Wednesday, November 6, 2024

‘కేంద్రం చిల్లర’ వ్యవహారం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రాలను నమ్మకుండా నేరుగా పల్లెలకు నిధులు పంపడం మంచి పద్ధతి కాదు

రాజీవ్‌గాంధీ నుంచి నరేంద్ర మోడీ వరకు
ఇదే తీరు అనుసరించడం శోచనీయం
జవహార్ రోజ్‌గార్ యోజన, గ్రామ్ సడక్
యోజన, ఉపాధి హామీ వంటి పథకాలను
ఢిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం
సమర్థనీయం కాదు రాష్ట్రాల్లోని స్థానిక
పరిస్థితులు అక్కడి ప్రభుత్వాలకే
తెలుస్తాయి రోజువారీ కూలీల డబ్బు
కూడా ఢిల్లీ నుంచే పంచాలనుకోవడం
సమంజసం కాదు: కేంద్రంపై కెసిఆర్ ఫైర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలు కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై బుధవారం ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పల్లె, పట్టణ ప్రగతితో పాటు బృహత్ పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలు, వరి ధాన్యం సేకరణ, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించిన అంశాలపైనా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న వైకుంఠధామాలు, సమీకృత వెజ్- నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలు, వరి ధాన్యం సేకరణపై ఆయన ఆరా తీశారు. ఇప్పటి వరకు ఎన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి.. పూర్తి ఎన్ని? తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.

అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఎవరూ ఆషామాషీగా తీసుకోవద్దని సూచించారు. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా రాష్ట్రాన్ని సంపూర్ణంగా, సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న పట్టదలతో ప్రభుత్వం ఉందన్నారు. ఈ నేపథ్యంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం జరిగినన్ని రోజులు ఉన్నతాధికారులంతా క్షేత్రస్థాయిలోనే ఉండాలని ఆదేశించారు. పల్లె, పట్టణ ప్రగతిలో జరుగుతున్న కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించాలన్నారు. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం లక్షం నెరవేరుతుందన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులు దేశంలోని మరే రాష్ట్రంలో జరగడం లేదన్నారు. ఈ కార్యక్రమం తీరుతెన్నులపై తాను ఎప్పకప్పుడు నివేదికలు తెప్పించుకుంటానని అన్నారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన సలహదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సిఎంఒ అధికారులతో పాటు వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

దేశం గర్వించే స్థాయిలో పల్లెలు, పట్టణాలు

ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్ర పాలనలో ధ్వంసమైన తెలంగాణను బాగు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా కష్టపడాల్సి వస్తోందని కెసిఆర్ అన్నారు. కష్టాలను అధిగమించి నేడు దేశం గర్వించే స్థాయిలో రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలను అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు వస్తోందన్నారు. కేంద్రం రెండు పర్యాయాలు రాష్ట్రానికి అవార్డులు ప్రకటిండమే ఇందుకు నిదర్శమన్నారు. కేంద్రం ప్రకటించిన ఉత్తమ గ్రామాలకు అవార్డులన్నీ దాదాపుగా తెలంగాణకే రావటం పట్ల కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు ప్రధాన కారణమైన పంచాయతీ రాజ్ శాఖ మంత్రికి, సంబంధిత అధికారులు, సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఫలితాలు ఊరికే రావని ప్రజల సంక్షేమం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అమలు చేస్తున్న కార్యాచరణతో పాటు అధికారులు చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే సాధ్యమవుతాయని గుర్తుచేశారు.

