Monday, December 23, 2024

గోల్‌మాల్ గోవిందం బడ్జెట్

- Advertisement -
- Advertisement -

CM KCR press meet on Union budget

నిర్మలా సీతారామన్ చెప్పింది శాంతిపర్వంలోని శ్లోకం ప్రవచించింది అధర్మం, ముందస్తు ఎన్నికలు అవసరం లేదు, గెలిచే మంత్రం, వ్యూహం ఉన్నాయి, 317 గొప్ప జిఒ, అన్ని ప్రాంతాలను ఈక్వలైజ్ చేస్తది, మార్చిలోగా జర్నలిస్టులకు జాగాలు, నిర్మలా సీతారామన్‌ది చాలా దారుణమైన బడ్జెట్, అది గుండు సున్నా మాత్రమే, ఉపాధి హామీకి రూ.30 వేలకోట్లకుపైగా కోత పెట్టారు, ఎరువుల సబ్సిడీని తగ్గించారు, మోడీ ప్రభుత్వం భావదరిద్య్రంలో ఉంది, కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్యానికి ఒక్కరూపాయి పెంచలేదు

ప్రధాని పదవి కోసం తపన లేదు, దేశంలో
గుణాత్మక మార్పు రావాలనే నా ఆరాటం,
అందుకోసం ప్రాణమైనా ఇస్తాం, వచ్చే ఐదు
రాష్ట్రాల ఎన్నికలు సెమీ ఫైనల్ కాదు, రెండు
రోజుల్లో మహారాష్ట్ర వెళ్తాను, అక్కడ సిఎంతో
మాట్లాడతాను, త్వరలోనే ఢిల్లీ పోతా, రాష్ట్రాల్లో
ఎన్నికలు వచ్చినప్పుడే మోడీకి
అక్కడ సమస్యలు గుర్తుకొస్తాయి

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో పరివర్తన, గుణాత్మక మార్పు రావాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ పరివర్తన తీసుకొచ్చేందుకు తన వంతు ఉజ్వలమైన పాత్ర పోషిస్తానని స్పష్టం చేశారు. తన తపన ప్రధాని పదవి కోసం కాదన్నారు. కేవలం దేశంలో గుణాత్మక మార్పు కోసమేనని ఆయన ఉద్ఘాటించారు. ఇందుకు భారత రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాజ్యాంగాన్ని మార్చాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. గుణాత్మకమైన మార్పు కోసం తన ప్రాణమైన ఇస్తానన్నారు. 75 సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బిజెపి పాలనతో ప్రజలకు ఒరిగింది ఏమిలేదని ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక చాలు దేశాన్ని తిరిగి పునరుద్దించుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు.

ఈ మార్పు కోసం తప్పకుండా తన వంతు బాధ్యత నెరవేరుస్తానని చెప్పారు. మార్పు ఎలా ఉండబోతోందనేది త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. దేశంలో పరివర్తన కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దేశం పురోభివృద్ధి దిశగా సాగాలంటే బిజెపిని కూకటివేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో కలపాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టున బడ్జెట్‌పై సోమవారం ప్రగతి భవన్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి సుమారు రెండున్నర గంటల పాటు సిఎం కెసిఆర్ సుదీర్ఘంగా మాట్లాడారు. వివిధ అంశాలపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోడీ,కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌పై తనదైన శైలిలో విరుచుకపడ్డారు. బిజెపి పాలనపై భగభగమండిపడ్డారు. ఇంత నీచ, నికృష్ట పాలనను తాను ఇప్పటి వరకు చూడలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనేక అంశాలపై రాజ్యాంగంలో స్పష్టత లేదని అన్నారు. అస్పష్ట రాజ్యాంగాన్ని పదే పదే సవరించడం కాదని, అందుకే తాను మార్చాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ అంశంపైదేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఫెడరల్ వ్యవస్థలకు తూట్లు పొడుస్తూ రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఐఎఎస్‌లపై కేంద్రం పెత్తనం ఏమిటని ప్రశ్నించారు? దేశంలో మార్పు రావాలి…- కొత్త వెలుగులు వెలగాలని ఆకాంక్షించారు. దేశంలో మార్పు కోసం అనేక మంది వేధావులు, ముఖ్యనేతలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. దేశానికి ఏంకావాలో అనే అంశంపై త్వరలోనే కార్యాచరణను మొదలు పెడతామన్నారు. 8 ఏళ్లలో మోడీ ప్రభుత్వం దేశానికి ఏం చేసిందని సిఎం కెసిఆర్ ప్రశ్నించారు. రేకు డబ్బాల్లో రాళ్లు వేసి సౌండ్ చేస్తోందని విమర్శించారు. దీనిపై చర్చకు తాను సిద్ధం అని సవాల్ విసిరారు. దుమ్ముంటే ఏం వర్గానికి న్యాయం చేసిందో చెప్పాలన్నారు. కేంద్రం బుర్రలేని పనులపై రియాక్ట్ అవ్వాలని, విప్లవం సాధించాల్సింది యువతే అని అన్నారు. 75 ఏళ్ల తరువాత కూడా మన దేశ ఆర్థిక స్థితి ఏమాత్రం బాగోలేదన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి సిగ్గుతో తలదించుకునేలా ఉందన్నారు. కేంద్రం జిడిపి లెక్కలే ఈ విషయాన్ని చెబుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నవన్నీ అబద్ధాలేనని అన్నారు.

