మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుతో ప్రముఖ రైతు ఉద్యమ నేత రాకేష్ తికాయత్ భేటీ అయ్యారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో వారిద్దరు వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా రైతులు పండించే అన్ని రకాల పంటలకు కేంద్రం కల్పించాల్సిన కనీస మద్దతు ధర, దానికి చట్టబద్దత కల్పించే విషయంపై కూలంకషంగా సమాలోచనలు చేశారు. ఈ అంశాలపై కేంద్రంపై ఒత్తడి పెంచేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న రైతులను ఏకతాటికిపైకి తీసుకొచ్చేందుకు అవసరమైన సూచనలు, సలహాలు కూడా తికాయత్ నుంచి సిఎం కెసిఆర్ స్వీకరించారు. అలాగే వ్యవసాయ రంగానికి ప్రయోజనం చేకూర్చేవిధంగా డాక్టర్ స్వామినాధన్ కమిషన్‌ను కేంద్రం వెంటనే అమలు చేయాలని ఒత్తడి తీసుకురావాలని నిర్ణయించారు.
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు పలు రాష్ట్రాల్లో పంటలు పూర్తిగా నీట మునగాయి. ఈ నేపథ్యంలో రైతులకు ఆదుకునేందుకు కేంద్రం నుంచి అందాల్సిన నష్టపరిహారంతో పాటు తడిచిన పంటను పూర్తిగా కొనుగోలు చేసే విధంగా ఒత్తిడి తీసుకరావడం తదితర అంశాలపై తికాయత్‌తో చర్చించారు. అలాగే వ్యవసాయ పంపుసెట్లకు కేంద్రం ఉచిత కరెంటు ఇవ్వకుండా బలవంతంగా కరెంటు మోటర్లను బిగిస్తున్న వైఖరిపై కూడా చర్చించారు. కరెంటు మీటర్లు బిగించిన రాష్ట్రాలకు కేంద్రం పలు రకాల ప్రోత్సాహకాలు కల్పిస్తున్నా….. తమ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఇదే రీతిలో మిగిలిన రాష్ట్రాలు కూడా కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించే విధంగా అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా తికాయత్‌తో సిఎం చర్చించారు.