Thursday, January 23, 2025

ఇది ఉప ఎన్నిక కాదు.. బతుకుదెరువు ఎన్నిక

- Advertisement -
- Advertisement -

మీటర్లు పెట్టే మోడీ కావాలా? వద్దని కొట్లాడుతున్న కెసిఆర్ కావాలా?

మునుగోడు ఫలితం దేశానికి ఒక సందేశం.. ఇక్కడ దెబ్బ కొడితే నషాలానికి అంటాలి

కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారు?
దీనిపై కేంద్ర మంత్రి అమిత్‌షా సమాధానం చెప్పాలి

మునుగోడు ఎన్నిక
ఎందుకొచ్చిందో తెలుసుకోండి
మోడీకి, ఈడీకి భయపడేది లేదు
మోడీని ఓడగొట్టేటోడు
లేడనుకున్నాడా?
ఆయన అహంకారమే
ఆయనను పడగొడుతుంది
కాంగ్రెస్ ఓటు వేస్తే
కనగల్ వాగులో వేసినట్టే
నల్లగొండ నో మ్యాన్ జోన్
అవుతుందని డబ్లుహెచ్‌ఒ
హెచ్చరించినా ఖాతరుచేయని
నాటి కేంద్ర, రాష్ట్ర పాలకులు
భగీరథతో నల్లగొండ ఫ్లోరైడ్
రహితంగా మారింది
పేదల బతుకులు
బాగుపడాలంటే ప్రగతిశీల
శక్తులు ఏకంకావాలి
మునుగోడులో సంపూర్ణ
మద్దతుకు ఆమోదం
తెలిపిన సిపిఐకి కృతజ్ఞతలు
ప్రజాదీవెన బహిరంగసభలో
ముఖ్యమంత్రి కెసిఆర్

ప్రస్తుతం అభివృద్ధికి, మతోన్మాద శక్తులకు మధ్య పోరాటం జరుగుతోంది. ప్రగతిశీల శక్తులన్నీ ఏకమై దుర్మార్గులను తరిమికొట్టాలి.మునుగోడు లో ఉపఎన్నిక ఎందుకు వచ్చింది? మరో ఏడాది ఆగితే అసెంబ్లీ ఎన్నికలు జరిగేవి. అప్పటి వరకు ఆగకుండా రాజ్‌గోపాల్‌రెడ్డితో రాజీనామా చేయించింది ఎవరు? దీని వెనుక బిజెపి స్వార్ధ రాజకీయాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రగతిశీల శక్తులు ఏకమై దుర్మార్గులను తరిమికొట్టాలని పిలుపు ఇస్తున్నా.. ఈ ఎన్నికల్లో మద్దతు ప్రకటించిన సిపిఐకి కృతజ్ఞతలు. మునుగోడులో మొదలైన ఈ ఐక్యత ఢిల్లీ వరకు కొనసాగాలి.

ఎవడో గాలిగాడు…. గత్తరగాడు వచ్చి ఏదో చెబితే వాడి వెనుక గొర్రెదాటుగా పోతే గోల్మాల్ అయిపోతారు. బతుకులు ఆగమైతాయి. ఏ వర్గాన్ని కాదనకుండా ప్రతీవాళ్లను కడుపులో పెట్టుకొని ఒక దరికి తెచ్చుకోవాలని పాటు పడుతున్నా.. వాళ్లను కాదని మనల్ని పోటు పొడిచే వాళ్లకు ఓటు వేస్తే మనకు దెబ్బ పడుతుంది. మీ బిడ్డగా… ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పడం నా ధర్మం.

మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపికి ఓటేస్తే బావికాడ కరెంటు మీటర్లు వచ్చినట్లే అని టిఆర్‌ఎస్ అధ్యక్షులు, సిఎం కెసిఆర్ హెచ్చరించారు. నా బలం మీరే? నా ధై ర్యం కూడా మీరేనని అ న్నారు. మీ బలం చూసుకునే రాష్ట్రంలో మీటర్లు పెట్టనని కేంద్రంతో ఫైట్ చేస్తున్నానని కెసిఆర్ వ్యాఖ్యానించారు. మీటర్లు పెట్టమనే బిజెపి కా వాలో? లేక వాటిని వద్దనే టిఆర్‌ఎస్ కావాలో మునుగోడు ప్రజలు తేల్చుకోవాలన్నారు. మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదని, మన జీవితాల ఎన్నిక….మన బతుకుదెరువు ఎన్నిక అని కెసిఆర్ అన్నారు. దేశంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి అధికారంలో ఉన్నామన్న అహం తో మోడీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మోడీ గర్వమే ఆయనకు ప్రధాన శత్రువు అవుతుందని హెచ్చరించారు. దేశ రాజధానిలోనే స రిగా నీళ్లు, కరెంట్ లేని పరిస్థితి నెలకొందన్నా రు. చివరకు ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో నే కరెంట్ లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహా స్యం చేసే రైతు, ప్రజావ్యతిరేక విధానాలే మోడీ పతనానికి నాందిపలుకనున్నాయన్నారు.

నల్గొండ జిల్లా మునుగోడులో శనివారం టిఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన ‘ప్రజా దీవెన సభ’లో ఆయన పాల్గొన్నారు. సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి కెసిఆర్ మాట్లాడుతూ, కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. మోడీ ప్రభుత్వంపై తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాల ను సంధించారు. సెటైర్లతో విరుచుకపడ్డారు. కేం ద్రం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయి లో ధ్వ జమెత్తారు. వ్యవసాయ కరెంటు బావుల కు ఎం దుకు మీటర్లు పెట్టమంటున్నదో కేంద్రం చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అందు కు గల కారణాలు ఏంటో చెప్పాలని నిలదీశా రు. దీని వెనుక ఉన్న మతలబు ఏమిటో ప్రజలకు తెలియాల్సిన అవసరముందన్నారు. అ లాంటి పార్టీకి ఎవరైనా ఓట్లు వేస్తారా? అని ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గంలో బిజెపికి ఎప్పుడు డిపాజిట్ కూడా దక్కలేదన్నా రు. ఈసారి ఆ పార్టీకి ఓటు పడిందంటే బాయి మోటార్లకు మీటర్లు పడతాయన్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఉపఎన్నికలో మరోసారి డిపాజిట్ దక్కకుండా చూడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉప ఎన్నికలో ప్రజలు టిఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించి బిజెపికి మీటర్ పెట్టాలని స్పష్టం చేశారు.

ఇడి కాకపోతే బోడీ తెచ్చుకో…

తన మీద ఇడి కాకపోతే బోడీ తెచ్చుకో….! కెసిఆర్ అనే వ్యక్తి ఎవరికి భయపడరన్నారు. ఇది దేశమా? అరాచకమా? ఎవరిని పడితే వాళ్లను.. ముఖ్యమంత్రులను, పెద్దపెద్ద వాళ్లను ఇడి కేసు పెడుతానంటే? ఇది ఇండియా? బోడియా అ న్నానన్నారు. ఇడి వస్తే తనకాడ ఏమున్నది…. వాడే నాకు చాయ్ తాగిపిచ్చిపోవాలే అని కెసిఆర్ అన్నారు. ఇడి అంటే దొంగలు, లంగలు భ యపడుతరన్నారు. ధర్మం, నిజాయితీగా ఉ న్నో ళ్లు ఎందుకు భయపడుతరని ప్రశ్నించారు. ఏం పీక్కుంటరో…. పీక్కోమని కేంద్రంపై కెసిఆర్ తీ వ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల కో సం నిలబడే వాళ్లు, ప్రజల కోసం ఆలోచించే వా ళ్లు, ప్ర జల మేలుకోరే వాళ్లు, ప్రజలకు కడుపునిండా బుక్కెడు అన్నం దొరకాలనే వారు ఎవరికి భయపడరన్నారు. మోడీ నువ్వు గోకినా గోకకపోయి నా నేనే నిన్ను గోకుతా అని చెప్పినా అని ఈ సం దర్భంగా కెసిఆర్ గుర్తు చేశారు. దేశం ఎవని అయ్యసొత్తు కాదన్నారు. నిన్నగాక మొన్న తమిళనాడులో స్టాలిన్ ముఖ్యమంత్రిగా గెలిచిండు టూ థర్డ్ మెజారిటీతో ఆ పార్టీ విజయం సాధించిందన్నారు.అక్కడ గవర్నమెంట్ పడగొడు తా? అంటడు. బెంగాల్లో మమతా బెనర్జీ గెలిచిందనారు. బెంగాల్ చరిత్రలో అత్యధిక సీట్లతో గెలిచిని సిఎంను పట్టుకుని ….నిన్ను పడగొడుతా? అని మోడీ అంటున్నాడన్నారు. ఏ నిన్ను పడగొట్టెటోళ్లు లేరని అనుకుంటున్నవా? నిన్ను పడగొట్టడానికి వేరే శత్రువు అవసరం లేదన్నారు. మోడీ నీ అహంకారం, నీ గర్వం శత్రువు అయితది అంటూ కెసిఆర్ ధ్వజమెత్తారు.

