Monday, November 25, 2024

పాలమూరు పరుగులు పెట్టాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు -రంగారెడ్డి భారీ లిఫ్టు ప్రాజెక్టు నిర్మాణాలను వాయువేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. నూతన సచివాలయ భవనంలో నిర్వహించిన మొట్టమొదటి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం హాట్ హాట్‌గా జరిగింది. అదికూడా జాతీయస్థాయిలో ప్రాచుర్యం పొందిన, సుప్రీంకోర్టు వరకూ వెళ్ళిన పాలమూరు-రంగారెడ్డి లిఫ్టు ప్రాజెక్టుపైన సమీక్ష కావడంతో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యతలు ఏర్పడ్డాయి. ఈ ప్రా జెక్టు నిర్మాణాలకు నిర్ధిష్టమైన కాలపరిమితితో గడువులను విధించడమే కాకుండా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాటు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో మిగిలిపోయిన పనులు, భూ సేకరణకు సంబంధించిన నిధులను తక్షణమే విడుదల చేయాలని కూడా సీఎం ఆదేశించారు. పాలమూరు-రంగారెడ్డి భారీ లిఫ్టు ప్రాజెక్టుకు సంబంధించిన సివిల్ వర్క్, మెకానికల్ వర్, పంపులు, మోటార్లు, పైప్ లైన్‌ల నిర్మాణాలు, విద్యుత్తు సరఫరాకు అవసరమైన సబ్‌స్టేషన్ల నిర్మాణాలు, విద్యుత్తు లైన్లు, భారీ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు వంటి సమస్త అంశాలను కూలంకషంగా చర్చించిన తర్వాతనే ముఖ్యమంత్రి కెసిఆర్ జూలై నెలాఖరు నాటికి కర్వెన జలాశయం వరకూ కృష్ణానదీ జలాలను తరలించాలని అధికారులకు గడువు విధించారు.

అంతేగాక ఆగస్టు నెలాఖరు వరకూ ఉదండపూర్ జలాశయం వరకూ నీటిని ఎత్తిపోయాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే అయిదు జిల్లాలతో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్‌ఎంసి)కు కూడా తాగునీటి అవసరాలు తీర్చాల్సిన అత్యవసర పరిస్థితులు నెలకొని ఉన్నాయని, అందుచేతనే నిర్ధిష్ట కాలపరిమితిలోగా రేయింబల్లు పనిచేసైనాసరే ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను ఈ అయిదు జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు తరలించాలని సీఎం ఆదేశించారు. సుప్రీంకోర్టు కూడా కేవలం తాగునీటి అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే ప్రాజెక్టును నిర్మించుకోవడానికి వీలుగా అనుమతులు మంజూరు చేసిందని, అందుచేత ప్రజల దాహార్తిని తీర్చే పనులకు ఎక్కువ సమయం ఇవ్వలేమని కూడా సీఎం కెసిఆర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అందుకు అవసరమైతే రేయింబవళ్లు షిఫ్టులు పెంచుకొని అయినా నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయాలని, ఈ విషయాలను నిర్మాణ సంస్థలకు కూడా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.

నాగర్ కర్నూలు జిల్లాతో పాటుగా మహబూబ్‌నగర్, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని 74 మండలాలకు చెందిన సుమారు 25 లక్షల మంది జనాభాతో పాటుగా జిహెచ్‌ఎంసిలోని సుమారు 90 లక్షల మంది జనాభాకు అవసరమైన తాగునీటి సమస్యను తొలగించాలంటే ఈ ప్రాజెక్టు నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించారు. సుమారు ఒక కోటి 15 లక్షల నుంచి ఫ్లోటింగ్ పాపులేషన్‌ను కలుపుకుంటే మరో 10 లక్షల మంది జనాభాకు అవసరమైన తాగునీటి అవసరాలను తీర్చాల్సిన బాధ్యత పాలమూరు-రంగారెడ్డి లిఫ్టు ప్రాజెక్టుపైన ఉందని, అందుచేతనే ఈ ప్రాముఖ్యతను తెలుసుకొన్న సుప్రీంకోర్టు ప్రత్యేకమైన అనుమతులను మంజూరు చేసిందని అధికారులు సీఎంకు నివేదించారు. అంతేగాక తాండూరు, పరిగి, వికారాబాద్, కొడంగల్, చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు వీలుగా కాల్వల నిర్మాణాలకు టెండర్లను పిలవాలని అధికారులను సిఎం ఆదేశించారు.

ఈ ప్రాజెక్టులో ప్రతిపాదించిన 12.30 లక్షల ఎకరాలకు సాగునీటిని సరఫరా చేసే పనులను ఇప్పుడు చేపట్టడంలేదని, సాగునీటి పనులను పక్కనబెట్టి తాగునీటి పనులను మాత్రమే చేపడుతున్నామని, అందుకే సీఎం గడువులు విధించారని కొందరు అధికారులు వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగమైన నార్లపూర్, ఏదుల, వట్టెం, కర్వె, ఉదండపూర్ జలాశయాలకు సంబంధించిన మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారని తెలిపారు. వాటికి సంబంధించిన పంప్‌హౌజ్‌లు, విద్యుత్తు సబ్‌స్టేషన్లు, ఒక రిజర్వాయర్ నుంచి మరొక రిజర్వాయర్‌కు నీటిని తరలించే “కన్వేయర్ సిస్టమ్‌”లో మిగిలిన పనులను కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు.

అంతేగాక ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల్లో పెండింగ్‌లో ఉన్న పనులు, భూసేకరణ చెల్లింపులు తదితర సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. భూ సేకరణకు చెల్లించాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్ధికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావును ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించినట్లు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రులు డాక్టర్ వి.శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్‌కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్ తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News