సిఎం దత్తత గ్రామం వాసాలమర్రికి దళితబంధు నిధులు రూ.7.60కోట్లు విడుదల
ఉప్పొంగిన ఊరు.. మైమరిచిన దళితవాడ
మిన్నంటిన కెసిఆర్ జిందాబాద్ నినాదాలు
అపర అంబేద్కర్‌గా ప్రశంసలు, ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకాలు
కెసిఆర్ అభినవ అంబేద్కర్ : బాల్కసుమన్
జీవితాంతం రుణపడి ఉంటాం : కొప్పుల ఈశ్వర్
దళితుల ఆత్మబంధువు కెసిఆర్ : ఎర్రోళ్ల
మహిళల పేరు మీదనే దళిత బంధు వారి బ్యాంకు ఖాతాల్లోనే నిధుల జమ
పథకం అమలు పర్యవేక్షణకు జిల్లా, మండల,గ్రామ స్థాయిల్లో కమిటీలు
లబ్ధ్దిదారులకు నచ్చిన స్కీంను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ జిల్లా కమిటీ పర్యవేక్షణలో
దళిత రక్షణ నిధి ఏర్పాటు లబ్ధ్దిదారుల కుటుంబాలకు క్యూఆర్ కోడ్ గుర్తింపు కార్డులు
మా పాలిట దేవుడు కెసిఆర్
మా గ్రామాన్ని దత్తత తీసుకుని మా అందరి బతుకులకు భరోసానిస్తున్న సిఎం కెసిఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. మా ఎస్‌సిల సంక్షేమానికి పాటు
పడుతున్న ఆయన మా పాలిట దేవుడు. మాకు దళితబంధుతోపాటు గ్రామాల్లో పక్కా భవనాలు నిర్మించి ఇస్తామని చెప్పిన సిఎం మా దళితులకు ఆప్తుడు.: – చినూరి కవిత, వాసాలమర్రి
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ దత్తత గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి అంబుచుంబిత సంబురాలతో, ఆనందోత్సాహాలతో ఉప్పొంగి పోయింది. బుధవారం నాడు ఆ గ్రామాన్ని సందర్శించిన సిఎం కెసిఆర్ ప్రకటించిన విధంగానే గురువారం నాడు అక్కడి 76 దళితకుటుంబాల ఖాతాల్లో పదే సి లక్షల దళితబంధు డబ్బు జమ చేయడానికి వీలుగా రూ.7.60 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దాంతో దళితుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సిఎం కెసిఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. ఈ వార్త తెలియగానే రాష్ట్రమంతటా గల దళితవాడల్లో నూతనోత్సాహాలు వెల్లివిరిశాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ అభినవ అంబేడ్కర్‌గా పేర్కొంటూ సంబురాలు జరుపుకున్నారు. కెసిఆర్ జిందాబాద్ నినాదాలు మిన్నుముట్టాయి.
వాస్తవానికి దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ నెల 16న శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు భావించారు. అయితే హుజూరాబాద్ కంటే ముందుగానే తన దత్తత గ్రామం అయిన వాసాలమర్రిలో రెం డు రోజుల క్రితం పర్యటించిన సిఎం కెసిఆర్ గురువారం నుం చే దళిత బంధు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామంలో ఉన్న 76 కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింప చేస్తున్నామని వెల్లడించారు. వెనువెంటనే నిధులను విడుదల చేయాలని సంబంధిత అధికారులకు సిఎం హుకుం జారీ చేశారు. అంతే గురువారం ఉదయం 11 గంటల కల్లా వాసాలమర్రి గ్రామంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున మొత్తంరూ.7.60 కోట్లను విడుదల చేస్తూ అధికారులు జీవోను విడుదల చేశారు.
దీంతో రాష్ట్రంలో దళిత బంధు పథకం యాదాద్రి జిల్లా వాసాలమర్రి గ్రామం నుంచి అమలులోకి వచ్చినట్లు అయింది. ఈ మేరకు విడుదల చేసిన మొత్తాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌కు విడుదల చే యాలని ఎస్‌సి సహకార అభివృద్ధి సంస్థ ఎండిని ఈ సందర్భం గా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దళితబంధు పథకం అమలుకు మార్గదర్శకాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఎస్‌సి సహకార అభివృద్ధి సంస్థ ఎండి, యాదాద్రి జిల్లా కలెక్టర్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్‌సి అభివృద్ధి శాఖ కార్యదర్శి రా హుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, మంత్రులు, శాసనసభ్యులు, దళిత వర్గాల నేతలు రోడ్లపైకి వచ్చి ఘనంగా సంబురాలు చేసుకున్నారు. దళితబంధు ప్రారంభమైన నేపథ్యంలో వారు పరస్పరం స్వీట్లు తినిపించుకున్నారు. ఘనంగా ఆనందోత్సవాలు జరుపుకున్నారు. పెద్దఎత్తున బాణాసంచా కాల్చారు.
గ్రామస్థుల సంబురాలు
’దళిత బంధు’ పథకానికి నిధులు విడుదల కావటం పట్ల వాసాలమర్రి గ్రామస్థులు సంబురాలు చేసుకున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఫథకాన్ని వాసాలమర్రి నుంచే ప్రారంభించటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. బతుకమ్మ ఆటపాటలతో మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. సబ్బండ వర్గాల ఆశాజ్యోతిగా సిఎం కెసిఆర్ మారారని… దళితుల సాధికారత కోసం తీసుకొచ్చిన ’తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని అణగారిన వర్గాల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్న ఏకైక నేత కెసిఆర్ మాత్రమేనని గ్రామస్థులు కొనియాడారు.