బిజెపికి సిగ్గు, శరం లేదు

కేంద్రంలోని బిజెపి సర్కార్‌కు సిగ్గు, శరం అంటూ ఏమీ లేవని సిఎం కెసిఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తరుచూ అబద్దాలు చెబితుంటే.. కనీసం ఎవరైనా ఏమైనా అనుకుంటరేమో అనే ఆలోచన అయినా ఉంటుందన్నారు. కానీ బిజెపికి అవేమీ లేదన్నారు. ఛీ… ఛీ చాలా దరిద్రమైన పార్టీ అని ఆరోపించారు. భారత సమాజం అనుకున్నది అనుకున్నట్లు పురోగమించాలం టే ఈ దరిద్ర పార్టీని కూకటివేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో పడేయాలన్నారు. వందశాతం ఆ పని తాము చేస్తామన్నారు. ఆ పార్టీ నేతలకు పొగరు బాగా నెత్తికెక్కిందని… ఎవరి మీద పడితే వారి మీద, కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారన్నారు. దేశానికి ఏది అవసరమో అది తప్పకుండా చేసి చూపిస్తామన్నారు. ఆ పార్టీ దుర్మార్గాలను భరిస్తూ కూర్చోవడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరన్నారు. త్వరలోనే ఉద్యమిస్తామన్నారు. ఇది ప్రజాస్వామ్యమని సిఎం కెసిఆర్ అన్నారు.

బిజెపి పాలన దేశానికి కీడు

మోడీ పాలనతో ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఆయన పాలనంతా బడాబాబులుకు దోచిపెట్టడానికే సరిపోయిందని విమర్శించారు. దేశంలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నప్పటికీ వాటిని ప్రజలకు అందించలేని దుస్థితిలో కేంద్రం ఉందని మండిపడ్డారు. దేశంలో పుష్కలంగా నీళ్లు అందుబాటులో ఉన్నా సాగు, తాగునీరు అందట్లేదన్నారు. అలాగే విద్యుత్ ఉన్నా 65 శాతం దేశ ప్రజలు అంధకారంలో ఉన్నారన్నారు. అందుకే దేశంలో మార్పు కావాలని ప్రజలను కోరుతున్నానని అన్నారు. దేశాన్ని పాలించే శక్తి ఉంటే… ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దవచ్చునని అన్నారు. ఇందులో కాంగ్రెస్, బిజెపి రెండు పార్టీలు విఫలమయ్యాయన్నారు. ఈ వైఫల్యం వల్లే దేశంలో దరిద్రం, నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. ప్రస్తుత కేంద్ర విధానాల వల్ల దేశం పురోభివృద్ధి సాధిస్తుందా? అన్న సందేహాలు నెలకొన్నాయన్నారు. దేశంలో అతిపెద్ద మార్పు రావాల్సి ఉందన్నారు. దీని కోసం తాము చూస్తూ ఊరుకోమన్నారు. త్వరలో తప్పకుండా ఉద్యమిస్తామన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి ఉద్యమం చేశామన్నారు. దేశ ప్రజల్లో పరివర్తనతో పాటు అంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.