అనుమానాలన్నీ పటాపంచలు

రాష్ట్రంలో కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు పలువురు అనుమానాలను వ్యక్తం చేశారని కెసిఆర్ అన్నారు. వాటిని పటాపంచలు చేస్తూ పల్లెలను అభివృద్ధి పథాన నడిపించుకుంటున్నామన్నారు. ప్రతి గ్రామానికి మౌలిక వసతులను కల్పిస్తూ ప్రగతి సాధిస్తున్నామన్న సిఎఁ కెసిఆర్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు గ్రామాల్లో స్ఫూర్తిని నింపాయన్నారు. దేశ పర్యావరణం, పచ్చదనంలో భాగస్వామ్యం పంచుకోవడంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి అస్తవ్యస్తంగా ఉన్న గ్రామీణ మంచినీటి వ్యవస్థను దేశం గర్వించేలా మిషన్ భగీరథ ద్వారా తీర్చిదిద్దుకున్నామని తెలిపారు. అనతికాలంలో అనితర సాధ్యమైన అభివృద్ధిని సాధించామన్న సిఎం ఇందులో భాగస్వాములైన ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వ యంత్రాంగానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.

కేంద్రం చిల్లరగా వ్యవహరిస్తోంది

రాష్ట్రాల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ రాజ్ వ్యవస్థలో మూడంచెల విధానం వచ్చిన తర్వాత రాష్ట్రాలను నమ్మకుండా కేంద్రమే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చిల్లర వ్యవహారమని వ్యాఖ్యానించారు. రాజీవ్‌గాంధీ హయం నుంచి మొదలుకుని నేటి ప్రధాని నరేంద్రమేడీ వరకు ఇదే తీరును అనుసరించడం శోచనీయమన్నారు. రాష్ట్రాల పట్ల కేంద్రం అనుసరించాల్సిన తీరు ఇది కాదన్నారు. జవహర్ రోజ్ గార్ యోజన, గ్రామ్ సడక్ యోజన, నరేగా వంటి పథకాలను ఢిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం సమర్థనీయం కాదన్నారు. రాష్ట్రాల్లో నెలకొన్న స్థానిక పరిస్థితులు అక్కడి ప్రభుత్వాలకే తెలుస్తాయన్నారు. రోజువారి కూలీల డబ్బులను కూడా ఢిల్ల్లీ నుంచి కేంద్రమే పంచాలనుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

రాష్ట్రాలు, స్థానికసంస్థల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఈ సందర్భంగా కెసిఆర్ తప్పుపట్టారు. కేంద్రం అసమర్థ పాలన కారణంగానే 75 సంవత్సరాల అమృత్ మహోత్సవాల నేపథ్యంలోనూ దేశంలోని కొన్ని పల్లెలు, పట్టణాలు కరెంటు లేక చీకట్లలో మగ్గుతున్నాయని ఆయన ఆరోపించారు. తాగు, సాగునీరు లేక ప్రజలు రోడ్ల మీదకు ఎక్కుతున్నారని వ్యాఖ్యానించారు. విద్య, వైద్యం వంటి అనేక రంగాల్లో రావాల్సినంత ప్రగతి రాలేదని వ్యాఖ్యానించారు. ఇటువంటి అంశాల మీద కేంద్రం దృష్టి పెట్టకుండా, రాష్ట్రాల విధుల్లో జోక్యం చేసుకోవాలనుకోవడం అర్ధరహితమని ధ్వజమెత్తారు. దేశం ఒక సమగ్రమైన ఆకలింపు, అవగాహన, అభ్యుదయం వైపు అడుగులు వేస్తున్నట్లు అనిపించడం లేదని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పిఆర్ ఉద్యమ స్ఫూ ర్తిని పలుచన చేశారు

