ఏడాది గడిచినా సమస్యలు ఎందుకు కొలిక్కిరాలేదని అధికారులను ప్రశ్నించిన ముఖ్యమంత్రి
లోపాలను ఇంకా ఎప్పుడు సవరిస్తారని సిఎం కెసిఆర్ ఆగ్రహం
ముఖ్యమంత్రికి నివేదిక అందించిన మంత్రివర్గ ఉపసంఘం
కొత్తగా 9 నుంచి 10 మాడ్యూల్స్ ప్రవేశపెట్టాలని సబ్ కమిటీ సిఫారసు
అవగాహన కోసం ధరణి, మీసేవ ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వాలన్న కమిటీ
ధరణిపై కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రజేంటేషన్లు ఇవ్వాలన్న ఉపసంఘం
కలెక్టరేట్లలో ధరణి హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేయాలన్న సబ్ కమిటీ
హైదరాబాద్: ధరణి సమస్యలపై తుది కసరత్తు జరుగుతోంది. పరిష్కారాల అధ్యయనం కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ముఖ్యమంత్రికి చేరింది. సిఎం ఆమోదంతో సబ్ కమిటీ సిఫారసు చేసిన కొత్త మోడ్యూల్స్ ధరణిలో అందుబాటులోకి రానున్నాయి. దీంతో 90% సమస్యలు కొలిక్కి వస్తాయని ప్రభుత్వం అంచనా. ప్రతిష్టాత్మక ధరణి పోర్టల్ పై సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పరిష్కార మార్గాలపై మంత్రులు అధికారులతో విస్తృతంగా చర్చించారు.
ధరణి పోర్టల్ రోజువారి కార్యకలపాల్లో తలెత్తుతున్న ఇబ్బందులపై ప్రభుత్వం కొద్దిరోజులుగా కసరత్తు చేస్తోంది. పేర్లలో తప్పులు దొర్లడం, విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు నమోదు కావడం, సర్వే నంబర్లలో పార్టుల సంబంధిత వివరాల్లో తేడాలు ప్రధాన సమస్యలుగా మారిన విషయం తెలిసిందే. దీంతో ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారం కోసం ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో అప్పట్లోనే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. దఫదఫాలుగా సమావేశమైన కమిటీ పోర్టల్లో ఉన్న లోపాలపై అధ్యయనం చేసింది. అధికారులతో కలిసి పరిష్కారాలపై కసరత్తు చేసి ఒక నివేదికను తయారుచేసింది. పోర్టల్లో దాదాపు 9 నుంచి 10 కొత్త మాడ్యూల్స్ ప్రవేశపెట్టాలని సూచించింది. అవి అందుబాటులోకి వస్తే 90% సమస్యలు పరిష్కారమవుతాయని నివేదికలో పేర్కొంది. కొత్త మాడ్యూల్స్ పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కూడా సబ్ కమిటీ సూచనలు చేసింది. జనంలో సరైన అవగాహన లేకపోవడం కూడా సమస్యలు తలెత్తుతున్నాయని ఉపసంఘం అభిప్రాయపడింది. ధరణి, మీసేవ ఆపరేటర్లకు జిల్లాస్థాయిలో శిక్షణ ఇవ్వాలని, జిల్లాపరిషత్, మున్సిపల్ సమావేశాలకు కలెక్టర్లు హాజరై ధరణిపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్లు ఇవ్వాలని కూడా సబ్ కమిటీ ప్రతిపాదించింది.
జిల్లా కలెక్టరేట్లలో ధరణి హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేయాలని, పోర్టల్లో పొందుపరచిన సమాచారం, అందులో ఉన్న వెసులుబాట్లపై అవగాహన కల్పించడంతోపాటు దరఖాస్తులను కూడా అక్కడి నుంచి అప్ లోడ్ చేసే ప్రొవిజన్ కల్పించాలని నివేదించింది. సబ్ కమిటీ ఆదేశాల మేరకు ధరణి పోర్టల్లో ప్రాబ్లమ్స్ ను అడ్రెస్ చేయడానికి రెవెన్యూ, స్టాంపులు – రిజిస్ట్రేషన్స్, టీఎస్ టెక్నాలజికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఉమ్మడిగా కసరత్తు చేసి కొన్ని టెక్నికల్ మాడ్యూల్స్ రూపొందించాయి. అధ్యయన సమాచారాన్ని, కొత్త మాడ్యూల్స్, తదుపరి కార్యాచరణలను క్రోడీకరిస్తూ మంత్రివర్గ ఉపసంఘం ఒక నివేదికను సిఎం కెసిఆర్ కు అందించింది.
ధరణి పోర్టల్ సమస్యలు, కమిటీ సిఫారసులపై ఉన్నతాధికారులు, మంత్రులతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సోమవారంన సుదీర్ఘంగా చర్చించారు. ఏడాది గడచినా లోపాల సవరణ ఇంకా ఎందుకు కొలిక్కిరాలేదని ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ధరణి సమస్యలకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందని అధికారులపై కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కొత్త మాడ్యూల్స్ ను వీలైనంత త్వరగా ప్రవేశపెట్టి ధరణి కార్యకలాపాలు సాఫీగా సాగేలా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని అధికారులను సిఎం ఆదేశించారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులపై మరోసారి అధికారులతో చర్చించిన తరవాత ముఖ్యమంత్రి మరికొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.