మోడీది కురుస బుద్ది

దేశంలో కురుస బుద్ధి ఉన్న నరేంద్రమోడీ ప్రధాన మంత్రిగా కొనసాగుతున్నారని సిఎం కెసిఆర్ ఉన్నారు. దేశ ప్రజలకు బిజెపి ప్రభుత్వం ఏంచేసిందని ఆయన ప్రశ్నించారు. మోడీ పాలన వల్ల ఏ వర్గం అభివృద్ధి చెందలేదన్నారు.పైగా బిజెపి పాలనలో గజదొంగలు, బ్యాంకులను ముంచినవాళ్లు విదేశాలకు పంపించారన్నారు. బ్లాక్ మనీ ఉన్నవాళ్లను బయటకు పంపిన ఘనులు మీరు అని మోడీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. నల్ల ధనం తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ప్రతిగా నల్లధనం కలిగిన దోపిడీ దారులను విదేశాలకు పంపించిందంటూ సంచలన కామెంట్స్ చేశారు. నల్లధనం తెస్తాం ప్రతీ ఇంటికి రూ. 15 లక్షలు వేస్తాం.. గప్పాలు చెప్పారంటూ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. చెప్పిన నల్లధనం తేకపోగా బిజెపి హయాంలోనే అతి ఎక్కువ బ్యాంకు మోసాలు జరిగాయన్నారు. బ్యాంక్ మోసగాళ్లను విదేశాలకు పంపించింది బిజెపి ప్రభుత్వమే అని విమర్శించారు.

గజదొంగలు, బ్యాంకు దోపిడీదారులు, బ్యాంకులను ముంచిన వాళ్లందరూ బిజెపి హయాంలోనే విదేశాలకు పారిపోయి ఎంజాయ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. బ్లాక్ మనీ తీసుకురాలే మన్ను తీసుకురాలే. లక్షలు ఇస్తమని రూ.15 రూపాయలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్నివన్నీ బోగస్ మాటలే అని నిప్పులు చెరిగారు. అలాగే కోర్టుల్లో పరిష్కారం కావాలంటే సమయం పడుతుందన్నారు. కోర్టు బయట పంచాయతీలు తెంపుకునే వ్యవస్థను యావత్ ప్రపంచం అవలంభిస్తోందన్నారు. దీని నుంచి పుట్టుకు వచ్చిందే లోకాయుక్త అని అన్నారు. ఆర్బిట్రేషన్ సెంటర్లు కూడా మన దేశంలో లేవన్నారు. కేవలం సింగపూర్, దుబాయ్, లండన్లో ఆర్బిట్రేషన్ సెంటర్లు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఇండియా పారిశ్రామికవేత్తలు కూడా అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ అంశం తన దృష్టికి వచ్చిన తర్వాత సిజెఐ ఎన్‌వి రమణను ప్రార్థించానని అన్నారు.

ఆయన దయతలచి ఆర్బిట్రేషన్ సెంటర్‌ను హైదరాబాద్లో ఏర్పాటు చేశారన్నారు. కొంత ఖర్చు అయినా భయపడకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ సెంటరుకు ఒకఓ భవనాన్ని కిరాయికి తీసుకొని, రూ. 15 కోట్లతో సదుపాయాలు కల్పించామన్నారు. ప్రతి సంవత్సరం రూ. 3 కోట్లు ఇస్తామని చెప్పామన్నారు. రూ 300 కోట్ల విలువైన స్థలాన్ని కూడా ఇచ్చామన్నారు. రూ. 50 కోట్లతో సొంత భవనం నిర్మించబోతున్నామని దానికి ఈ నెల 5న శంకుస్థాపన చేయనున్నారన్నారు. ఇది మోడీకి నిద్ర పట్టడం లేదని.. దీనికి పోటీగా గిఫ్ట్ సిటీ అనే సంస్థను గుజారాజ్‌లో ఏర్పాటు చేయబోతున్నారని మండిపడ్డారు.

