్లమెంట్‌లో పార్టీ ఎంపీలు ఐదు రోజులుగా సభా కార్యక్రమాలను స్థంభింప చేసిన విధానం, రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన విధానంతో పాటు దీనిపై కేంద్రం నుంచి వచ్చిన స్పందన వంటి అంశాలపై కూడా కెసిఆర్ చర్చించారు. సోమవారం నుంచి పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు ఆయన స్పష్టంగా దిశానిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై జాతీయ విధానం ఉండేలా కేంద్రంపై ఎలా ఒత్తిడి తీసుకురావాలి? ఇతర రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్న వేళ వారితో ఎలా సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలనే అంశంపై ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది.
అలాగే ధాన్యం కొనుగోలుపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై ఇతర పార్టీల అభిప్రాయాలను తీసుకుని వారి సహకారంతో మరింత ఒత్తడి తీసుకొస్తే ఎలా ఉంటుంది? మనతో కలిసి వచ్చే పార్టీలు ఎన్ని? సభలో వారి శక్తి ఎంత? తదితర అంశాలపై కూడా సిఎం సమగ్రంగా చర్చించారని సమాచారం. ప్రధానంగా బిజెపి పాలనపై విరుచుకపడుతున్న ప్రధాన ప్రతిపక్షాలన్నింటిని కలుపుకుని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకవెళ్లడం ద్వారా కేంద్రం ఆలోచనలో ఏదైనా మార్పు వచ్చే అవకాశం ఉందా? విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏ మేరకు ఉందన్న అంశాలపై కూడా కెసిఆర్ లోతుగా మంత్రులు, పార్లమెంట్ సభ్యులతో చర్చించారు. ఈ అంశంలో ఎవరి నుంచి సహకారం వచ్చినా….రాకపోయినా…రైతుల ప్రయోజనాల కోసం సభలో రాజీలేని పోరాటం చేయాల్సిందేనని ఈ సందర్భంగా ఎంపిలకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది. రైతులకు న్యాయం జరిగే విషయంలో ప్రస్తుతం మన (టిఆర్‌ఎస్) స్టాండ్‌లో ఎలాంటి మార్పులు లేవని ఆన స్పష్టం చేశారని అత్యంత విశ్వసనీయ వర్గాల్లో ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి తిరిగి సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లపై మన పోరాటం ఉధృతం కావాల్సిందేనని ఎంపిలకు కెసిఆర్ సూచనలు జారీ చేశారని సమాచారం.
దీంతో పాటు పెండింగ్‌లో విభజన అంశాలపై కూడా ఉభయ సభల్లో ఎంపిలు పట్టుబట్టాలని కెసిఆర్ ఆదేశించారు. ఉభయ సభల్లో సభ్యులు కేవలం తమ వాణిని మాత్రమే కాకుండా యావత్ దేశం కూడా తెలంగాణ రైతులకు జరుగుతున్న అన్యాయం చర్చించుకునే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తేనే….ప్రయోజనం ఉంటుందని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మన వ్యూహాల్లో అవసరమైతే అప్పటికప్పుడు మార్టుకోవాల్సి వస్తే…. ఆ దిశగా ఎంపిలు నడుచుకోవాలని సూచించారు. దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగిన తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని సభల్లో తీవ్ర స్థాయిలో తూర్పారపడుతూనే రైతులకు ప్రయోజనం కలిగే విధంగా చూడాలని ఆదేశించారు. అవరమైతే మరోసారి సంబంధిత కేంద్రమంత్రులను కలిసి సమస్యను మరోసారి వివరించే ప్రయత్నం చేయాలన్నారు. అంతే తప్ప కేంద్రం దిగిరాలేదన్న నెపంతో వారిపై జరుపుతున్న పోరులో మాత్రం ఎలాంటి తేడా రాకుండా చూసుకోవాలన్నారు. ఈ విషయాలపై ఉభయ సభల్లో టిఆర్‌ఎస్ సభ్యులు లెవనెత్తుతున్న అంశాలపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు సభల్లో పార్టీ నేతలు వ్యవహరించిన తీరు పూర్తి సంతృప్తిని ఇచ్చిందని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. కాగా నేటి మళ్లీ సభ మొదలవుతున్న నేపథ్యంలో కేం-ద్రాన్ని ఎత్తిచూపే అంశంలో అందివచ్చిన ఏ అవకాశాన్ని జారవిడుచుకోవద్దని సిఎం కెసిఆర్ సూచించారని తెలుస్తోంది.
CM KCR Meets TRS MPs and Ministers