ప్రగతిశీల శక్తులన్నీ ఏకం కావాలి

ప్రస్తుతం అభివృద్ధికి, మతోన్మాద శక్తులకు మధ్య పోరాటం జరుగుతోందని సిఎం కెసిఆర్ ధ్వజమెత్తారు. ప్రగతిశీల శక్తులన్నీ ఏకమై దుర్మార్గులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు పోరాటం కొత్త కాదన్న ఆయన విభజన హామీలు సాధించే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు. మునుగోడులో ఉపఎన్నిక ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. మరో ఏడాది ఆగితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయన్నారు. అప్పటి వరకు ఆగకుండా రాజ్‌గోపాల్‌రెడ్డితో రాజీనామా చేయించింది ఎవరని ప్రశ్నించారు. దీని వెనుక బిజెపి స్వార్ధ రాజకీయాలు ఉన్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలనే ప్రగతిశీల శక్తులు ఏకమై దుర్మార్గులను తరిమికొట్టాలని ఈ సభా వేదిక ద్వారా పిలుపునిస్తున్నట్లు కెసిఆర్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తమకు మద్దతు ప్రకటించిన సిపిఐకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. మునుగోడులో మొదలైన ఈ ఐక్యత ఢిల్లీ వరకు కొనసాగాలని కెసిఆర్ ఆకాంక్షించారు.

పార్టీల ఎన్నిక కాదు…. రైతుల బతుకుదెరువు ఎన్నిక

మునుగోడు పార్టీల ఎన్నిక కాదని….రైతుల బతుకుదెరువు ఎన్నిక అని కెసిఆర్ వ్యాఖ్యానించారు. రైతుల పొలాల్లో పని చేసే కార్మికుల బతుకు దెరువు ఎన్నిక అని అభివర్ణించారు. తెలంగాణ యొక్క భవిష్యత్తను నిర్దేశించే ఎన్నిక అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గోల్మాల్ వాళ్ల నుంచి మనలను మనం కాపాడుకోవాలంటే…. మీరు ఒక్కొక్కరు ఒక్క కెసిఆర్ కావాలన్నారు. కొందరు మనదాంట్లో సన్నాసులు ఉంటారన్నారు. మందుపెట్టి దూది పెట్టగానే దాని వెంబడిపోతారన్నారు. దానికి ఆశపడద్దు అని సిఎం సూచించారు. దయచేసి ప్రలోభాలకు పోవద్దు అని విజ్ఞప్తి చేశారు. ఇది మంచిది కాదు అన్నారు. కేంద్రం మతలబు వెనుక చాలానే ఉందన్నారు. ఎరువులు, కరెంటు ధరలు పెంచాలి…. పండిన పంటలు కొనద్దు… రైతులు తమ వల్ల కాదంటూ తట్ట, పార పక్కన పెట్టేయాలన్నదే వారి లక్షమన్నారు. ఇలా చేస్తేనే మోడీ దోస్తులు సూట్ కేసులు పట్టుకొని రెడీగా ఉంటారన్నారు. కార్పొరేట్ వ్యవసాయం చేద్దామని చెప్పి…. రైతుల పొలాల్లో రైతులనే కూలీలుగా పనిచేయించే కుట్ర జరుగుతోందన్నారు.