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు సెమీ ఫైనల్ కాదు

త్వరలో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికలు సెమీ ఫైనల్ కాదని సిఎం కెసిఆర్ అన్నారు. ఉత్తరప్రదేశ్లో గెలిస్తే బిజెపికి అహంకారం మరింత పెరుగుతుందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీకి చెప్పినా గోడకు చెప్పినా ఒక్కటేనంటూ ఘాటైన కామెంట్స్ చేశారు. బెంగాల్లో ఎన్నికలు వస్తే ఠాగూర్‌లా వేషధారణ, పంజాబ్లో ఎన్నికలు వస్తే సిక్కుల మాదిరిగా వేషధారణ వేస్తారంటూ ప్రధాని మోడీపై ఆయన సెటైర్లు వేశారు.

చెమటోడ్చి సమతామూర్తి విగ్రహం ఏర్పాటు

చినజీయర్‌స్వామి రామానుజాచార్యుల విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని సిఎం కెసిఆర్ అన్నారు. రామానుజాచార్యుల విగ్రహానికి రామేశ్వరరావు వందెకరాలు ఇచ్చారన్నారు. ముచ్చింతల్ కేంద్రంలో అనేక ధార్మిక కార్యక్రమాలు చేస్తారని వివరించారు. సమతామూర్తి విగ్రహానికి బిజెపి, ఆ పార్టీఅనుబంధ సంస్థలు రూపాయి ఇవ్వలేదని ఆరోపించారు. అయితే యుపి ఎన్నికల రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల ప్రచారంలో విగ్రహం ఘనత బిజెపి చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. జీయర్‌స్వామి చెమటోడ్చి సమతామూర్తి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని కొనియాడారు. ప్రపంచాన్ని ఆకర్షించే ఆధ్యాత్మిక కేంద్రం అవుతుందన్నారు.

గుజరాత పైన పటారం…లోన లొటారం

గుజరాత్ మోడల్ అంటూ వచ్చిన మోడీని నమ్మి జనాలు ఓట్లేస్తే అందరికీ చిప్ప చేతికిస్తున్నారంటూ విమర్శించారు. గుజరాత్ మోడల్లో ఏముందడని, పైన పటారం లోన లోటారం మాదిరిగా గుజరాత్ మోడల్ ఉంటుందని ఎద్దేవా చేశారు. పేదలను పూర్తి హీనంగా చేసే మోడల్ గుజరాత్ మోడల్ అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి ఘోరమైన నిర్ణయాలు అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పవర్ రిఫారమ్స్ అనే మెంటల్ పట్టుకుందని విమర్శలు గుప్పించారు. విద్యుత్ సంస్కరణలతో పేరుతో వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టాలని కేంద్రం భావిస్తోందని ఆరోపించారు.

నగరంలో రిటైర్డ్ అఖిల భారత అధికారుల సదస్సు

ప్రజల సహకారంతో పోరాడి తెలంగాణను సాధించామని… ఇప్పుడు దేశ ప్రజల్ని జాగృతం చేయాల్సిన అవసరం ఉందని సిఎం కెసిఆర్ అన్నారు. ఇందులో భాగంగా త్వరలోనే రిటైర్డ్ అఖిల భారత అధికారుల సదస్సు నగరంలో జరుపబోతున్నామన్నారు. దేశం ఏ పంథాలో ముందుకెళ్లాలో చర్చ జరుపుతామన్నారు. దేశాన్ని బిజెపి ప్రభుత్వం నాశనం చేస్తోందన్నారు. కేంద్రం బుర్రలేని పనులపై యువత పోరాడాలని ఈ సందర్భంగా సిఎం పిలుపునిచ్చారు.