అభినవ అంబేద్కర్ : బాల్కసుమన్
రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పధకం అమల్లోకి వచ్చిన శుభ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దళితబంధు పధకం ద్వారా దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న అభినవ అంబేద్కర్ సిఎం కెసిఆర్ అని ఆయన అభివర్ణించారు. దశాబ్దాలుగా వెనుకబడిన దళిత జాతి అభ్యున్నతికి కృషి చేస్తున్న మహోన్నత వ్యక్తి సిఎం కెసిఆర్ అని గురువారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
జీవితాంతం రుణపడి ఉంటాం : కొప్పుల
రాష్ట్రంలో దళిత బంధు పథకం అమలులోకి వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రం చేపట్టని విధంగా సిఎం కెసిఆర్ దళితబంధు కార్యక్రమాన్ని చేపట్టిన మహానుభావుడని వ్యాఖ్యానించారు. ఇందుకు జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామన్నారు. అంబేద్కర్ చూపిన బాటలో నడుస్తూ దళితుల జీవితాలలో వెలుగులు ప్రసరింపజేస్తున్న మహానేత కెసిఆర్ అని మంత్రి కొప్పుల వ్యాఖ్యానించారు. దళితుల భద్రత, సంక్షేమం, సముద్ధరణకు, ఆత్మగౌరవాన్ని మరింత పెంపొందించేందుకు అంకితభావంతో ముందుకు సాగుతున్న కెసిఆర్‌కు తమ జాతి మరోసారి సంపూర్ణ మద్ధతు తెలియజేస్తున్నదన్నారు.
దళితుల ఆత్మబంధువు కెసిఆర్ : ఎర్రోళ్ల
దళిత బంధును అసెంబ్లీలో ప్రకటించి క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్న మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా వాసాల మర్రి గ్రామం నుంచి ఈ పథకాన్ని అమలు చేయడం పట్ల ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన మాటకు కట్టుబడి కెసిఆర్ వాసాలమర్రిలో దళిత బంధును అమలు చేస్తున్నందుకు సిఎం కెసిఆర్‌కు ఈ సందర్భంగా ఆయన హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దళిత బంధును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారని పేర్కొనేందుకు వాసాల మర్రిగ్రామమే ఇందుకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ఆసరా పెన్షన్‌తో కెసిఆర్ ఆపద్బాంధవుడిగా మారాడని, అలాగే రైతు బంధుతో రైతన్నల గుండెల్లో గూడు కట్టుకున్నాడన్నారు. ప్రస్తుతం దళిత బంధు పథకంతో దళితజాతిలో సిఎం కెసిఆర్ వెలుగులు నింపారన్నారు. కల్యాణ లక్ష్మీ పథకంతో పేద ఆడబిడ్డలకు పెద్ద అన్న అయ్యాడు, దళిత బంధుతో దళితుల ఆత్మబంధువు అయ్యాడన్నారు.
దళిత బాంధవుడు : చినూరి మహేష్
దళిత బాంధవుడు సీఎం కేసీఆర్ అని, మా దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం దళిత సాదికారిత పథకాన్ని అమలు చేశారు. ఆనాడు దళితులుగా పుటినందుకు బాదపడిన్నాము, నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బందువు, దళిత సాదికారిత పథకాలు అమలు చేయటంతో దళితులుగా పుట్టినందుకు గర్వపడుతున్నాము, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 24 గంటల లోపే దళిత బందు కింద పది లక్షల రుపాయలు అకౌంట్లో వేయ్యడం చాల సంతోషంగా ఉంది, ఇలాంటి ముఖ్యమంత్రి నీ ఎప్పుడు చూడలేదు నిజంగా మా దళితుల కోసం పుట్టిన దేవుడిలా బావిస్తున్నాము.
సీఎంకు రుణపడి ఉంటాం : దానయ్య
దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి బుధవారం గ్రామంలో పర్యాటించి దళిత బందు ఇస్తామని చెప్పి 24 గంటలు గడువక ముందే నిధులు విడుదల చేయడం సంతోషం. అందుకు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. అన్ని విధాలుగా వెనుకబాటులో ఉన్న దళితుల అభ్యున్నతి కోసం ఆయన చేస్తున్న కృషికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతటి. సాహసోపేతమైన నిర్ణయాన్ని కేసీఆర్ మినహా.. ఏ ముఖ్యమంత్రీ తీసుకోలేదు. మొదటి నుంచి దళితుల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది. సర్కారు కల్పిస్తున్న పథకాలను దళితులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలి. –
దళిత బంధుతో సమగ్రాభివృద్ధి : మహేష్
దళితులను సమున్నతంగా చూడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. అందుకే తెలంగాణ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తామనడం ఆనందంగా ఉంది. అర్హులైన కుటుంబానికి రూ.10 లక్షలు అందజేసి దళితుల అభ్యున్నతికి ఎంతగానో ఉపయోగపడటం ఖాయం. ఇక భవిష్యత్‌లో రాష్ట్రంలో పేద, ధనిక అన్న తారతమ్యాలు లేకుండా పోయాయి. –