Monday, December 23, 2024

తడిసిన ధాన్యానికీ అదే ధర

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంట తడిసిపోతున్న నేపథ్యంలో రైతన్న లు ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని గింజలేకుండా సేకరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రైతు కుటుంబాలకు భరోసానిచ్చారు. మామూలు గా వరిధాన్యానికి చెల్లించిన ధరనే తడిసిన ధాన్యానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని సిఎం స్పష్టం చే శారు. వ్యవసాయాన్ని కాపాడుతూ రైతుల కష్టాల్లో భాగస్వామ్యం పంచుకోవడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సిఎం కెసిఆర్ పునరుద్ఘాటించారు. గతానికి భిన్నంగా అకాల వానలు ఎడతెరిపి లేకుండా కురుస్తు న్న నేపథ్యంలో భవిష్యత్‌లో యాసంగి వరి కోతలు మార్చిలోపే జరిగే విధంగా ఎటువంటి విధానాలను అవలంభించాలో అధ్యయనం చేయాలని, ఈ దిశగా రాష్ట్ర రైతాంగాన్ని చైతన్యం చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని సిఎం కెసిఆర్ వ్యవసాయ శాఖను ఆదేశించారు.

కాగా, అకాల వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో వరికోతలను మరో మూడు నాలుగు రోజులు వాయిదా వేసుకోవడం మంచిదని రైతులకు సిఎం కెసిఆర్ సూచించారు. మంగళవారం డా. బిఆర్ అం బేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న తీరు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో తడిసిన వరిధాన్యం సేకరణ, భవిష్యత్‌లో యాసంగి వరి ముందస్తుగా కోతలకు వచ్చేలా చర్యలు, దీనికి వ్యవసాయశాఖ అనుసరించాల్సిన కార్యాచరణ తదితర అంశాలపై సిఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, బాజిరెడ్డి గోవర్ధన్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ శాంతి కుమారి, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు,సిఎం సెక్రటరీలు స్మితా సబర్వాల్, రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, సివిల్ సప్లైస్ కమిషనర్ వి. అనిల్ కుమార్‌లు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్యాచరణ దేశానికే ఆదర్శంగా
ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ తెలంగాణ వ్యవసాయ అభివృద్ధికి, రైతు కుటుంబాల సంక్షేమానికి, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్యాచరణ దేశానికే ఆదర్శంగా సత్ఫలితాలను అందిస్తుందన్నారు. నేడు ఎన్నో రాష్ట్రాలను అధిగమిస్తూ తెలంగాణ రైతులు వరి ధాన్యాన్ని పండిస్తున్నారని, అదే సందర్భంలో ఎంత పండిస్తే అంత పంటను గింజలేకుంటా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కష్టాలు వచ్చినా రైతుల కల్లాలకాడికే పోయి సేకరిస్తుందని కెసిఆర్ పేర్కొన్నారు. ఇలా రైతుల కోసం చిత్తశుద్ధితో దృఢసంకల్పంతో కార్యాచరణ అమలు చేస్తున్న ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఊహించని విధంగా అకాలంగా కురుస్తున్న వడగండ్ల వానలు ఎడతెరిపిలేకుండా కొనసాగుతుండడం బాధాకరమన్నారు. ప్రకృతి వైపరీత్యానికి ఎవరం ఏమీ చేయలేమని, అయినా మనకేం సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించలేదన్నారు.

వడగండ్ల వానలకు దెబ్బతిన్న పంటలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 10 వేల రూపాయలను అందిస్తూ ఇప్పటికే ఆదుకుంటుందన్నారు. ఆర్థికంగా రాష్ట్ర ఖజానాకు ఎంత భారమైనా వెనుకంజ వేయకుండా రైతన్నలను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ నేపథ్యంలో యాసంగి వరి ధాన్యం తడుస్తున్న నేపథ్యంలో రైతన్నల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకుంటుందన్నారు. ఆపత్కాలంలో వారి దు:ఖాన్ని, కష్టాన్ని పంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సిద్ధమయ్యిందన్నారు. ఈ నేపథ్యంలో తడిసిన వరి ధాన్యాన్ని కూడా సేకరించాలని నిర్ణయించిందన్నారు. వీలైనంత త్వరగా ఒక్క గింజకూడా పోకుండా వరిధాన్య సేకరణ పూర్తి చేస్తామని, రైతన్నలు ఏమాత్రం ఆందోళన చెందవద్దని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.