కేంద్రానికి మెదడు లేదు

కేంద్ర ప్రభుత్వానికి మెదడు లేదని సిఎం కెసిఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర విద్యుత్ విధానం చెత్తగా ఉందని విమర్శించారు. గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బిజెపి దేశాన్ని నాశనం చేస్తున్నాయని మండిపడ్డారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంతో మోడీ అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. గుజరాత్ మోడల్‌లోన లొటారం… పైన పటారమని ఆయన దుయ్యబట్టారు. పవిత్ర గంగా నదిలో శవాలు తేలేలా కేంద్రం చేసిందని ఆరోపించారు. విద్యుత్ సంస్కరణల పేరుతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్నారు. బిజెపి పాలన అంటే నమ్మి ఓట్లేసిన వాళ్లను ముంచుడేనన్నారు. ప్రపంచ ఆకలి బాధపై ఏటా హంగర్ ఇండెక్స్ వెలువడుతోందని…ఇందులో భారత్ 101 స్థానంలో నిలిచిందన్నారు. నేపాల్, బంగ్లాదేశ్ కంటే అద్వాన స్థితిలో భారత్ ఉందని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. బడ్జెట్లో ఆహార రాయితీలు కూడా తగ్గించారన్నారు. ఎల్‌ఐసీని విక్రయిస్తున్నామని బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాల్లో ఉన్న ఎల్‌ఐసీని ఎందుకు విక్రయిస్తున్నారని ప్రశ్నించారు. నాకు ధిమాక్ కొంచెం తక్కువ. ఎల్‌ఐసిని ఎందుకు అమ్ముతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎవరి ప్రయోజనాలు ఆశించి ఎల్‌ఐసిని అమ్ముతున్నారని నిలదీశారు. అంతర్జాతీయంగా అమెరికాలో ఉన్న అతిపెద్ద బీమా కంపెనీలకు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారా? వారికి లాభం చేకూర్చేందుకే ఈ నిర్ణయాలా? ఇదేం దందా? ఎవరిని మోసం చేస్తున్నారనిఅని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

మత పిచ్చిలేపడం దేశాన్ని అమ్మడమే బిజెపి పాలసీ

బిజెపిపాలన అంటే దేశాన్ని అమ్మడే తప్ప మరోటి లేదని సిఎం కెసిఆర్ విమర్శించారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను ముంచడం, దేశాన్ని అమ్మడమే ఆ పార్టీ పని అన్నారు. మత పిచ్చి లేపాలి… మంది మీద పడి ఏడవాలి…. దేశ ఆస్తులన్నీ అమ్మాలి… దానిని కవర్ చేసుకోవడానికి తమాషా చేస్తూ మహాభారత శ్లోకం, భాగవత శ్లోకం అని చెప్పి జనాలను గోల్మాల్ చేయాలి….ఇది బిజెపి విధానం అని సిఎం కెసిఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

నదుల అనుసంధానం బిగ్ జోక్

నదుల అనుసంధానం అనేది బిగ్ జోక్ అని సిఎం కెసిఆర్ అన్నారు. ఏ ప్రతిపాదికన చేస్తారని ప్రశించారు. కృష్ణా, గోదావరి నిధులను తీసుకపోయి కావేరి ఎలా కలుపుతారన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలను అడగకుండా తమ నీళ్లపై కేంద్రం ఎలా ప్రకటన చేస్తుందని నిలదీశారు. ఏ అధికారంతో కేంద్రం ఆ ప్రకటన చేసిందన్నరు. ఎవరిని మోసం చేయడానికి అను సంధానం ప్రకటన? అని అడిగారు. నోటికి ఏదొస్తే అది చెప్తాం… ఎవరిని పడితే వారిని తిడతామంటే ఎలా? అని కేంద్రంపై ఫైర్ అయ్యారు. రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండా గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేస్తామని బడ్జెట్‌లో ప్రకటించడం శోచనీయమన్నారు. గోదావరి జలాల్లో ప్రతి బొట్టుపై తెలుగు రాష్ట్రాలకే అధికారం ఉందని ఆయన ఉద్ఘాటించారు. కేంద్రం నిధులు ఇవ్వకున్నా ప్రజలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. గోదావరి జలాల విషయమై ట్రైబ్యునల్లో కేసు ఉందన్నారు. అలాంటప్పుడు కేంద్రం ఎలా ప్రకటన చేస్తుందన్నారు. దేశంలో 65 వేల టిఎంసిల నీటి లభ్యత ఉందని, అందులో కేవలం 35 వేల టిఎంసిలు మాత్రమే నీటిని వినియోగంలోకి తెచ్చారన్నారు.

