Friday, November 1, 2024

సిఎం ఫోన్

- Advertisement -
- Advertisement -

ఆలుగడ్డ రైతుకు సిఎం ఫోన్

మన తెలంగాణ/హైదరాబాద్: హలో… నాగిరెడ్డి బాగున్నావా! నేను సిఎంను మాట్లాడుతున్నా…. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామ రైతు నాగిరెడ్డిని ఎన్ని ఎకరాల్లో అలుగడ్డ సాగు చేస్తున్నారు? ఏ రకం విత్తనం వేస్తున్నారు? దిగుబడి ఏ విధంగా వస్తుంది? విత్తనాలు ఎక్కడ నుంచి తీసుకొస్తారు? ఒక్కొక్క మొ క్కకు ఎన్ని గడ్డలు ఊరుతాయి? బరువు ఎంత వరకు ఉంటుంది? అని కెసిఆర్ అడిగా రు. సిఎం నుంచి ఇలా ఫోన్ వస్తుందని ఊహించని ఆ రైతు ఒక్కసారిగా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. వెనువెంటనే తేరుకుని సిఎం అడిగిన ప్రతి అంశానికి తనకు తెలిసిన వివరాలను సమగ్రంగా చెప్పారు. ఇటీవలే వరి వెదసాగుపై ఎపికి చెందిన ఓ రైతుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న సిఎం కెసిఆర్ తాజాగా ఆలుగడ్డ సాగుపై నాగిరెడ్డితో ముచ్చటించారు. ఎకరానికి విత్తన ఖర్చు ఎంత అవుతోంది? ఏ రకమైన విత్తనాలు, పంట కాలం, దిగుబడులు, మార్కెట్ ధరలు వంటి పలు అంశాలను రైతు నుంచి సిఎం తెలుసుకున్నారు. జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈసారి 1500 నుంచి 2 వేల ఎకరాల్లో రైతులు ఆలుగడ్డ సాగుచేసినట్లుగా ఒక అంచనా అని రైతు చెప్పాడు. గతంలో జ్యోతి, ఖ్యాతీ అనే విత్తన రకాలను నాటగా ఈ ప్రాంత వాతావరణానికి దిగుబడులు అంతగా రాలేదన్నారు.

దీంతో 166 పోక్రాజ్ అనే విత్తనాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. దీనికి ఎకరానికి 15 నుంచి 16 బస్తాల బేబీ పొటాటోలను విత్తనంగా విత్తాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఒక మొక్క నుంచి 8 నుంచి 10 గడ్డల వరకు కాత వస్తూ బరువు సుమారు కిలో వరకు తూగుతుందన్నారు. ఎకరానికి 12 నుంచి 15 టన్నుల దిగుబడి వస్తుందన్నారు. ఎర్ర భూముల్లో పండే దుంపలకు పది కేజీల బ్యాగుకు రూ.170 నుంచి రూ. 180 వరకు మార్కెట్ రేటు పలుకుతుండగా అదే నల్లరేగడి భూముల్లో పండే దుంపలకు పది కేజీల బ్యాగ్‌కు రూ. 200 పలుకుతున్నట్లు తెలిపారు. నల్లరేగడి భూముల్లో పండే దుంపలు తెల్లగా ఉండటమే రేటు వ్యత్యాసానికి కారణమన్నారు. పంట కాలం 85 రోజులుగా తెలిపిన రైతు పంటతీసే సమయాని కన్నా 15 రోజులు ముందుగానే పొలానికి నీళ్లు బంద్ చేయాలన్నారు. గడ్డకు మట్టి ఉండకుంటా పొల్లుగా వచ్చేందుకే నీళ్లు బంద్ చేయాలన్నారు. ఆలుగడ్డ సాగును గురించి తెలుసుకున్న సిఎం కెసిఆర్ వారం రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు రానున్నట్లు తెలిపారు.

CM KCR Phone call to Zahirabad farmer

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News