Thursday, January 23, 2025

త్వరలో సంస్కృత విశ్వ విద్యాలయం

- Advertisement -
- Advertisement -

మల్లినాథుని జన్మస్థలం మెదక్ జిల్లా కొల్చారంలో ఏర్పాటు
కార్యాచరణ ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రికి ఆదేశం
31న బ్రాహ్మణ పరిషత్ భవనం ప్రారంభం
పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి
ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రార్థనా మందిరాల్లోనే శాంతి నెలకొని వుంటుందని, దేవాలయాలు సర్వ జనులకు సాంత్వన చేకూర్చే కమ్యునిటీ సెంటర్లు అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. పూజారులు, పండితోత్తములు అన్ని వర్గాలకు అందుబాటులో వుంటూ, తమ వాక్కులు దీవెనలతో సర్వజనహితం కోరుకుంటూ శాంతియుత సమాజం కోసం పాటుపడుతున్నారని సిఎం కొనియాడారు. సువిశాల స్థలంలో హైదరాబాద్ నడిబొడ్డున గోపనపల్లిలో నిర్మించిన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్.. సదన్… భావి తరాలకు శాంతిని భక్తిభావనలు పంచే ఆధ్మాత్మిక కేంద్రంగా, అన్ని వర్గాలకు అందుబాటులో వుండే కమ్యునిటీ సెంటర్‌గా కొనసాగుతుందని సిఎం ఆకాంక్షించారు. నగరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన.. బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని, ఈ నెల 31వ తేదీన ప్రారంభించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు.

ఈ సందర్భంగా చేపట్టాల్సిన కార్యాచరణపై డా. బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సిఎం కెసిఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో… ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు సోమేష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ ప్రభుత్వ సాంసృతిక సలహాదారు రమణాచారి, బ్రాహ్మణ పరిషత్ వైస్ చైర్మన్ జ్వాలా నరసింహారావు… సిఎస్ శాంతి కుమారి, ఫైనాన్స్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సిఎం సెక్రటరీలు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి, ఎంఎల్‌సి దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. ఒకనాడు సమైక్య పాలనలో అలజడులు అంశాంతికి నెలవుగా వున్న తెలంగాణ రాష్ట్రంలో నేడు రాష్ట్ర పభుత్వ కృషి, దైవ కృపతో ఎటు చూసిన పచ్చని పంట పొలాలు ప్రశాంతమైన వాతావరణం నెలకొన్నదని అన్నారు.దేశంలో మరెక్కడా నిర్మించని విధంగా దేవాలయాల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, రాష్ట్రవ్యాప్తంగా ఆధ్మాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్న దేవాలయాలు ప్రార్ధనా మందిరాలతో శాంతి నెలకొన్నదని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ప్రజలకెప్పుడు కష్టమొచ్చినా అక్కడ వాలుకుంటూ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ యంత్రాంగం వారి సంక్షేమం కోసం పనిచేస్తున్నారని చెప్పారు.

పేద బ్రాహ్మణ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి
అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం పేదలయిన బ్రాహ్మణ వర్గాల సంక్షేమం కోసం కూడా కృషి చేస్తున్నదని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. పూజారులు పేద బ్రాహ్మణ వర్గాల సంక్షేమానికి పాటు పడుతున్నదన్నారు. ప్రభుత్వం అందించిన సహకారంతో… పూజారి వృత్తినే నమ్ముకున్న పేద బ్రాహ్మణ పిల్లలకు చక్కటి చదువు అందుతున్నదని తెలిపారు. వేదాలు చదువుతూ దైవకార్యంలో మునిగిన తమను కూడా పట్టించుకునే ప్రభుత్వం వున్నదనే భరోసా అర్చకుల్లో పెరిగిందని చెప్పారు.

పేద బ్రాహ్మణ వర్గానికి తెలంగాణ రాష్ట్రం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని మరే రాష్ట్రంలో కూడా అమలుకావడంలేదని సిఎం అన్నారు.ఈ నెల 31 నాడు జరగబోయే పరిషత్ భవన ప్రారంభోత్సవం సందర్భంగా…చండీ యాగం సుదర్శన యగాలను నిర్వహించాలని బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ డా. కె.వి.రమణాచారికి సిఎం సూచించారు. ఈ ప్రారంభోత్సవానికి… అన్ని రాష్ట్రాల నుంచి, ప్రముఖ పుణ్య క్షేత్రాలనుంచి అర్చకులను, ద్వాదశ జ్యోతిర్లింగాలు సహా దేశవ్యాప్తంగా వున్న కంచి కామకోటి తదితర పీఠాధిపతులను, ప్రముఖ హిందూ మత పెద్దలను, అన్ని రాష్ట్రాల బ్రాహ్మణ సంఘాల పెద్దలను, దేశవ్యాప్తంగా వున్న బ్రాహ్మణ ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సిఎం అన్నారు. వారి ప్రయాణానికి, బసకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి కార్యక్రమానికి కావాల్సిన నిధులను విడుదల చేయాల్సిందిగా ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావును సిఎం ఆదేశించారు.

బ్రాహ్మణ పరిషత్ భవన్ గ్రంథాలయం ఏర్పాటు
బ్రాహ్మణ పరిషత్ భవన్ రాష్ట్రంలో..దైవ భక్తిని పెంపొందించే దిశగా ఆధ్మాత్మిక గ్రంధాలు, వేదాలు, ఉప నిషత్తులు, పురాణాలు వంటి సాహిత్యంతో కూడిన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. సత్యనారాయణ వ్రతం వంటి దైవ కార్యాలకు సంబంధించిన, యజ్జ యాగాదులు క్రతువులకు సంబంధించిన అవగాహనను కల్పించే సాహిత్యాన్ని అందుబాటులో వుంచాలని సిఎం తెలిపారు.దైవ భక్తులయిన సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో పుస్తకాలను ప్రచురించాలని డాక్యుమెంటరీలను రూపొందించాలని సిఎం కెసిఆర్ సూచించారు. మొత్తంగా.. బ్రాహ్మణ పరిషత్ భవనం, భక్తి, ఆధ్మాత్మిక భావజాలవ్యాప్తికి సంబంధించిన సమస్త సమాచార కేంద్రంగా, రిసోర్స్ సెంటర్‌గా కొనసాగాలని సిఎం అన్నారు.పరిషత్ భవనం ప్రారంభం నాటికి మొత్తం ఎంతమందిని ఆహ్వానించాలి ఇంకా అందుకు సంబంధించిన ఏర్పాట్ల గురించి మరోసారి సమావేశమై కార్యాచరణ ప్రారంభించాలని సిఎం కెసిఆర్ రమణాచారిని ఆదేశించారు.

తెలుగు సాంస్కృత భాషా విశ్వవిద్యాలయం ఏర్పాటు
సమైక్య పాలనలో విస్మరించబడిన తెలంగాణ ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని పునరుజ్జీవింపచేసుకోవాలని సిఎం తెలిపారు. కాలగర్భంలో విస్మరించబడిన మల్లినాథసూరి వంటి నాటి ప్రముఖ భాషా కవి పండిత మహనీయుల ఘన చరిత్రలను వెలికితీయాలని సిఎం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో… మల్లినాధుని జన్మస్థలం, మెదక్ జిల్లా కొల్చారంలో..తెలుగు సంస్కృత భాషా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన చర్యల కోసం కార్యాచరణ ప్రారంభించాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డికి సిఎం కెసిఆర్ సమావేశం నుంచి ఫోన్ ద్వారా ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News