Saturday, January 18, 2025

కెసిఆర్ బయటకు వస్తేనే మేలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ మూడో సభ, నాలుగో సమావేశాలకు ప్రతిపక్ష నేత కెసిఆర్ రావట్లేదు. అంతకు ముందు అనధికారికంగా జరిగిన ప్రచారంలోని అస్పష్టత వల్ల ‘కెసిఆర్ శాసనసభకు వస్తున్నారా?’ అని, సమావేశాల ముందు ఎర్రవల్లి ఫావ్‌ు హౌజ్‌లో జరిగిన ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిల భేటీ తర్వాత కొందరు జర్నలిస్టులు పార్టీ నాయకుల్ని అడిగారు. వస్తారనో, రారనో చెప్పలేని స్థితిలో మాజీ మంత్రి టి. హరీశ్‌రావ్, ‘మీరే చూస్తారుగా!’ అని ఓ నర్మగర్భ సమాధానమిచ్చి, సంకట స్థితి నుంచి తెలివిగా తప్పుకున్నారు. ఆ భేటీలో కెసిఆర్ మాటల్ని బట్టే ఆయన ఈ సమావేశాలకు రావట్లేదని స్పష్టమైంది. అది ‘ఇన్ కెమెరా భేటీ’ అవటంవల్ల అందులో పాల్గొనని జర్నలిస్టులకు ముందుగా ఆ ముక్క తెలియలేదు కానీ, ప్రజాప్రతినిధుల్ని ఉద్దేశించి ‘మీరు ఇలా చేయండి’ ‘అలా చేయండి’ అన్నారే తప్ప ‘మనం ఇలా చేద్దాం’ అని కెసిఆర్ ఏ దశలోనూ అనలేదు. అప్పుడే తేలిపోయింది ఆయన అసెంబ్లీకి రావట్లేదని. ఎందుకు రావట్లేదు అన్నదే కోటి రూకల ప్రశ్న! దానికి, ఆయన తప్ప వేరెవరూ సమాధానం చెప్పలేరు. ఆయన వద్ద కూడా, ఈ ప్రశ్నకు సహేతుకమైన సమాధానం ఉండి ఉండదు. ప్రతిపక్ష నేత రాని శాసనసభ చర్చల్లో వేడి పుట్టడం లేదు. ప్రతిపక్షనేత లేని సమావేశాల్ని ప్రభుత్వం కూడా అంత సీరియస్‌గా తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు. అంతర్గతంగా బిఆర్‌ఎస్ పార్టీలో పని విభజన సంస్థాగత వ్యవహారాలను తేల్చడంలోనే కాకుండా బయట ఇతర పార్టీలతో నడత, ప్రజాపోరాట పంథా నిర్ణయించడంలోనూ బిఆర్‌ఎస్ నాయకత్వం అయోమయంలో ఉన్నట్టుంది. ఇంటా, బయటా ఈ అయోమయం వీడితే గాని పార్టీ పాత బాట పట్టే సూచనలు కనిపించడం లేదు.
ప్రతిపక్షం రాజ్యాంగ బాధ్యత
తెలంగాణ ఓటర్లు మూడో వంతు స్థానాలతో బిఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష పాత్ర అప్పగించారు. రాష్ర్ట ఏర్పాటు తర్వాత తొలి పదేళ్ల పాలన అనంతరం ప్రజలు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహించడం రాజకీయ పక్షంగా బిఆర్‌ఎస్ బాధ్యత. ఎన్నికైన ఎంఎల్‌ఎలలో పది మంది వరకు మొదట పార్టీని వీడి పాలకపక్షం చంకన చేరినా, ఒక దశలో వలసలు ఆగిపోయాయి. పార్టీ మార్పిళ్ల (నిరోధక) చట్టం న్యాయ ప్రక్రియ ద్వారా వారిని అనర్హులుగా ప్రకటింప జేసి, పరిస్థితిని ఉప ఎన్నికలకు నెట్టాలని బిఆర్‌ఎస్ నాయకత్వం చేసిన యత్నం ఫలించలేదు. అయినా.. వారి ప్రతిపక్ష హోదా పోలేదు. పాలక పక్షాన్ని సభలో కార్నర్ చేయడంలో, సర్కార్ తప్పిదాల్ని బయట ఎండగట్టడంలో ప్రధాన ప్రతిపక్షంగా బిఆర్‌ఎస్ దండిగా ప్రజా మన్నన పొందలేకపోతోంది. ఇందుకు నాయకత్వమే ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. బిఆర్‌ఎస్ కార్యకలాపాల్లో తాను ఇపుడు స్వయంగా పాల్గొనని కెసిఆర్, పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులైన కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్, మాజీ సీనియర్ మంత్రి హరీశ్‌రావుల మధ్య పని విభజన చేసినట్టు లేదు. బాధ్యతల అప్పగింతలో స్పష్టత ఇవ్వకపోవడమే వారి మధ్య అనారోగ్యకర స్పర్ధకు కారణంగా పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. ఒకరు