విభజన చట్టం ప్రకారం రావాల్సిన ఏవీ రాలేదు

దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పడితే మన హక్కులు మనకు రావాలన్నారు. అన్నదమ్ములు విడిపోతే పంచుకోరా? ఇప్పుడు మన రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు అవుతోందన్నారు. అయినప్పటికీ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సినవి ఏవీ మనకు రాలేదన్నారు. కృష్ణా నదిలో రాష్ట్రం వాటా తేల్చండి? అని అడిగితే సమాధానం చెప్పరన్నారు. ఎన్ని ఇస్తే అన్నే ఇవ్వు…. కానీ వాటా చెప్పు అంటే నరేంద్ర మోదీ చెప్పడని మండిపడ్డారు. దీనిపై ఆదివారం మునుగోడుకు వస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు వాటా ఇచ్చేది లేదని చెప్పేందుకే ఆయన వస్తున్నారా? అని నిలదీశారు. నీ బొమ్మలు కాదు. నీ తాత జేజమ్మల బొమ్మలు కూడా మేం చూశామన్నారు. కొట్లాటలు తెలంగాణకు కొత్త కాదు…. కొట్లాట మొదలైతే ఎంత దూరమైనా పోతామన్నారు. . తెలంగాణ ప్రజలకు పోరాటం కొత్త కాదని… సాధించే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు. కృష్ణా జలాల్లో వాటా గురించి రాష్ట్ర బిజెపి నేతలు ఏనాడైనా మోడీ, అమిత్ షాలను కలిసి అడిగారా? ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా గురించి మునుగోడులో చెప్పాలని తాను ఈ వేదికపై నుంచి అమిత్‌షాను అడుగుతున్నానని అన్నారు.

కండ్లు మండుతున్నయ్

ఇప్పుడిప్పుడే తెలంగాణకు జరజర తెలివి వచ్చి తెల్లపడుతున్నామని కెసిఆర్ అన్నారు. ఇది చూసి కేంద్రానికి కండ్లసు మండుతున్నయని తీవ్ర స్థాయిలో విమర్శించారు. మోడీకి దమ్ముంటే….. నువ్వు ఉన్నకాడ తెల్లగా చెయ్యాలన్నారు. అక్కడ చేసుడు చేతకాదు కానీ…..చేస్తున్న తెలంగాణపై అక్కసు ఎందుకు అని నిలదీశారు. ఇటీవలే ఢిల్లీలో కరెంటు ఎందుకు లేదని ప్రశ్నించానని అన్నారు. హైదరాబాద్‌లో ఉంటది? దేశ రాజధానిలో ఉండదా? అని మండిపడ్డారు. మాట్లాడితే మేం ఇంతపొడువు….. అంతపొడువు చేసినం అంటాని మోడీ ప్రభుత్వంపై కెసిఆర్ సెటైర్లు వేశారు. దేశ రాజధానిలోనే మంచినీళ్ళకు దిక్కులేదన్నారు. నీళ్లు సక్కరావు… ఇదీ వీళ్ళ (బిజెపి) పరిపాలన అని ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు అవుతున్నా….ఇప్పటి ఏ వర్గాన్ని అయినా ఉద్దరించారా? అని ప్రశ్నించారు. కనీసం దేశంలో ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా? అని నిలదీశారు. ప్రాజెక్టులు కట్టడం చేతకాదు కానీ….తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రాలు చేస్తుంటే…. చేస్తే చేయనియ్యం అనే పద్ధతిలో మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశంలో 24గంటలు మోటర్, ట్రాన్స్‌ఫార్మర్ కాలకుండా మంచి నాణ్యమైన కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని అన్నారు.

