Wednesday, January 22, 2025

‘హస్తిన’లో అడుగుపెట్టండి

- Advertisement -
- Advertisement -

CM KCR review on Dharani portal issues

జాతీయ రాజకీయాల్లో శూన్యత, క్రియాశీల పాత్ర పోషించండి

మొన్నటి కేబినెట్ సమావేశంలో సిఎం కెసిఆర్‌ను కోరిన మంత్రులు
బిజెపివి ఉత్త మాటలు, ఏదో ఉద్ధరించినట్టు ప్రగల్భాలు
కాషాయ పార్టీ కుయుక్తులను తిప్పికొట్టండి : మంత్రులకు ముఖ్యమంత్రి సూచన
ధరణి పోర్టల్‌పై విస్తృత చర్చ
ఏడాది గడిచినా సమస్యలు పరిష్కారం కాకపోవడంపట్ల అధికారులపై అసహనం సబ్ కమిటీ సిఫారసుల అమలుకు ఆదేశం

మనతెలంగాణ/హైదరాబాద్ : జాతీయస్థాయిలో రాజకీయ శూన్యత ఉందని సోమవారం నాటి సమావేశంలో మంత్రివర్గం అభిప్రాయపడింది. అవసరమైతే దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని కోరింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణాకు ఒరగబెట్టింది శూన్యం అని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులతో వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఐనా రాష్ట్ర బీజేపీ నాయకత్వం మాత్రం కేంద్రం ఏదో ఉద్ధరించినట్లు ప్రగల్భాలు, ఉత్తమాటలు చెప్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం ఆక్షేపించినట్లు వినికిడి. బీజీపీ కుయుక్తులను తిప్పి కొట్టేందుకు దీటుగా స్పందించాలని ఆయన పిలుపునిచ్చినట్లు సమాచారం. ఇక కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులకు మంత్రివర్గ సమావేశం సందర్భంగా ఓ అరుదైన అవకాశం దక్కింది. వాళ్ళు మంత్రివర్గం ముందు అతిథులుగా హాజరయి ధరణి సమస్యల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలియజేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

ధరణి పోర్టల్ పై సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం విస్తృతంగా చర్చించింది. సుమారు 4 గంటలకు పైగా జరిగిన చర్చలో పోర్టల్ నిర్వహణలో తలెత్తుతున్న వివిధ సమస్యలపై దృష్టిసారించింది. సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికపై క్యాబినెట్ సమాలోచనలు జరిపింది. సబ్ కమిటీ సిఫారసులను పరిగణలోకి తీసుకోవాలని, సమస్యల పరిష్కారం కోసం మాడ్యూల్స్ ను పోర్టల్లో ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ధరణి అందుబాటులోకి వచ్చి ఏడాది పూర్తైనా, ఇబ్బందులు ఇంకా తలెత్తడం ఏంటని సీఎం అధికారులను ప్రశ్నించినట్లు వినికిడి. కలెక్టర్లకు తగిన అధికారాలిచ్చి ఇబ్బందులు అప్పటికప్పుడు తొలిగేలా చూడాలని ఆయన ఆదేశించారు.

క్యాబినెట్ భేటీ సందర్బంగా ఒక అరుదైన పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి అనుమతితో మంత్రివర్గ సమావేశానికి కొంతమంది అనుకోని అతిథులు కూడా హాజరయ్యారు. సుదీర్ఘంగా జరిగిన క్యాబినెట్ భేటీ మధ్యలో కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు కూడా హాజరైనట్లు తెలిసింది. ధరణి పోర్టల్ సమస్యలు, ఇతర రాజకీయ అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళ అభిప్రాయాలను తీసుకున్నట్లు సమాచారం. కాగా, ధరణి పోరల్ వల్ల తలెత్తుతున్న సమస్యలు, ఇబ్బందులను మంత్రులు సీఎం కేసీఆర్ ముందు ఏకరువు పెట్టినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. వివరాలు సక్రమంగా ఉన్నవాళ్ళ భూలావాదేవీలు త్వరగా, సుళువుగా జరుగుతున్నా, చిన్నచిన్న పొరపాట్లు, డేటా నమోదు లోపాల కారణంగా మిగిలిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని అమాత్యులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది.

కొందరు భూయజమానులు నెలల తరబడి ఇబ్బందులు పడుతున్నట్లు వాళ్ళు సీఎంకు తెలిపినట్లు సమాచారం. కొన్ని ఉదాహరణలను సైతం పేర్కొంటూ క్షేత్రస్థాయిలో తెలెత్తుతున్న ఇబ్బందులు పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డట్లు సమాచారం. ఐతే అటువంటివి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయని అధికారులు క్యాబినెట్ కు సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ధరణి పోర్టల్ సమస్యలు శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా వస్తున్నాయని మంత్రులు సీఎంకు తెలిపినట్లు సమాచారం.

అకాలవర్షాల వల్ల జరిగిన పంటనష్టంపై చర్చించేందుకు ప్రగతిభవన్ కు వచ్చిన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాబినెట్ హాల్లోకి పిలిచినట్లు తెలిసింది. దీంతో ఎమ్మెల్యేలు పెద్దిసుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి, ఆరూరి రమేష్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, జెడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతిలకు మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యే అరుదైన అవకాశం లభించినట్లైంది. ఇది చాలా అరుదైన విషయం అని ప్రభుత్వవర్గాల భోగట్టా. ఈ సందర్భంగా ధరణి పోర్టల్ పై కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నట్లు వినికిడి. ధరణిలో ఉన్న సాదకబాధకాలను వాళ్ళు సీఎం కేసీఆర్ కు వివరించినట్లు తెలిసింది.

రాజకీయ అంశాలపై చర్చ జరిగిన సమయంలో ఎంపీలు కే. కేశవరావు, నామా నాగేశ్వరరావు, సురేష్ రెడ్డి, బీబీ పాటిల్, రంజిత్ రెడ్డిలను కూడా మంత్రివర్గ సమావేశం జరుగుతున్న హాల్లోకి పిలిచారని సమాచారం. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై విస్తృత చర్చ జరిగినట్లు తెలిసింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమీ చేయకపోగా ఆ పార్టీ రాష్ట్ర నేతలు మాత్రం ఏదో ఉద్ధరించినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆక్షేపించినట్లు సమాచారం. ఆ ప్రగల్భాలను, ఉత్త ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి దీటుగా స్పందించాలని ఆయన మంత్రులు, ఇతర నాయకులకు పిలుపునిచ్చినట్లు వినికిడి. జాతీయ స్థాయిలో రాజకీయ శూన్యత ఉందని, దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కొంతమంది మంత్రులు, నాయకులు ఈ సందర్భంగా కోరినట్లు సమాచారం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News