ఒకటి ప్రతిపాదిస్తే, మరొకరు దానికి విరుగుడు చర్యలు చేపడతారే తప్ప మనస్ఫూర్తి సహకారం అందించరనే భావన పార్టీ శ్రేణుల్లో ఉంది. నిర్దిష్టంగా ఏదైనా పని అప్పగించినా, వారికి సంపూర్ణ స్వేచ్చ ఇవ్వకుండా ‘బొమ్మరిల్లు’ సినిమాలో ప్రకాశ్‌రాజ్ పాత్ర లాగా ఆట నేర్పుతున్నట్టే చేసి, కెసిఆర్ తానే ఆట ఆడేస్తారనే విమర్శ ఉంది. కెటిఆర్, హరీశ్ రావుల మధ్య అప్రకటిత ఆధిపత్య పోరు సాగుతుండగానే, కెసిఆర్ తనయ కవిత మళ్లీ క్రియాశీలం అవుతూ ఉండటం పార్టీ నాయకులు, కార్యకర్తల శ్రేణుల్లో కొత్త అయోమయానికి కారణమవుతోంది. ముగ్గురిలో ఎవరిని అనుసరించాలో, అది ఎవరి కినుకకు కారణమవుతుందో తెలియని అయోమయ పరిస్థితి వారిది!
అప్పుడంటే… బారా కూన్ మాఫ్!
తెలంగాణ పేగు బంధం తెగిందా? అని పార్టీ సానుభూతిపరులే సందేహం వ్యక్తం చేస్తుంటారు. ఉద్యమ కాలంలో ఏం చేసినా సాగింది. ఇప్పుడు రాజకీయ విధానాల్లో స్పష్టత అవసరం. బిజెపితో ఎటువంటి వైఖరి అనుసరిస్తారో నిర్ద్వంద్వంగా తేల్చాలి. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ఇలాంటి ఊగిసలాట ధోరణే కొంపముంచింది. ‘ఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఆర్‌ఎస్‌యు వరకు ఎవరైనా సరే, తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు సహకరించే… గొంగళి పురుగునైనా ముద్దాడుతాం’ అన్నా ఉద్యమ రోజుల్లో చెల్లుబాటయింది. ఫక్తు రాజకీయ పార్టీ అయ్యాక, ‘ఒక దేశం ఒక ఎన్నిక’ అంటే పార్టీ స్పందనేమిటో తెలియాలి. బిల్లు ముసాయిదా వచ్చి, అందులో ప్రతిపాదనలు తెలిస్తే అప్పుడు స్పందిస్తామని పార్టీ నేత కెటిఆర్ చెప్పారు. అధికారంలో ఉన్నపుడు రకరకాల పద్ధతుల్లో తెలంగాణ వాదం బలహీనపడుతుంటే చూస్తూ ఉన్నందుకు, ఇప్పుడు ఏం చేసినా అది ఆశించిన స్థాయికి లేవట్లేదు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు చర్యల ద్వారా తెలంగాణ వాదాన్ని తన చుట్టూ తిప్పుకుంటూ, అస్తిత్వ ముద్రకు యత్నిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుద్వారా ప్రాంతీయ మనోభావాల్ని కొల్లగొట్టడం నుంచి విద్యా సంస్థలకు చాకలి ఐలమ్మ, సురవరం ప్రతాపరెడ్డి వంటి వైతాళికుల పేర్లు పెట్టడం వరకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మార్పు వల్ల పార్టీ పేరులోంచి తెలంగాణ తొలగిపోవడం, కెసిఆర్ జాతీయ రాజకీయాలని చేసిన పరుగు వల్ల కూడా తెలంగాణ బంధం బలహీనపడింది. పరిస్థితులు ఒకప్పటిలా లేవు, రాష్ర్టంలో రాజకీయ ముఖచిత్రం మారుతున్న క్రమంలో… ఇదివరకు లేని కుల రాజకీయాలు, గుర్తింపు సంక్షోభాలు తెలంగాణలోనూ పెరుగుతున్నాయి. సిఎం ‘టి 20’ ఆడుతుంటే బిఆర్‌ఎస్ ‘టెస్ట్‌మ్యాచ్’ సరళి నుంచి ఇప్పుడిప్పుడే ‘ఒడిఐ’ కి మారుతున్నట్టుంది. కెసిఆర్ పరోక్షంలో పార్టీ నాయకత్వం జనసమూహాల్లోకి ప్రభావవంతమైన గొప్ప వాదనలు (న్యరేటివ్స్) తీసుకుపోలేని పరిస్థితి వరుస ఎన్నికల్లో కొట్టొచ్చినట్టు కనిపించింది. హైదరాబాద్ మహానగర్ ఎన్నికల నుంచి, లోక్ సభ ఎన్నికల దాకా… పార్టీకి ఓ గట్టి నినాదమే లేని పరిస్థితి. టిక్కెట్టు మార్చిన పది మందిలో ఎనిమిది మంది గెలిస్తే, మూకుమ్మడిగా పాతవారికే టిక్కెట్లు ఇవ్వడమొక తప్పిదమని అంగీకరించడానికి పార్టీ అధినేత సిద్ధంగా లేరు. రెండు వరుస ఓటములకు కారణమేంటని… నిజమైన ఆత్మపరిశీలనే పార్టీలో ఇప్పటికీ జరుగలేదు.