కేంద్ర విధానాల వల్లే దేశంలో నీటి యుద్ధాలు జరుగుతున్నాయన్నారు. కేంద్ర జల విధానాల వల్ల రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన జలశక్తి మిషన్‌కు రూ.60 వేల కోట్లు కేటాయించామని గొప్పలు చెబుతున్నారన్నారు. 140 కోట్ల దేశ జనాభాకు రూ.60 వేల కోట్లా ? అని ప్రశ్నించారు. కేవలం తెలంగాణలోనే మిషన్ భగీరథకు రూ.40 వేల కోట్లు కేటాయించామన్నారు. ఈ నేపథ్యంలో జలశక్తి మిషన్ పేరిట కేంద్రం ప్రజలను మరోసారి మోసం చేస్తోందన్నారు దేశంలో 4.1 లక్ష మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉందని… 2 లక్షల మెగావాట్లు కూడా వినియోగిం చుకోవట్లేదని చెప్పారు. ఈ విషయం అబద్దమని రుజువు చే స్తే తాను సిఎం పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

317 గొప్పజిఒ

n దీనిపై సిగ్గు తప్పి ఉద్యమం చేస్తున్నారు
n అన్ని జిల్లాల నిరుద్యోగులకు ఉద్యోగాలు రావద్దా..?
317 గొప్ప జీఓ అని ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాఖ్యానించారు. 317 జీఓ గురించి మాట్లాడేటోని లాగు పగులగొట్టాలని చెబుతా ఉన్నా అని యువకులకు పిలుపునిచ్చారు. ఎవరో కొంతమంది స్వార్థపరులైన ఉద్యోగులు కొంతమంది, వారు కోరుకున్న చోటనే ఉంటామని అంటున్నారని, దాని ద్వారా వచ్చే ఉద్యోగాలలో కొన్ని జిల్లాలో అసలు ఉద్యోగాలే రావని పేర్కొన్నారు. జిల్లా కేడర్ ఉద్యోగాలైన టీచర్ ఉద్యోగాలు, పోలీసులు ఉద్యోగాలలో కొన్ని జిల్లాల్లో ఉద్యోగాలే రావని అన్నారు. అందరూ కరీంనగర్, వరంగల్ ప్రాంతాలలో ఉద్యోగాలు చేయాలనుకుని అంతా ఇప్పుడున్న ఉద్యోగులే నిం డిపోతే ఆ జిల్లాల నిరుద్యోగులకు ఉద్యోగాలు రావద్దా అని ప్రశ్నించారు. మారుమూల ప్రాంతాలలో ఉద్యోగం చేయడానికి ఉద్యోగులు రారని ప్రజాప్రతినిధులు ఎప్పు డు ఆవేదన వ్యక్తం చేస్తారని చెప్పారు. మారుమూల ప్రాంతాల జిల్లాల ప్రజలకు వికాసం రావద్దా అ ని నిలదీశారు. రాష్ట్రంలో మొత్తం సుమారు 50 వేలకుపైగా ఉద్యోగాలే బదిలీలయ్యారని, అందులో 57మంది మాత్రమే జాయిన్ కాలేదని తెలిపారు. ఈ ఉద్యమం చేసే వాళ్లకు చదువు శాస్త్రం ఏమన్న వస్తదా నాకైతే అర్థం కావడం లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఉద్యమం చేసే వాళ్లకు సామాజిక బాధ్యత ఏమైనా ఉందా..? అని ప్రశ్నించారు. ఇప్పుడు 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా మల్టీ జోనల్ పోస్టింగ్ అని పెట్టామని, అందులో 5 శాతం మాత్రమే ఇతర ప్రాంతాలకు వాళ్లకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. స్టేట్ లెవల్ పోస్టు అంటే 30 శాతం నాన్ లోకల్ వాళ్లు వస్తారని, మల్టీ జోనల్ విధానంలో 95 శాతం మన పిల్లలకే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. మిగిలిన 5 శాతంలో కూడా 3 శాతం మనకే వస్తదని, గరిష్టంగా వన్ టూ పర్సంట్ బయటకి పోతే 95 నుంచి 98 శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు వస్తాయని అన్నారు.

