Sunday, November 24, 2024

రాష్ట్ర బడ్జెట్‌పై మథనం

- Advertisement -
- Advertisement -

కేంద్రం నుంచి వచ్చేది ఎంత, రాష్ట్రం రాబడి ఎంత, ఏ శాఖకు ఎంత కేటాయించాలి,
కరోనా లోటును పూడ్చుకునే మార్గాలేమిటి వగైరా అంశాలపై అధికారులతో ప్రగతిభవన్ భేటీలో ముఖ్యమంత్రి ఆరా
కేంద్ర బడ్జెట్ నిరాశ కలిగించిందని వివరించిన అధికారులు?
ఈసారి బడ్జెట్ గత ఏడాది పద్దును మించకపోవచ్చని అంచనా
CM KCR review on Annual Budget 2021-22

మన తెలంగాణ/హైదరాబాద్: రానున్న ఆర్ధిక సంవత్సరం (2021-2022) వార్షిక బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దృష్టి సారించారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులెన్ని? సొంతంగా ఖజానాకు సమకూరే రాబడులెన్ని? తదితర అంశాలపై ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా సిఎం కెసిఆర్ గురువారం ప్రగతి భవన్‌లో ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. వార్షిక బడ్జెట్‌లో పొందుపరచాల్సిన అంశాలపై ఆయన సుధీర్ఘంగా చర్చించారు. ఏఏ శాఖలకు ఎంత బడ్జెట్ కేటాయించాలి? ఏ అంశాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి? కరోనా కారణంగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఏర్పడిన లోటును ఏ విధంగా పూడ్చుకోవాలి? దాని ప్రభావం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ఏ మేరకు ఉంటుంది? తదితర అంశాలపై సిఎం కెసిఆర్ చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో కంటే బడ్జెట్ సైజ్‌లో ఏ మేరకు మార్పులు రానున్నాయన్న విషయాలపై సమాలోచనలు సాగించారు. కాగా మార్చి రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశమున్న నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఈ సందర్భంగా అధికారులను సిఎం ఆదేశించినట్లుగా సమాచారం.

పార్లమెంటులో ఈ నెల 1వ తేదీన కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి రానున్న నిధులపై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోందని చెబుతున్నారు. అయితే ఈ సారి కేంద్ర బడ్జెట్‌తో రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు తప్పేట్టు కనిపించడం లేదని ఈ సందర్భంగా అధికారులు కొందరు సిఎం దృష్టికి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా పన్నుల్లో రాష్ట్రాల వాటా 50 శాతానికి పెంచమని కేంద్రాన్ని పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్ర ఆర్థిక శాఖ పరిగణనలోకి తీసుకున్నట్లుగా కనిపించ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కీలక ప్రాజెక్టులకు సంబంధించిన నిధులపై కేంద్ర బడ్జెట్‌లో ఊసే లేకుండా పోయిందని సిఎంకు వివరించారు. ఈ నేపథ్యంలో నిధులపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యా యని పేర్కొన్నారు. ముఖ్యంగా నీటి ప్రాజెక్టుల నిర్వహణకు, మిషన్ భగీరథకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. అలాగే విద్యుత్ ప్రాజెక్టులకు, విద్యా రంగానికి ప్రత్యేకంగా నిధులు రాలేదని సిఎంకు వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి బడ్జెట్ గత సంవత్సరం బడ్జెట్‌ను మించే అవకాశం లేదని, ఇదే విషయాన్ని అధికారులు కూడా సిఎంకు వివరించినట్లుగా సమాచారం.
రాష్ట్రప్రభుత్వం ఈ ఆర్ధిక సంవత్సరంలో ఒక లక్ష 82 వేల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. ఐతే కరోనా ప్రభావంతో కేటాయింపులకు సర్కారు ఇబ్బందిపడింది. ఆదాయంలో భారీ తగ్గుదల నేపథ్యంలో 2020-21 బడ్జెట్ అంచనాల్లో ఆర్థిక శాఖ అధికారులు మార్పులు, సవరణలు చేశారు. వాస్తవానికి అసెంబ్లీ సమావేశాలను ఏప్రిల్ 13లోగా ప్రారంభించుకునేందుకు అవకాశం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ వార్షిక బడ్జెట్‌కు మార్చి 31వ తేదీలోగా అసెంబ్లీ ఆమోదం పొందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ తయారీ కసరత్తును త్వరగా పూర్తి చేసుకుని, మార్చి రెండో వారంలో అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ రాష్ట్ర బడ్జెట్ తయారీ ప్రక్రియ త్వరగా పూర్తయితే మార్చి మొదటి వారంలోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆర్థికశాఖ రామ కృష్ణారావు తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

CM KCR review on state annual budget 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News