ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ ఏడాది బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ. 26,831 కోట్లను కేటాయించారు. రైతు కుటుంబాలకు కొండత ధీమాగా మారిన రైతు బీమాకు 1589 కోట్లు కేటాయించారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన కరెంట్ సబ్సిడీ కోసం రూ. 12 వేల కోట్లను కేటాయించారు. సంపదను పెంచడం పేదలకు పంచడం ఎజెండాతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతుకు దన్నుగా నిలిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ఈ ఏడాది రాష్ట్రంలో పండిన ధాన్యమే సమాధానం చెబుతుంది. దరిద్రంలో మగ్గిన తెలంగాణ రైతన్న, ధాన్య రాశులను ఘనంగా పండించడం చూస్తుంటే గర్వంగా ఉంది. రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో 131.33 లక్షల ఎకరాల విస్తీర్ణం సాగులో ఉంటే ముఖ్యమంత్రి కెసిఆర్ అవలంబిస్తున్న వ్యవసాయ అనుకూల విధానాలతో అది 215.37 లక్షల ఎకరాలకు చేరింది ఇది నిజంగా గొప్ప విషయం..
దేశంలో చర్చ రాజేసిన తెలంగాణ దళిత బంధు పథకానికి రూ. 17,700 కోట్లు కేటాయించి దళితుల పట్ల ప్రభుత్వానికి ఉన్న ప్రేమను చాటింది. అణగారిన దళిత వర్గాల్లో వెలుగులు నింపేలా దళిత బంధు ఇప్పటికి రాష్ట్రవ్యాప్తంగా అమలు అయి మంచి ఫలితాలు వచ్చాయి. ఇదే తరహాలో ప్రతి దళిత కుటుంబానికి విడతల వారీగా సహాయం అందేలా దళిత బంధుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు ముఖ్యమంత్రి కెసిఆర్. నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ్ద పెట్టి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఎస్‌డిఎఫ్ నిధులను పెద్ద ఎత్తున కేటాయించడం హర్షనీయం. ప్రతి పల్లె, ప్రతి పట్టణం, ప్రతి నియోజకవర్గం సమూలంగా అభివృద్ధి చెందినప్పుడే సాధించుకున్న తెలంగాణకు సార్థకత. అందుకు అనుగుణంగానే ముఖ్యమంత్రి కెసిఆర్ నియోజకవర్గాల అభివృద్ధి నిధిని పెంచారు. పేదవాడి సొంతింటి కలను నిజం చేసేందుకు సొంత స్థలంలో ఇండ్లు నిర్మించుకునేందుకుగాను రూ. 12 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. తద్వారా సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలనే కలను నిజం చేస్తున్నారు సిఎం కెసిఆర్. బిక్కచిక్కి నిరాదరణకు గురవుతున్న వృద్ధులు, దివ్యాంగుల బతుకుల్లో కొండంత భరోసా నింపిది కెసిఆర్ ప్రవేశపెట్టిన ఆసరా పథకం. ఆగమైన బతుకులకు అన్నం పెడుతుంది ఆసరా పథకం. ఆ పథకానికి బడ్జెట్‌లో నిధులు పెంచారు.
పేదవాడికి ఉన్నత విద్య, వైద్యం అందినప్పుడే వారు సంతోషంగా జీవించగలరు. నేటి పరిస్థితుల్లో కార్పొరేట్ పాఠశాలలో చేర్చినా, కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేకూర్చినా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి అప్పుల పాలయ్యే దీనస్థితి. పేదవాడికి విద్య, వైద్యం అందని ద్రాక్షగా మారుతున్న తరుణంలో మన ఊరు మన బడి పేరుతో గొప్ప కార్యక్రమాన్ని రూపొందించి ఉచితంగా నాణ్యమైన కార్పొరేట్ స్థాయి విద్య పేదలకు అందిస్తున్నారు సిఎం కెసిఆర్. అదే విధంగా తెలంగాణ ఏర్పాటు తర్వాత వైద్యరంగంలో పెను మార్పులు సంభవించాయి. ప్రభుత్వ ఆసుపత్రులు అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నాయి. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుంది. నాడు నేను రానుబిడ్డో సర్కారు దవాఖానాకు అనే స్థాయి నుండి నేను వస్తబిడ్డో సర్కారు దవాఖానాకు అనే స్థాయికి తీసుకువచ్చారు.
సంక్షేమంలో దేశం గర్వించే స్థితిలో తెలంగాణ ఉంది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు దేశమంతా అమలు చేయాలనే డిమాండ్ రావటానికి ఏటేటా బడ్జెట్‌లో కేటాయిస్తున్న నిధులు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పేదలకు పించన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్, అంగన్ వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం, అమ్మ ఒడి, న్యూట్రిషన్ కిట్ ఇలా అనేక పథకాలు పేద ఆడబిడ్డల పాలిట వరంలా మారాయి. మాతా శిశు సంక్షేమంలో తెలంగాణ గొప్ప దారిలో ముందుకు సాగుతుంది. విద్యార్థుల భవిత కోసం స్కాలర్ షిప్‌లకు, రీఎంబర్స్‌మెంట్ లాంటి కార్యక్రమాలకు 5609 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ ఇలా సబ్బండ వర్గాల సంక్షేమం అభివృద్ధికి ఈబడ్జెట్ బంగారు బాట లు వేసింది. కాన్పు నుండి కాటి వరకు, సంక్షేమం నుండి అభివృద్ధి వరకు పల్లె నుండి పట్టణం వరకు అన్ని చోట్ల అభివృద్ధికి ప్రతీకగా ఈ బడ్జెట్ నిలిచింది.
* తెలంగాణ విజయ్- 9491998702