త్వరలోనే జర్నలిస్టులకు, ఎంఎల్‌ఎలకు ఇళ్ల స్థలాలు

జర్నలిస్టులకు, శాసనసభ్యులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ నెలాఖరులోగా ఇళ్ళ స్థలాల సమస్యకు ఒక పరిష్కారం లభింస్తుందని స్పష్టం చేశా రు. దీనిపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సుప్రీంకోర్టు లో బలంగా వాదనలు వినపించి ఈ సమస్యకు ముగిం పు పలుకపోతున్నామన్నారు. తనకున్న సమాచారం మేరకు ఈ నెలలోనే అన్ని అడ్డంకులు తొలగిపోనున్నాయన్నారు. భవిష్యత్తులో స్థలాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైతే మరో కొత్త చట్టాన్ని తీసుకొస్తామన్నారు. ఆ చట్టం మేరకు అర్హులైన వారందరికి ఇళ్ల స్థలాలు ఇస్తామని సిఎం కెసిఆర్ హామి ఇచ్చారు. అయితే కొంపల్లిలో జర్నలిస్టులకు కేటాయించిన స్థలంలో రాష్ట్ర ప్రభు త్వం ఐటి టవర్‌ను ఏర్పాటు చేయనుందని…ఆ స్థలాన్ని ఐటి టవర్‌కు కాకుండా తమకే కేటాయించాలని పలువురు జర్నలిస్టులు సిఎం కెసిఆర్‌ను అడిగారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఒక చోట స్థలం పోయినా ఫరవాలేదు… రెండు, మూడు చోట్ల కీలకమైన ప్రాంతాల్లోను సేకరించి జర్నలిస్టులకు, శాసనసభ్యులకు స్థలాలను కేటాయిస్తామన్నారు. తాను మాట ఇచ్చాను అంటే….అది జరిగిపోయినట్లే లెక్క అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తానే చొరవ తీసుకుని స్థలాలు ఇస్తామన్నారు. కనీసం మన పిల్లలకు అయిన అత్యంత ఖరీదైన స్థలాలు ఇచ్చినట్లు అవుతుందన్నారు.

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండవు

రాష్ట్రంలో ముందస్తూ ఎన్నికలు ఉండవని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. గడువు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజల సంతోషంతో ఉన్నారన్నారు. తమ పాలన పాట్ల సంతృప్తిగా ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో ముందస్తూ ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. కొందరు చిల్లర, మల్లరగాళ్లు చేస్తున్న ఉత్తుత్తి ప్రచారంగా ఆయన కొట్టేపారేశారు. అయితే వచ్చే ఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల ముందుగానే చెబుతున్నా…రాసుకోండి….వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు 95 నుంచి 105 సీట్లు లభిస్తాయన్నారు.

ఎన్నికల్లో ఎలా గెలువాలో తమ దగ్గర మంత్రం ఉందన్నారు. అయితే ఆరు నెలల ముందుగానే అభ్యర్ధులను ప్రకటించనున్నట్లు మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన వెల్లడించారు. 2018లో ప్రత్యేక పరిస్థితుల కారణంగానే ఆరు నెలల గడువుకుంటే ముందుగానే ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందని సిఎం కెసిఆర్ అన్నారు. అయితే 2014లో టిఆర్‌ఎస్‌కు 63 సీట్లు వస్తే తదనంతరం జరిగిన ఎన్నికల్లో 88 సీట్లు దక్కాయన్నారు. ఇది ప్రజలు తమపై ఉంచిన విశ్వాసానికి నిదర్శమన్నారు. ఇదే పరిస్థితి వచ్చే ఎన్నికల్లో కూడా పునరావృతం కాబోతున్నదన్నారు.

అలాంటి వారిని మొరిగే కుక్కు అంటాం

మతం పేరుతో దేశంలో విభజన తీసుకువస్తున్నారని, బిజెపి విధానాలపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం పోయిన ఆర్థిక సంవత్సరం లో రూ. 1.51 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని, ఈసారి రూ. 1.80 లక్షల కోట్లు ఖర్చు చేస్తు న్నామన్నారు. కరోనా పరిస్థితుల్లోనూ రాష్ట్ర రాబడి పెరిగిందని వివరించారు. రాష్ట్రంలో అన్ని పరిస్థితులు బాగున్నాయి కాబట్టే ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం సృష్టించామన్నారు. ఈ పరిస్థితిని విమర్శించే వాళ్లను మొరిగే కుక్కలు అంటాం అని ఘాటైన కామెంట్స్ చేశారు. తాము అవినీతిపరులమైతే టిఎస్.. ఐపాస్ ఎందుకు పెడతామని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News