బాన్సువాడ: బీఆర్ఎస్ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని తనపై జరిగిన దాడిగా తెలంగాణ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు అభివర్ణించారు. సోమవారం బాన్సువాడలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగిస్తూ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు.
ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదని, ఎన్నికల్లో ప్రజా తీర్పు ను ఎదుర్కోలేక ప్రతిపక్షాలు భౌతిక దాడులు,హత్యా రాజకీయాలకు తెగబడడం సిగ్గుచేటని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయం లో ఇటువంటి సంఘ విద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు బీఆర్ఎస్ నేతలకు కార్యకర్తలకుఆయన పిలుపునిచ్చారు. బిఆర్ఎస్ నాయకులపై, కార్యకర్తలపై ఎవరు దాడులకు పాల్పడ్డా సహించేది లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఇలాంటి దాడులు చేయడం తమకు చేతకాదా అంటూ ప్రశ్నించిన కెసిఆర్ ఇలాంటి వాటిని సహించేది లేదని హెచ్చరించారు.