రూపాయి విలువ పడిపోతుంది

దేశంలో మతపిచ్చి, కులపిచ్చి మంచిదా? అని కెసిఆర్ ప్రశ్నించారు. ఎవరిని ఉద్దరించడానికి, ఎవరిని బాగుచేయడానికి అని అడిగారు. అందరూబాగుండాలి అందులో మనం బాగుండాలని కోరుకోవాలన్నారు. కానీ ఒక విద్వేషం అసహ్యం పుట్టిస్తున్నారన్నారు. దీని వల్ల దేశం . చాలా ప్రమాదంలోకి వెలుతోందన్నారు. రూపాయి విలువ ఏ ప్రధాని హయంలో ఇంత అధ్వాన్నంగా? పడిపోలేదన్నారు. ఆయన అమసర్ధ పాలన కారణంగానే దేశంలో నిరుద్యోగం పెరిగిందన్నారు. కార్మికులు రోడ్డునపడుతున్నారని విమర్శించారు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కటొక్కటిగా అమ్ముతున్నారని మండిపడ్డారు. రైతులను బతుకనిస్తరలేరు… పండిన పంటలను కొంటలేరని ధ్వజమెత్తారు. మనదగ్గర… మనం తిప్పలు పడుదామంటే కూడా ఇది కూడా బంద్ పెట్టాలే దీన్ని కూడా కొండిపెట్టాలే అని కేంద్రం చూస్తోందన్నారు.

తాను బతికున్నంత వరకు మీటర్లను పెట్టనివ్వను

కెసిఆర్ బతికున్నంత వరకు తెలంగాణ రైతాంగానికి మీటరు పెట్టను అని స్పష్టం చేశారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో రైతుబంధు ఆగదన్నారు. . ఎన్నోరకాల బాధలుపడి…. కొన్ని ఖర్చులు తగ్గించైనా సరే బ్రహ్మాండంగా కరెంటు ఇచ్చుకుంటున్నామన్నారు. దీంతో రాష్ట్రానికి పెద్దఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని వివరించారు. పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి…. ఐటి పరిశ్రమ పెరుగుతోందన్నారు. వ్యవసాయంలో పంటలు బాగా పండుతున్నాయన్నారు. ఎవరికి అక్కర ఉన్నప్పుడు వారు బోరు పెట్టుకుంటున్నారు…. ఆనందంగా సంతోషంతో బతుకుతున్నారన్నారు. త్వరలోనే మళ్ళీ చండూరులో కూడా సభ పెట్టుకుని మరిన్ని చర్చించుకుందామన్నారు.

మూడు తోకలున్నోడు కూడా….

దేశంలో ఏమైనా మర్యాద, ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య విలువలు ఉన్నయా? కెసిఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర అసెంబ్లీలో ఉండేది 119 ఎమ్మెల్యేలన్నారు. అందులో 103 మంది టిఆర్‌ఎస్, ఇంకో ఏడుగురు మిత్రపక్షమన్నారు. మిగతావి తొమ్మిది తోకలన్నారు. అందులోమూడు తోకలున్నోడు కూడా 110 తోకలు ఉన్నోన్ని పడగొట్టి ఏక్‌నాథ్ షిండేను తెస్తడట? అని ప్రకటనలు చేస్తున్నారని కెసిఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇది ప్రజాస్వామ్యమా? అహంకారమా? బలుపా? అని ప్రశ్నించారు. అధికారమదంతో కండ్లు మూసుకొని పోయాయా? అంటూ కెసిఆర్ మండిపడ్డారు.

