మనతెలంగాణ/హైదరాబాద్ : చెట్ల నరికి వేతను వ్యతిరేకిస్తూ చిప్కో ఉద్యమాన్ని (చెట్లను కౌగిలించు కోవడం) నడిపిన, ప్రముఖ పర్యావరణ వాది సుందర్ లాల్ బహుగుణ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలుగా పర్యావరణ సమస్యలపై, చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ, అంతరించిపోతున్న వృక్ష, జంతు, పక్షిజాతుల రక్షణ కోసం జీవితాంతం కృషి చేస్తూ, తన జీవితాంతం పరితపించిన బహుగుణ మరణం ప్రకృతి, జీవావరణ పర్యావరణ రంగానికి తీరని లోటని సిఎం కెసిఆర్ అన్నారు. బహుగుణ కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ సంతాపం
ప్రముఖ పర్యావరణ వేత్త, చిప్కో ఉద్యమకారుడు, గాంధేయవాది సుందర్‌లాల్ బహుగుణ మృతి పట్ల రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. సుందర్‌లాల్ బహుగుణ ఐదు దశాబ్దాలుగా పర్యావరణ పరిరక్షణకు అలుపెరుగని పోరాటం చేశారు అని గుర్తు చేశారు. హిమాలయాల్లోని అడవుల నరికివేతకు వ్యతిరేకంగా సుందర్‌లాల్ బహుగుణ చేపట్టిన చిప్కో ఉద్యమం (చెట్లను నరకడాన్ని నిరసిస్తూ వాటిని కౌగిలించుకోవడం) పర్యావరణ పరిరక్షకులకు మార్గనిర్దేశనం చేశాడు అని సంతోష్ కుమార్ కొనియాడారు. పర్యావరణాన్ని విధ్వంసపరిచే ఆనకట్టల నిర్మాణానికి, చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నత వ్యక్తి సుందర్‌లాల్ బహుగుణ అని కీర్తించారు. అంతరించిపోతున్న వృక్ష జంతు, పక్షి జాతుల రక్షణ కోసం ఆయన జీవితాంతం పరితపించారని సంతోష్ కుమార్ తెలిపారు. సుందర్‌లాల్ బహుగుణ వంటి పర్యావరణవేత్తల స్ఫూర్తితోనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టామన్నారు.
CM KCR mourns death of Sundarlal Bahuguna