బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన హోం మంత్రి మహమూద్ అలీ
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని గురువారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. నగరానికి చేరుకున్న సిఎం కెసిఆర్‌కు బేగంపేట విమానాశ్రయంలో హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ ఘనంగా స్వాగతం పలికారు. ఈ నెల 1వ తేదీన ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి కెసిఆర్ వారం రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. 2వ తేదీన ఢిల్లీలోని వసంత్ విహార్‌లో తెలంగాణ భవన్‌కు భూమి పూజ చేశారు. ఆ తర్వాత వరుసగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, గజేంద్ర సింగ్ షెకావత్‌లను సిఎం కెసిఆర్ కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రతిపాదనలకు ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు సానుకూలంగా స్పందించారు. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి మోదీని సిఎం కెసిఆర్ ఆహ్వానించారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలపై ఢిల్లీ నుంచే సిఎం సమీక్షించి సిఎస్‌కు పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని సిఎం అప్రమత్తం చేశారు. వారం రోజుల పర్యటన అనంతరం సిఎం కెసిఆర్ గురువారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు.
నమస్తే తెలంగాణ సిఎండికి పరామర్శ
నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రిక సిఎండి డి.దామోదర్ రావును సిఎం కెసిఆర్ పరామర్శించారు. ఇటీవల దామోదర్ రావు తండ్రి నారాయణ రావు కన్నుమూశారు. ఆ సమయం లో సిఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని గురువారం హైదరాబాద్‌కు చేరుకున్న తర్వా త దామోదర్ రావు ఇంటికి వెళ్లి దామోదర్ రావును, ఆయన తల్లి ఆండాలమ్మను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా నారాయణరావుతో తనకున్న అనుబంధాన్ని సిఎం కెసిఆర్ గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వెంట ఎంపి సంతోష్ కుమార్,ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్,ఎంఎల్‌సిలు శేరి సుభాష్ రెడ్డి,నవీన్ రావు, టిఆర్‌ఎస్ నాయకులు శ్రవణ్ రెడ్డి ఉన్నారు.