మునుగోడు నుంచి ఢిల్లీ దాకా

మునుగోడులో ఇప్పుడు ఉపఎన్నిక రావలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మరో ఏడాది ఆగితే ఎన్నికలు జరిగేవన్నారు. దీని వెనుక ఉన్న మాయామశ్చీంద్ర ఏంటి? అని కెసిఆర్ ప్రస్నించారు. దీని వెనుక ఉన్న మాయామశ్చీంద్ర ఏంటి? అని గుర్తించకపోతే చాలా దెబ్బతినే ప్రమాదం ఉంటుందన్నారు. అందుకే సిపిఎం, సిపిఐ నాయకులతో ఒకటే చెప్పా….. కేవలం తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రగతిశీల శక్తులన్నీ ఏకం కావాలనే అభిప్రాయాలు పంచుకున్నామన్నారు.అందుకే సిపిఐ పార్టీలో చర్చలు జరిపి, వాళ్లు పోటీ చేయకుండా మన పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారన్నారు. అందుకోసం వారికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానని కెసిఆర్ అన్నారు. ఈ పోరాటం…నేటితో ముగిసేది కాదన్నారు. మునుగోడు నుంచి ఢిల్లీ దాకా మన స్నేహం కొనసాగుతుందన్నారు. దేశంలోని పేదలు, రైతుల బతుకులు బాగుపడే వరకూ దేశంలోని వామపక్షాలు, టిఆర్‌ఎస్ వంటి ప్రగతిశీల శక్తులన్నీ కలిసి పోరాడతాయని మాటిస్తున్నానని అన్నారు.

మోడీ మాట్లాడితే మైకులు పగిలిపోయాయి

పంద్రాగస్టు రోజున ప్రధాని మోడీ మాట్లాడితే మైకులు పగిలిపోయాయని కెసిఆర్ ఎద్దేవా చేశారు. నీళ్ల వాటా తేలిస్తే చకచకా నీళ్లు తెచ్చుకుంటామన్నారు. తేలిన చోట గోదావరి నుంచి నీటిని తెచ్చుకుంటున్నామన్నారు. తుంగతుర్తి, కోదాడల్లో గోదావరి నీళ్లు పారి లక్షల టన్నుల దిగుబడి వస్తోందన్నారు. ఇప్పటికే బసవాపురం ప్రాజెక్టు పూర్తయిందన్నారు. ఆలేరు, భువనగిరి, రామన్నపేటలకు కూడా వర్షాకాలం తర్వాత నీళ్లు వస్తాయన్నారు. మునుగుడుకు కూడా రావాలని పనులు మొదలుపెడితే ఎందుకు అడ్డంకులు పెడుతున్నారని ప్రశ్నించారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే రాజగోపాల్ రెడ్డి, కేంద్ర మంత్రో, ఇంకో పెద్ద మనిషో (బండి సంజయ్) ఢిల్లీకి పోయి రాష్ట్ర కృష్ణా జలాలా వాటా ఏంటి? శివన్నగూడెం ప్రాజెక్టు ఎప్పుడు నింపుకోవాలి అని అడగాలని సూచించారు.

ఏ వర్గానికైనా మేలు జరిగిందా?

బిజెపి ప్రభుత్వం వచ్చి ఎనిమిదేండ్లు అయిందని… రైతులు, మహిళలు, దళితులు, కార్మికులకు గానీ ఎవరికైనా ఒక్క మంచి పని జరిగిందా? అని కెసిఆర్‌లప్రశ్నించారు. వాళ్లకు మేలు జరిగితే మాకు కనిపించదా? అన్నారు. అవి లేవుకానీ ఎయిర్‌పోర్టులు, విమానాలు, బ్యాంకులు, రైళ్లు, రోడ్లు, గ్యాస్ కంపెనీలు అన్ని వరుసపెట్టి అమ్మడం మొదలు పెట్టారని విమర్శించారు. ఇక మిగిలింది ఏంటి రైతులు, భూములు, వ్యవసాయ పంటలేనని అన్నారు.

