Monday, January 20, 2025

సమష్టి కృషితోనే అభివృద్ధి ఫలాలు

- Advertisement -
- Advertisement -

ఆర్థిక వనరులు, సంపద పెరగడంతో ప్రజల అవసరాలు పెరుగుతున్నాయి

ప్రజలకు అందాల్సిన సౌకర్యాలకై మనమంతా కలసి పనిచేయాలి

తెలంగాణలో అన్ని వర్గాలు ఆర్థికంగా బలపడుతున్నాయి
రాష్ట్ర అభివృద్ధితోనే ఇవన్నీ సాధ్యమయ్యాయి

ప్రభుత్వం నుంచి నాణ్యమైన సేవలను ప్రజలు ఆశిస్తున్నారు

ఆ బాధ్యత ప్రభుత్వ ఉద్యోగుల మీదే ఉంది

దాదాపు 30లక్షల మంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారు

స్వరాష్ట్రంలో రాబడులు పెరిగి ఆర్థిక వనరులు పెరిగాయి
అన్ని రంగాలు వాటంతటవే పనిచేసే స్థితికి చేరుకున్నాం

నిజామాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దాలి

ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ యంత్రాంగం సమష్టి తత్వంతో… సమన్వయంతో పనిచేయడం ద్వారా సాధించే ఫలితాలు సామాజికాభివృద్ధిని వేగవంతం చేస్తాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. తద్వారా మాత్రమే సమాజంలోని వ్యక్తులుగా సాధించిన ఫలితాల్లో భాగస్వామ్యం అందుకోగలమన్నారు. తెలంగాణ ఉద్యమం ఫలితంగా అమలులోకి వచ్చిన స్వయం పాలనలోని ప్రగతి సమష్ట్టి కృషికి నిదర్శనమని సిఎం తెలిపారు. స్వరాష్ట్రంలో ఒక్కొక్క రంగాన్ని తీర్చిదిద్దుకుంటూ ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ఫలితాలు రాబట్టడంలో ప్రభుత్వ ఉద్యోగుల సమష్టి కృషి ఇమిడి ఉందన్నారు. సాధించిన సంతృప్తిని చెంది ఆగిపోకుండా ఇంకా గొప్పగా ఆలోచించాలని సిఎం సూచించారు. ఏ రోజుకారోజు సృజనాత్మకంగా ఆలోచించిన నాడే గుణాత్మక ప్రగతిని మరింతగా ప్రజలకు చేరవేయగలుగుతామని ప్రభుత్వాధికారులకు సిఎం పునరుద్ఘాటించారు.

మున్సిపల్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనుల సమీక్ష, దానితో పాటు నిజామాబాద్ నగరంలో మౌలిక వసతులను మరింత మెరుగుపరచడం, ప్రజలకు సౌకర్యవంతంగా అన్ని రంగాలను అభివృద్ధి పరిచి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం అనే అంశాలపై సిఎం కెసిఆర్ ప్రగతి భవన్‌లో ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, రోటీన్‌గా అందరూ పనిచేస్తారు కానీ.. మరింత గొప్పగా ఎట్లా పనిచేయాలనేదే అతి ముఖ్యమన్నారు. నిన్నటి కన్నా రేపు ఎంత మెరుగ్గా పని చేయగలమని ప్రతిరోజు ఆలోచించాలన్నారు. ఒక పనిని ఎంత శాస్త్రీయంగా జీ వించి, రసించి, ఆలోచించి చేస్తున్నామనే అం శంపై ఫలితాలు ఆధారపడి ఉంటాయన్నారు. అప్పుడే ఉన్నతంగా ఎదుగగలమని సిఎం వ్యాఖ్యానించారు. మూస ధోరణులను సాంప్రదాయ పద్ధతులలో కాకుండా వినూత్న పద్ధతుల్లో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు మార్గాలు అన్వేషించాలన్నారు. అందుకు ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని సిఎం అధికారులకు వివరించారు.

