హైదరాబాద్: కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు అన్నట్లుగా కేంద్రం వైఖరి ఉందని సిఎం కెసిఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. మా వడ్లు మద్దతు ధరకు కొనాల్సిందేనని, పంజాబ్ ఏ తరహాలో ధాన్యాన్ని సేకరిస్తున్నారో తెలంగాణలో అదే విధంగా సేకరించాలని డిమాండ్ చేశారు. ధాన్యం సేకరించడంలో కేంద్రం సమ్మతిస్తే సంతోషమని, కేంద్రం సమ్మతించకుంటే ఎంత పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు.
పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తామని, తెలంగాణ ఉద్యమ స్థాయిలో పోరాటం చేస్తామని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలలో మార్కెటు యార్డుల్లో తీర్మానాలు చేసి ప్రధాని నరేంద్ర మోడీకి పంపిస్తామన్నారు. బిజెపోళ్లు సమాజాన్ని విభజించి విషపూరిత ప్రయోగాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దేశానికి ఏ మాత్రం మంచిది కాదని హెచ్చరించారు. ఉత్తర ప్రదేశ్‌లో బిజెపికి సీట్లు తగ్గుతాయని గతంలో తాను చెప్పానని, ఉత్తరాఖండ్‌లో బిజెపికి సీట్లు తగ్గాయన్నారు. పంజాబ్‌లో రైతుల ఆగ్రహాన్ని బిజెపి చవి చూసిందన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక కొత్త ప్రాజెక్ట్ కట్టలేదని, కొత్త ఫ్యాక్టరీ పెట్టలేదని కెసిఆర్ మండిపడ్డారు. యుపిఎ కంటే అధ్వాన్నమైన పరిస్థితి దేశంలో ఉందని, యుపిఎలో జిడిపి ఎనిమిది శాతం ఉంటే ఇప్పుడు ఆరు శాతంగా ఉందన్నారు. యాసంగి వరి ధాన్యం మొత్తం పంజాబ్ తరహాలో కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయడం జరిగిందన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఈ సారి 20 లక్షల ఎకరాల వరి పంట తగ్గించామని, 30 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారని, ఆహారం రంగంలో అన్ని దేశాలు స్వావలంబన ఉండాలని కోరుకుంటున్నాయని, పెద్ద జనాభా ఉన్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందని, ఏదైనా విపత్తు జరిగితే ఆహార కొరత రాకూడదన్నారు. రెండు మూడేళ్ల పాటు బఫర్ స్టాక్ మెయింటైన్ చేయాలని కేంద్రానికి సూచించారు. ధాన్యం సేకరణ బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోకూడదని కెసిఆర్ అన్నారు.
ధాన్యం సేకరణలో రాష్ట్రానికో నీతి ఉండకూడదన్నారు. జాతీయ ధాన్యం సేకరణ విధానం ఉండాలన్నారు. ఇది రైతుల జీవన్మరణ సమస్యగా మారిందన్నారు. గతంలో రైతులు పంజాబ్‌లో ఉద్యమాలు చేయడంతో ఎంత పంట పండినా కొనుగోలు చేస్తున్నారన్నారు. కేంద్ర సాయం లేకున్నా ప్రాజెక్టులు నిర్మించుకున్నామన్నారు. తెలంగాణలో పంట సాగు పెరిగిందన్నారు.