దెబ్బ కొడితే నషాలానికి అంటాలి

కరెంటు మీటర్లకు, రైతు వ్యతిరేక విధానాలకు, మన వడ్లు కొననందుకు, మన కరెంట్ బంద్ చేస్తున్నందుకు, మనల్ని ఇబ్బంది పెడుతున్నందుకు కేంద్రానికి దెబ్బ కొడితే నషాలానికి అంటాలన్నారు. దేశంలో జరిగే వ్యవహారాలు, ప్రజావ్యతిరేక వ్యవహారాలకు, సమాజాన్ని చీల్చిచెండాడే విద్వేష విధానాలకు వ్యతిరేకంగా పోరాటం జరగాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ, రాష్ట్రస్థాయి కమ్యూనిస్ట్ నాయకులు, ఇతర పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నామన్నారు.

కాంగ్రెస్‌కు ఓటేస్తే….బావిలో వేసినట్లే

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే …బావిలో పడేసినట్లేనని సిఎం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ గెలిచేదా? వచ్చేదా? అని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజన్ (బిజెపి) అని చెప్పుకున్న వాళ్లకు వేసే ఓటు కూడా వేస్ట్ అవుతుందన్నారు. వేసే బలమేదో ఒక్క దిక్కే ఇస్తే తెలంగాణ బలమెంటో అందరికి తెలుస్తుందన్నారు. ఇవాళ ఒక్క వ్యక్తి గెలవడం ముఖ్యం కాదన్నారు. ఈ ఎన్నికతోనే టిఆర్‌ఎస్ ప్రభుత్వం రాదన్నారు. పార్టీ బలంగానే ఉందన్నారు. కానీ తెలంగాణ ఏమంటోంది వాళ్లు ఎలా స్పందిస్తున్నారు? అనే వార్త మునుగోడు నుంచి ఢిల్లీ వెళ్లాలన్నారు. కాబట్టి బొమ్మలు చూసో, గారడీ విద్యలు చూసో మోసపోయామంటే గోస పడతామన్నారు. కాబట్టి దయచేసి మోసపోకుండా అక్కచెల్లెళ్లు, తల్లులు కెసిఆర్ చెప్పిన ముచ్చట నిజమా? కాదా? అని చర్చించాలన్నారు.

ఉన్న పెన్షన్లు, ఉన్న వసతులు, ఉన్న కరెంటు ఊడగొట్టుకుందామా ఆలోచన చెయ్యాలన్నారు. చివరకు చేనేత కార్మికుల మీద కూడా కేంద్రం జిఎస్‌టి విధించిందన్నారు. చస్తే స్మశానం మీద జిఎస్‌టి, పిల్లలు తాగే పాల మీద జిఎస్‌టి… ఇంత అన్యాయమా? ఈ డబ్బంతా ఏమవుతోంది? అని ప్రశ్నించారు. దొంగలకు, దోపిడీదారులకు బ్యాంకులను లక్షల కోట్లకు ముంచేవాళ్లకు ఎన్‌పిఎ పేర్ల మీద పది పది లక్షల కోట్లు మాఫీ చేసి పేద ప్రజల పొట్ట కొట్టే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. మునుగోడు రైతులు ఓటేసే ముందు మన బోరు కాడకు పోయి బోరుకు దండం పెట్టి పోవాలె అని కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. అలాగే అక్కచెల్లెళ్లు ఓటు వేసే సమయంలో గ్యాస్ సిలిండర్‌కు దండం పెట్టి పొయ్యి ఓటెయ్యాలన్నారు.. మనం కత్తి ఒకడికిచ్చి యుద్ధం మరొకడిని చెయ్యాలని చెప్పకూడదన్నారు. ఎవరి చేతిలో కత్తి పెడితే కరెక్టో వాడి చేతిలోనే కత్తి పెట్టాలన్నారు.