కాగా రాష్ట్రంలో మున్సిపల్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను ఆ శాఖ మంత్రి కెటిఆర్ సిఎం దృష్టికి తీసుకొచ్చారు. దేశంలోనే ఆదర్శవంతమైన పట్టణాలను తీర్చిదిద్దడంలో మున్సిపల్ శాఖ కృషిని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియగా కొనసాగాల్సిన అవసరమున్నదని సిఎం కెసిఆర్ అన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న ఆర్థిక వనరులు, సంపదకు అనుగుణంగా ప్రజావసరాలు పెరుగుతున్నాయన్నారు. అందుకు అనుగుణంగా ప్రజలకు అందాల్సిన నాణ్యమైన సౌకర్యాల కోసం అందరం కలిసి పని చేయాలన్నారు. ఉమ్మడి పాలనలో కనీస వసతులు లేని సందర్భాల్లోంచి ప్రస్తుతం అన్ని రంగాల్లో గుణాత్మకాభివృద్ధిని తెలంగాణ సాధించిందన్నారు. వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, రోడ్లు, విద్య, వైద్యం తదితర మౌలిక రంగాల్లో నాణ్యమైన వసతులు ప్రజల అనుభవంలోకి వచ్చాయన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గుణాత్మకంగా ప్రగతిని సాధించింది. తదనుగుణంగా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిందని సిఎం పేర్కొన్నారు.

అన్ని వర్గాలు ఆర్ధికంగా బలపడతున్నాయి
తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలు నేడు ఆర్థికంగా బలపడుతున్నాయని కెసిఆర్ అన్నారు. రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధి ద్వారానే..ఇవన్నీ సాధ్యమైతున్నాయన్నారు. తద్వారా ప్రభుత్వాల నుంచి మరింత నాణ్యమైన సేవలను ప్రజలు ఆశిస్తున్నారన్నారు. వారికి మరింత నాణ్యమైన ఉత్తమమైన సేవలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాధికారుల మీదనే ఉందని సిఎం కెసిఆర్ అన్నారు. పౌర సౌకర్యాల పెంపుకోసం రోజు రోజుకూ డిమాండు పెరుగుతుందంటే, మన ప్రభుత్వం మీద ప్రజలకు పెరిగిన విశ్వాసమే అందుకు కారణమని సిఎం అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిరంతర శ్రమతో నిలబెట్టుకోవాలిన అవసరమున్నదని ఉద్యోగులతో సిఎం అన్నారు.

గడపగడపకు పాలనను తీసుకపోతున్నాం
ఒకనాడు ప్రజాదరణకు నోచుకోని ప్రభుత్వ దవాఖానలు తదితర ప్రభుత్వ వ్యవస్థలు నేడు అత్యంత ప్రజాదరణతో రద్దీగా ఉంటున్నాయని కెసిఆర్ అన్నారు. రాష్ట్రం నుంచి బయటకు పోయిన వలసలు ప్రస్తుతం రివర్స్ అయ్యాయన్నారు. దాదాపు 30 లక్షల మంది పక్క రాష్ట్రాలనుంచి తెలంగాణకు వలసవచ్చి బతుకుతున్న పరిస్థితి ఉన్నదన్నారు. స్వరాష్ట్రంలో రాబడులు పెరిగి ఆర్థిక వనరులు పెరిగాయన్నారు. ఈ నేపథ్యంలో పరిపాలనా సంస్కరణలతో గడప గడపకూ పాలనను తీసుకపోతున్నామన్నారు.

పని పరిమాణం పెరిగింది
ప్రభుత్వం కృషితో అభివృద్ధిని సాధిస్తున్న తెలంగాణలో అన్ని శాఖలల్లో పని పరిమాణం పెరిగిందని కెసిఆర్ అన్నారు. పెరిగిన అభివృద్ధిని ప్రజా ఆకాంక్షలను అందిపుచ్చుకుంటూ ప్రభుత్వ యంత్రాంగం తమ కర్తవ్య నిర్వహణను తీర్చిదిద్దుకోవాలన్నారు. పెరిగిన అభివృద్ధికి సమాన స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాల్సి ఉంటదని సిఎం స్పష్టం చేశారు. ప్రజల ప్రాథమిక అవసరాలను నిత్యావసరాలను ఎంత గొప్పగా తీర్చగలమనేదే ప్రభుత్వోద్యోగికి ప్రధాన కర్తవ్యం కావాలని ఆయన ఉద్ఘాటించారు.

