Friday, November 22, 2024

అవి పాత ప్రాజెక్టులే

- Advertisement -
- Advertisement -

CM KCR meets Union Water Energy Minister Gajendrasingh Shekhawat

గెజిట్‌లో అనుమతులు లేనివిగా పేర్కొన్న 11 గోదావరి బేసిన్ ప్రాజెక్టులు ఉమ్మడి ఎపిలోనివే

తెలంగాణ వాటా 967.94టిఎంసిలలో 758.76టిఎంసిల ప్రాజెక్టులకు సిడబ్లూసి నుంచి అన్ని రకాల అనుమతులు ఉన్నాయి

అవి తెలంగాణ వాటాకు లోబడినవే
అందులో 758.76టిఎంసిల ప్రాజెక్టులకు సిడబ్లూసి అనుమతులిచ్చింది
148. 82 టిఎంసిల ప్రాజెక్టులను హైడ్రాలజీ డైరెక్టరేట్ ఒకే చేసింది
మిగిలిన 60.26టిఎంసిల నీటిని భావి ప్రాజెక్టుల కోసం రిజర్వ్‌లో ఉంచుకున్నాం

మన తెలంగాణ/ హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ (15..7..21)లో గోదావరి బేసిన్‌కు సంబంధించి 11 ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందువేనని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ దృష్టికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తీసుకొచ్చారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం కెసిఆర్ సోమవారం కేంద్రమంత్రిని కలిశారు. సుమారు నలభై నిమిషాలకు పైగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, నిర్మాణ అనుమతులపై కేంద్రమంత్రికి సవివరంగా సిఎం కెసిఆర్ వివరించారు. అలాగే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య తలెత్తిన నీటి వివాదాలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. గోదావరి జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి 967. 94 టిఎంసిల నీటి కేటాయింపులు ఉండగా, అందులో 758.76 టిఎంసిలకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు కేంద్ర జలవనరుల సంఘం (సిడబ్లూసి) అన్ని రకాల అనుమతులు ఉన్నట్లు సిఎం కెసిఆర్ తెలిపారు. మరో 148.82 టిఎంసిలకు సంబంధించి హైడ్రాలిజీ విభాగం అనుమతులు ఉన్నాయని వివరించారు.

ఇంకా60.26 టిఎంసిల నీటిని భవిష్యత్ అవసరాల దృష్టా ప్రాజెక్టుల కోసం నీటి ఆవిరి, నష్టాల కోసం రిజర్వులు ఉంచుకున్నట్లు కేంద్ర మంత్రి షెకావత్‌కు వివరించారు.ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు 85 టిఎంసిల నీటిని కేటాయిస్తూ గోదావరి నీటి వివాదాల ట్రిబ్యూనల్ అవార్డు కూడా ఉందన్నారు. మహరాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి అంతరాష్ట్ర ఒప్పందాలు కూడా ఉన్నాయని కేంద్రమంత్రి షెకావత్ దృష్టికి తీసుకొచ్చారు. ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టులకు ఇచ్చింపల్లి నుంచి 16 టిఎంసిల కేటాయింపులు ఉన్నటు తెలిపారు. దేవాదుల ఎత్తిపోతల పథకానికి 38 టి ఎంసిల కేటాయింపులు ఉన్నాయని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. మొత్తంగా 155 టిఎంసిల నీటి కేటాయింపులకు కేంద్ర జలసంఘం నుంచి ఆమోదం ఉన్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా సిఎం కెసిఆర్ నివేదిక ద్వారా అందజేశారు. ఈ నాలుగు ప్రాజెక్టులతో పాటు సీతారామ ప్రాజెక్టుకు 70 టిఎంసిల కేటాయింపులు ఉన్నట్లు కేంద్ర మంత్రి దృష్టికి సిఎం కెసిఆర్ తీసుకొచ్చారు.

దేవాదుల ఎత్తిపోతలకు తుపాకులగూడెం ప్రాజెక్టు ద్వారా 60 టిఎంసిలు, ముక్తేశ్వరం (చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల పథకం ద్వారా 4.5 టిఎంసిలు, రామప్పపాకాల లింక్ ద్వారా 3 టిఎంసిలు, మోడికుంట వాగు ద్వారా 2.14 టిఎంసిలు, చౌటుపల్లి హనుమంత్‌రెడ్డి ఎత్తిపోతలకు 0.8 టిఎంసిలు కలిపి మొత్తం 140.44 టిఎంసిల నీటిని వినియోగించుకుంటున్నామన్నారు. మిగిలిన 14.6 టిఎంసిల నీటిని రిజర్వులో ఉంచుకున్నట్లు షెకావత్‌కు వివరించారు. ఈ ప్రాజెక్టులకు ఇప్పటికే నీటి కేటాయింపులకు అనుమతులను కేంద్ర జలసంఘం ఇచ్చిందన్నారు. వీటికి సంబంధించిన డిపిఆర్ (సమగ్ర నివేదిక)లకు కూడా అనుమతులు వచ్చాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అదనంగా మరో టిఎంసి నీటిని ఉపయోగించుకునేందుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సొంత నిధులతో నిర్మించి 240 టిఎంసిల నీటిని ఉపయోగించుకునేలా కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించినట్లు కేంద్రమంత్రి షెకావత్‌కు సిఎం కెసిఆర్ వివరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర జలసంఘానికి కూడా అందజేసినట్లు సిఎం కెసిఆర్ తెలిపారు. అతి తక్కువ కాలంలోనే ఈ ప్రాజెక్టును నిరించినట్లు పేర్కొన్నారు.

కండకుర్తి ఎత్తిపోతలకు 3,300 ఎకరాల ఆయుకట్టుకు నీరు అందిస్తున్నారు. వీటికి ఏ విధమైన అనుమతులు అవసరం లేదన్నారు. రామప్ప పాకాల లింకు, తుపాకుల గూడెం బ్యారేజ్ దేవాదుల ప్రాజెక్టులో భాగమేనన్నారు. వీటికి కొత్తగా అనుమతులు అవసరం లేదన్నారు. గూడెం ఎత్తిపోతల పథకం కూడా కడెం ప్రాజెక్టులో భాగమన్నారు. ఈ ప్రాజెక్టులన్నీ గతంలో ఉన్నవేనని, వీటికి డిపిఆర్‌లు, అనుమతులు అవసరం లేదన్నారు. వీటికి అనుమతులకు మినహాయింపులు ఇవ్వాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రికి సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. అలాగే కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటుపై పిటిషన్ వెనక్కి తీసుకున్నట్లు కేంద్ర మంత్రికి వివరించారు.

ఇప్పటికే పిటిషన్ విత్ డ్రా పిటిషన్‌ను సుప్రీం కోర్టులో దాఖలు చేసినట్లు సిఎం వెల్లడించారు. గెజిట్‌లోని ప్రాజెక్టుల పరిధి, ఇతర అంశాల అమలుకు సహకరిస్తామని అన్నారు. గెజిట్ అమలులో ఇబ్బందులు రాకుండా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ సమావేశంలో సిఎం కెసిఆర్‌తో పాటు రాష్ట్ర ఇరిగేషన్ స్పెషల్ సిఎస్ రజత్‌కుమార్, ఇఎన్‌సిలు మురళీధర్ రావు, హరిరామ్, సిఎం ఒఎస్‌డి శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఎస్‌ఇ కోటేశ్వర్‌రావు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సలహాదారుడు వెదిరే శ్రీరామ్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News