గాలిగాడు…గత్తరగాడు మాటలను పట్టించుకోవద్దు

ఎవడో గాలిగాడు…. గత్తరగాడు వచ్చి ఏదో చెబితే వాడి వెనుక గొర్రెదాటుగా పోతే గోల్మాల్ అయిపోతాయమన్నారు. బతుకులు ఆగమైతాయన్నారు. ఏ వర్గాన్ని కాదనకుండా ప్రతివాళ్లను కడుపులో పెట్టుకొని ఒక దరికి తెచ్చుకోవాలని పాటుపడుతున్నామన్నారు. వాళ్లను కాదని మనల్ని పోటు పొడిచేవాళ్లకు ఓటు వేస్తే మనకు దెబ్బపడుతుందన్నారు. మీ బిడ్డగా… ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పడం నా ధర్మమన్నారు. కార్మికులను, కర్షకులను, సామాన్య ప్రజలను కాపాడటం కోసం కంకణ బద్దులమై ఈ దేశం నుంచి బిజెపి వాళ్లను, పెట్టుబడుదార్ల ప్రభుత్వాన్ని తరిమికొడితేనే మనకు విముక్తి దొరుకుతుందన్నారు. ఓటు అనే ఆయుధాన్ని సమక్రంగా వినియోగించుకోవాలన్నారు.

గిరిజన బిడ్డలే రాజ్యమేలుతున్నారు.

మునుగోడులో గిరిజనులు ఉన్నారన్నారు. మా తండా… మా సర్పంచ్ కావాలి మాది మాకు అని 50 ఏళ్లు మొత్తుకుంటే ఎవరైనా చేశారా? అని ప్రశ్నించారు. కానీ టిఆర్‌ఎస్ ప్రభుత్వమే మూడున్నర వేల గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు చేసిందన్నారు. ఇప్పుడు గిరిజన బిడ్డలే రాజ్యం ఏలుతున్నారన్నారు. తాను చెప్పేవి గాలి మాటలు కాదన్నారు. మీ కళ్ల ముందు ఉన్నవేనని స్పష్టం చేశారు. కాబట్టి అలవోకగా ఏమరుపాటుగా ఓటేయ్యకుండా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇక్కడి నుంచి మునుగోడు నుంచి అనూహ్యమైన ఫలితం రావాలన్నారు. అటసట గెలవడం కాదు…. పెద్ద మెజార్టీతో విజయాన్ని అందించాలన్నారు.

జీరో ఫ్లోరైడ్ జిల్లాగా మార్చాం

నో మ్యాన్ జోన్ నుంచి జీరో ఫ్లోరైడ్ జిల్లాగా నల్గొండ జిల్లా ను మార్చామని కెసిఆర్ అన్నారు. మునుగోడు నియోజకవర్గం గతంలో ఫ్లోరైడ్‌తో ఎంత బాధ పడిందో ప్రజలందరికి తెలుసన్నారు. ఫ్లోరైడ్ బాధితులను ఢిల్లీకి తీసుకెళ్లి చూపించినా….అప్పట్లో మన మొర ఎవరూ వినలేదన్నారు. గతంలోని ఏ పాలకుడు మునుగోడు ఫ్లోరైడ్ కష్టాలను తీర్చలేదని కెసిఆర్ పేర్కొన్నారు. 15 రోజులు జిల్లాలో తిరిగి ఫ్లోరైడ్ కష్టాలపై అవగాహన కల్పించామన్నారు. అందరి పోరాట ఫలితంగా తెలంగాణ సాధించుకున్నామన్నారు. ఇప్పుడు మిషన్ భగీరథ జలాల ద్వారా జీరో ఫ్లోరైడ్ జిల్లాగా రూపొందించుకున్నామన్నారు. నల్గొండ జిల్లా నో మ్యాన్ జోన్‌గా మారే ప్రమాదం ఉందని నిపుణులు, మేధావులు హెచ్చరించినా ఫ్లోరైడ్ గురించి గత పాలకులు ఆలోచించలేదన్నారు. నల్గొండ జిల్లాలో కృష్ణా నది పారుతున్నా ప్రజలకు తాగునీళ్లు ఎందుకు అందలేదని ఈ సందర్భంగా కెసిఆర్ ప్రశ్నించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News