శిథిలమైన రంగాలను తీర్చిదిద్దాం
తెలంగాణ రాష్ట్ర సాధన నాటికి ఉమ్మడి పాలనలో శిథిలమై ఉన్న అన్ని రంగాలను సమగ్రంగా తీర్చిదిద్దామని కెసిఆర్ తెలిపారు. ప్రస్తుతం వాటిని ఒక ట్రాక్ మీదకు తీసుకురాగలిగామన్నారు. రాష్ట్రం ప్రారంభ దశలో ఉన్న ఆందోళన ఇప్పడు అక్కరలేదన్నారు. అన్ని రంగాలు వాటంతంట అవి పనిచేసుకుంటూ పోయే స్థితికి తెచ్చుకున్నామన్నారు.

రాష్ట్రంలో నిత్యం వానలే
గతంలో వానాకాలం రెండు మూడు నెలలు మాత్రమే ఉంటుండేదని కెసిఆర్ అన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయిందన్నారు. నిత్యం వానలతో నిర్మాణాత్మక పనుల నిడివి కూడా తగ్గిందన్నారు. వర్షాలు లేని ఆరేడు నెల్ల కాలంలోనే మనం అభివృద్ధి పనులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ పరిస్థితిని ప్రభుత్వ యంత్రాంగం అర్థం చేసుకోవాల్సి ఉందని తెలిపారు.

ఖమ్మం సర్వంగా సుందరంగా మారింది
ఒకనాడు గందరగోళంగా ఉన్న ఖమ్మం నగరం ప్రభుత్వ కృషితో నేడు సుందరనగరం గా మారిందని కెసిఆర్ అన్నారు. ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దినట్టు నిజామాబాద్ ను కూడా తీర్చిదిద్దాలన్నారు. ఈ నేపథ్యంలో మీరంతా కలిసి ఖమ్మం టూరు వెల్లండి…. అక్కడ జరిగిన అభివృద్ధిని పరిశీలించి రండి అని నిజామాబాద్ అధికారులను, శాసనసభ్యులను సిఎం ఆదేశించారు

నిజామాబాద్‌ను అద్భుతంగా తీర్చిదిద్దాలే
నిజామాబాద్ పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలే అని – సిఎం కెసిఆర్ అన్నారు. ప్రగతి పథంలో దూసుకుపోతున్న నిజామాబాద్ నగరంలో అభివృద్ధి మరింత ద్విగుణీకృతమై కండ్లకు కట్టాలె అని స్పష్టం చేశారు. రెండున్నర నెల్లల్లో ప్రణాళికాబద్దంగా పనులను పూర్తిచేయాలన్నారు. తాను స్వయంగా జిల్లాలో పర్యటించి పనులను పరిశీలిస్తానని తెలిపారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, మున్సిపల్ శాఖ, తదితర అన్ని శాఖలు సమన్వయంతో నిజామాబాద్ అభివృద్ధి పనులను పూర్తి చేసేలా పనుల్లో నిమగ్నం కావాలని స్థానిక ఎంఎల్‌ఎ గణేశ్ బిగాలను సిఎం ఆదేశించారు. నిజామాబాద్ అభివృద్ధికి నిధుల కొరత లేదని సిఎం స్పష్టం చేశారు.

ఇప్పటికే విడుదలైన నిధులతో పాటు నిజామాబాద్ నగరాభివృద్ధికి అవసరమైన మరిన్ని నిధులను విడుదల చేయాలని ఫైనాన్స్ సెక్రటరీకి సమావేశం నుండే సిఎం ఫోన్ చేసి ఆదేశించారు. నిజామాబాద్ నగరంలో రోడ్ల నిడివి ఎంత ఉన్నదో అంచనా వేయాలన్నారు. గ్రావెల్ రోడ్లను బిటి రోడ్లుగా మార్చాలని చెప్పారు. స్మశాన వాటికలు, బరీయల్ గ్రౌండ్లు ఎన్ని కావాల్సి ఉన్నది? సమీకృత మార్కెట్లు ఎన్ని కావాల్సి ఉన్నాయి? కమ్యునిటీ హాల్లు ఎన్ని కావాలి? డంప్ యార్డులు..వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు, అన్నీ అత్యంత వేగంగా పనులు పూర్తి చేయాలన్నారు.