వ్యూహాత్మక గమనం అవసరం
పార్టీ సీనియర్ నాయకుడిగా హరీశ్‌రావ్ వ్యూహాత్మకంగా పన్నిన ‘రుణమాఫీ సవాల్’ ట్రాప్‌లో పడి ప్రభుత్వం ఒక దశలో గిలగిల్లాడింది. అందుకు కారణం, ప్రభుత్వం ఆశించిన ఓ అప్పు పుట్టకపోవడమే! అప్పు దొరక్కపోతే… రేపు సంక్రాంతికి ఇస్తామన్న ‘రైతు భరోసా’కు కూడా ఇబ్బందేనని తెలుస్తోంది! 21 వేల కోట్ల రూపాయలు వెచ్చించి రుణమాఫీ చేసినా, రావాల్సినంత కీర్తి పాలక పక్షానికి దక్కలేదనే అభిప్రాయం ప్రజాక్షేత్రంలో ఉంది. పైగా, అంత మొత్తం ఒకే పద్దుకింద వెచ్చించడంతో… మిగతా చాలా విషయాల్లో ఆర్థిక స్వేచ్ఛ హరించుకుపోయి సర్కారుకు కాళ్లుచేతులు కట్టేసినట్టయింది. ఏ అంశంలో ప్రభుత్వాన్ని విమర్శించబోయినా… పదేళ్ల బిఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్వాకాల తాలూకు బ్యాగేజీ భారమై, ప్రతివిమర్శకు ఆస్కారం ఇస్తోంది. దాంతో విపక్షం ఇరుకునపడాల్సి వస్తోంది. దాన్ని అధిగమించడానికి నిర్దిష్ట అంశాల్నే ఎన్నుకోవాల్సి వస్తోంది. అలా… నాయకత్వం వ్యూహాత్మకమైన ఎత్తులతో మాత్రమే ప్రత్యర్థులపై ఆధిపత్యం సాధించగలుగుతుంది. వచ్చే ఫిబ్రవరిలో సంస్థాగతంగా ఓ పెద్ద సమావేశం జరుపాలని పార్టీ నాయకత్వానికి ఆలోచన ఉండింది. పార్టీని క్రియాశీలంగా నడపడానికి బిఆర్‌ఎస్‌కు నిధుల కొరత లేదు. దేశంలో మరే ప్రాంతీయ పార్టీ ఇవాళ 1300 కోట్ల రూపాయల నిధులతో లేదు. చాలా జిల్లాల్లో పార్టీకి కార్యాలయ భవనాలున్నాయి. నాయకత్వం చొరవ తీసుకొని ప్రజాయుత కార్యక్రమాలు చేపడితే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పుంజుకునే అవకాశం ఉంది. కేంద్రం యోచిస్తున్నట్టు ‘ముందస్తు జమిలి’ ఎన్నికలకు 2027 లోనే రంగం సిద్ధం చేస్తే, అందుకు పార్టీని సమాయత్తపరిచే వ్యూహం బిఆర్‌ఎస్‌కు అవసరం.
ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకొని కెసిఆర్ అడుగులు వేయాల్సి ఉంటుంది. ఎపిలో ఆరు మాసాల కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ జగన్మోహన్ రెడ్డి (వైఎస్‌ఆర్‌సిపి) వర్సెస్ లోకేశ్ (తెలుగుదేశం) అయినా, జగన్ వర్సెస్ పవన్ కల్యాణ్ (జనసేన) అయినా జగన్‌దే పైచేయి అయేది. అది, జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు అయింది కాబట్టి జగన్ దెబ్బతిన్నారనే సూక్ష్మాన్ని కెసిఆర్ గ్రహించాల్సిందేనని పార్టీ శ్రేణులు తలపోస్తున్నాయి.

దిలీప్‌రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News