మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఫోటో ను మార్ఫింగ్ చేసి దళితులను కించపరుస్తూ సోషల్ మీడియాలో వికృత చేష్టలకు పాల్పడిన బిజెపి నేతలు, కార్యకర్తలపై వనస్థలి పురం పోలీస్ స్టేషన్‌లో దళిత, గిరిజన సంఘాల నేతలు బుధవారం ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో సిఎం కెసిఆర్ ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ దళితులను కించపరుస్తూ దళితులను కోళ్లుగా చిత్రీకరిస్తూ సామాజిక మాధ్యమాల్లోని పోస్టులపై దళిత, గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈక్రమంలో బిజెపి ప్రత్యక్షంగా అసభ్యకరమైన పోస్టులను సోషల్ మీడియాలో వ్యాప్తి చేయడం పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సాక్ష్యాధారాలతో వనస్థలిపురం పోలీస్ ఇన్స్పెక్టర్ కు ఆ సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా దళిత సంఘం నేత గంధం రాములు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి ప్రదాత దళితులు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న సిఎం కెసిఆర్ ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్న బిజెపి నేతల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులను కోళ్లుగా వర్ణిస్తూ సోషల్ మీడియాలో చేస్తున్న వికృత చేష్టలను ఖండిస్తున్నామన్నారు. బిజెపి పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని దళిత వర్గాలు అభివృద్ధిలో ముందువరుసలో ఉండడం ఆ పార్టీకి ఏమాత్రం ఇష్టం లేదన్నారు.దళిత బంధు పథకాన్ని కించపరచినందుకు బిజెపి దళిత వర్గాలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బిజెపి తన వైఖరి మార్చుకోక పోతే రాబోయే రోజుల్లో ఆ పార్టీ ఆఫీసు ముట్టడిస్తామని గంధం రాములు ఈ సందర్భంగా హెచ్చరించారు.
CM KCR photos Morphing in Social Media