మూడు, నాలుగురోజుల పాటు పంటను కోయకుండా…..
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొనసాగుతున్న యాసంగి వరిధాన్యం సేకరణ వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ధాన్యం సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని, కొన్ని చోట్ల అకాలవానలు కొనసాగుతుండడంతో సేకరణకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని అధికారులు వివరించారు. అయినా త్వరలోనే ధాన్య సేకరణ పూర్తి చేయనున్నట్టు సివిల్ సప్లైస్ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ సిఎం కెసిఆర్‌తో పేర్కొన్నారు. కాగా, మరో మూడు నాలుగు రోజుల పాటు వానలు ఉన్నందున అప్పటిదాకా వరిపంటను కోయకుండా సంయమనం పాటించాలని, తద్వారా ధాన్యం తడవకుండా జాగ్రత్త పడాలని రైతులకు సిఎం సూచించారు. కురుస్తున్న ఈ అకాల వానలను గుణపాఠంగా తీసుకుని భవిష్యత్‌లో నష్టాలు జరగకుండా ముందస్తు అవగాహనను ఏర్పరుచుకోవాలని అటు వ్యవసాయ శాఖకు, ఇటు రైతాంగానికి సిఎం సూచించారు.

అందులో భాగంగా ప్రతి ఏటా మార్చినెలాఖరుకల్లా యాసంగి వరికోతలు పూర్తయ్యేలా రాష్ట్ర రైతాంగం వరిని ముందస్తుగానే నాటుకోవాలని సిఎం పిలుపునిచ్చారు. మార్చి నెల తర్వాత అకాల వానలు పడే అవకాశాలున్నందున ఆ లోపే కోతలు పూర్తి చేసుకోవడం మంచిదని కెసిఆర్ పేర్కొన్నారు. ఏప్రిల్, మే నెలలు వచ్చేదాకా వరిపంట నూర్పకుంటే ఎండలు ఎక్కువయ్యి ధాన్యంలో నూకశాతం పెరిగిపోతుందన్నారు. అటు అకాల వానల నుంచి తప్పించుకోవటం ఇటు నూకలు కాకుండా ఉండాలంటే మార్చి నెలాఖరుకల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ కోతకొచ్చేలా ముందస్తుగానే నాట్లు వేస్తుకోవాలని రైతాంగానికి సిఎం సూచించారు. ఈ దిశగా మరింత శాస్త్రీయ అధ్యయనం చేసి రాష్ట్ర రైతాంగాన్ని చైతన్యపరచాలని వ్యవసాయ శాఖను సిఎం కెసిఆర్ ఆదేశించారు. అదే సందర్భంలో ఫెర్టిలైజర్స్ వాడే విషయంలో రైతులకు అవగాహన కల్పించాలని కెసిఆర్ సూచించారు.

మార్పులపై రైతులకు అవగాహన

ప్రకృతి వైపరీత్యాలు తదితర సందర్భాల్లో మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో తలెత్తే మార్పులను ఎప్పటికప్పుడు రైతాంగానికి అర్థమయ్యే రీతిలో కరపత్రాలు, పోస్టర్లు, అడ్వర్టయిజ్ మెంట్లు తదితర ప్రచార మార్గాల ద్వారా అవగాహన, చైతన్యాన్ని కల్పించాలన్నారు. వ్యవసాయ శాఖలోని కిందిస్థాయి ఏఈఓలను, అధికారులను ఎప్పటికప్పుడు ఈ దిశగా అప్రమత్తం చేయాలని, వారు నిరంతరం రైతులకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు తగిన సూచనలందించాలని, ఆ దిశగా నిరంతరం పర్యవేక్షణ చేస్తుండాలని, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావును సిఎం ఆదేశించారు. రాష్ట్రంలో నిర్మించిన రైతు వేదికలను వేదికగా చేసుకొని వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని అలసత్వం వహిస్తే కఠిన చర్యలుంటాయని కెసిఆర్ హెచ్చరించారు. ఈ దిశగా పనితీరును పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సిఎం ఆదేశించారు.

రాష్ట్రంలో వ్యవసాయం వేగంగా పురోగతి సాధిస్తుంది

రాష్ట్రంలో వ్యవసాయం అత్యంత వేగంగా పురోగతిని సాధిస్తుందని, ఈ వేగాన్ని అందుకునే దిశగా వ్యవసాయ శాఖ నిత్యం అప్రమత్తంగా ఉండాలని కెసిఆర్ సూచించారు. ఏ మాత్రం అలసత్వం వహించినా కఠిన చర్యలుంటాయన్నారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ విధానాలను, లక్ష్యాలను క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ మరింత డైనమిక్‌గా పనిచేయాల్సిన అవసరం వ్యవసాయశాఖకు ఉందని సిఎం స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News