నిజామాబాద్‌లో మొత్తం దోభీ గాట్లు, సెలూన్లను అంచనావేసి మోడ్రన్ దోభీఘాట్లను మోడ్రన్ సెలూన్లను నిర్మించాలన్నారు. నిజామాబాద్ నగరంలో గార్డెన్ల పరిస్థితిని సిఎం అడిగి తెలసుకున్నారు. పబ్లిక్ గార్డెన్లను తక్షణమే మెరుగు పరచాలన్నారు. తాను చిన్ననాడు నాటి తిలక్ గార్డెన్‌కు వెళ్లి కూర్చేనే వాడినని సిఎం గుర్తుచేసుకున్నారు. తిలక్ గార్డెన్‌ను పునరుద్ధరించాలన్నారు. మొక్కలను నాటడం పచ్చదనం పెంచే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. నిజామాబాద్ రైల్వేస్టేషన్‌ను సుందరీకిరించాలని సిఎం ఆధికారులను ఆదేశించారు. నిజామాబాద్ నగరంలో మొత్తం ఉన్న ప్రభుత్వ భూములెన్ని వాటిల్లో ప్రజావసరాలకోసం వినియోగించుకోవాడనికి ఎన్ని అనువుగా ఉన్నాయో ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. సమీకృత కలెక్టరేట్ నిర్మాణం తర్వాత పలు శాఖలు వారి కార్యాలయాలను ఖాళీ చేస్తాయన్నారు.

ఆయా శాఖల భవనాల పరిస్థితి ఏంది? వాటి స్థలాలను, కార్యాలయ భవనాలను ప్రజావసరాలకు ఏ విధంగా వినియోగించుకోవచ్చునో ప్రణాళికలు కూడా సిద్ధం చేయాలని సిఎం ఆదేశించారు. నిజామాబాద్ పట్టణాభివృద్ధి కోసం అనుసరించాల్సిన పద్దతులను ఈ సందర్భంగా సిఎం అధికారులకు వివరించారు. పౌరులకు కల్పించాల్సిన సౌకర్యాలను రూపొందించుకుని వాటికోసం చేపట్టాల్సిన నిర్మాణాత్మక పనుల ప్రణాళికలను సిద్దం చేసుకోవాలన్నారు. దాంతో పాటు నగరాన్ని సుందరీకరించే అంశాలేమిటో పరిశీలించి అందుకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అలంకారాలేమిటి అనే ప్రణాళికలను సిద్దం చేసుకోవాల్సి ఉన్నదని సిఎం తెలిపారు.

రెండు నెలల్లో నేను అక్కడకు వస్తా…
రెండు నెల్లల్లో నిజామాబాద్‌కు నేనే వస్తానని కెసిఆర్ అన్నారు. అక్కడ మీరు చేసిన పనులను పరిశీలిస్తానని స్పష్టం చేశారు. అందమైన నిజామాబాద్‌ను తీర్చిదిద్దాలన్నారు. నిజామాబాద్ నగరంలో ఆడిటోరియం నిర్మాణానికి సంబంధించిన వివరాలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా సిఎం కు వివరించారు. నిజామాబాద్ నగరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్సీ కవిత సిఎం ను అభ్యర్థించారు. నగరంలో బస్టాండ్ నిర్మాణానికి విశాలమైన స్థలం, పిల్లలు ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణ నిర్మాణానికి సంబంధించి ఎమ్మెల్సీ కవిత సిఎం కు వివరించారు. హజ్ భవన్ నిర్మాణం చేపట్టాలని సిఎం ను కోరారు.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కెటిఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, వెంకట్రామిరెడ్డి, కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేశ్ తో పాటు, జీవన్ రెడ్డి, రోహిత్ రెడ్డి, మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ , డైరక్టర్ సత్యనారాయణ, నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ చిత్రతో పాటు నిజామాబాద్ జిల్లా పంచాయతీ రాజ్, రోడ్లు భవనాలు, ఇరిగేషన్, రెవెన్యూ, పబ్లిక్ హెల్త్ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

CM KCR Review on development works in Nizamabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News