తాను గతంలో చెప్పినట్టు ఎస్‌కెడే ప్రారంభించిన పంచాయతీ రాజ్ వ్యవస్థ ఒక ఉద్యమం అని కెసిఆర్ అన్నారు. కానీ నేడు అందులో రాజకీయాలు ప్రవేశించడం ద్వారా అన్ని రకాలుగా పంచాయతీ రాజ్ స్ఫూర్తి చంపివేయబడ్డదన్నారు. దేశంలో ప్రారంభమైన సహకార ఉద్యమం కూడా కలుషితం చేయబడ్డదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి నిర్లక్ష్యపూరిత పరిస్థితుల నేపథ్యంలోంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభ దశలో తీసుకున్న నిర్ణయాలు, ఎంచుకున్న ప్రాధాన్యతా క్రమాలు కొందరికి జోక్ లాగా కనిపించాయన్నారు. తెలంగాణ వచ్చిన ప్రారంభంలో తాను అటవీ శాఖ, అడవుల పరిరక్షణ మీద సమీక్ష సమావేశం నిర్వహిస్తే కొందరు నవ్వుకున్నారన్నారు. కానీ నేడు దేశ పర్యావరణం, పచ్చదనంలో భాగస్వామ్యం పంచుకోవడంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందన్నారు. రాష్ట్రం వచ్చేనాటికి అస్తవ్యస్తంగా, యుద్ధవాతావరణంతో కూడుకొని ఉన్న గ్రామీణ మంచినీటి వ్యవస్థను ఇవ్వాల….. దేశం గర్వించేలా మిషన్ భగీరథ ద్వారా తీర్చిదిద్దుకున్నామన్నారు. ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగునీటిని అందిస్తున్న పరిస్థితి దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేదన్నారు.

రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై దేశవ్యాప్తంగా చర్చ

అన్ని రంగాల్లో జరిగిన తెలంగాణ అభివృద్ధిని ఇటీవల కొన్ని జాతీయ మీడియా ఛానళ్ళు ప్రసారం చేశాయని సిఎం కెసిఆర్ అన్నారు. ఇది చూసిన ఇతర రాష్ట్రాల వారికి ఆశ్చర్యం కలిగిందన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి తనకే నేరుగా ఫోన్లు చేసి అడుగుతన్నారన్నారు. దీనిని బట్టి రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ఊహించుకోవచ్చునని అన్నారు.

జెడ్‌పి చైర్మన్లది కీలక పాత్ర

గతంలో పంచాయితీరాజ్ వ్యవస్థ అంటే ప్రత్యేక గౌరవం ఉండేదని సిఎం అన్నారు. నాటి ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విజయ్ భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి ఎం. బాగారెడ్డి లాంటి మహామహులు మంత్రులుగాకంటే జెడ్‌పి ఛైర్మన్‌లుగానే కొనసాగడానికి ఇష్టపడే వారని సిఎం గుర్తు చేశారు. పంచాయతీ రాజ్‌లో జెడ్‌పి ఛైర్మన్ పాత్ర అంత కీలకమైనదన్నారు. ప్రస్తుత జెడ్‌పి ఛైర్మన్‌లు వారిని స్ఫూర్తిగా తీసుకొని పల్లె ప్రగతిలో కర్తలు, దర్తలు కావాలన్నారు.

పల్లె ప్రగతి కార్యక్రమంలో జెడ్‌పి ఛైర్మన్‌లు కీలక భూమిక పోషించాలన్నారు. అలాగే ఎంపిపిలు, ఎంపిడిఒల సేవలను కూడా ఉపయోగించుకోవాలన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా పల్లెలు, పట్టణాల ఉన్నత స్థితి నుంచి అత్యున్నత స్థితి దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిఎం తెలిపారు. రాష్ట్రంలో అన్ని గ్రామపంచాయతీల్లో వైకుంఠధామం పనులు 100 శాతం పూర్తి చేయాలనీ, పనుల పురోగతిని జడ్‌పి ఛైర్మన్‌లు నిరంతరం ఆకస్మిక తనిఖీలు చేసి పర్యవేక్షించాలని తెలిపారు. ఉత్తమ గ్రామపంచాయతీలను ప్రోత్సహించడంతో పాటు పనులు సరిగా జరగని చోట అధికారులు ప్రజాప్రతినిధులకు సహకరించాలన్నారు. ఒడిఎఫ్ (బహిరంగ మల విసర్జన రహిత) విషయంలో 100 శాతం ఫలితాలను రాబట్టేందుకు 15 రోజుల్లో నివేదికలు తెప్పించుకొని, తగిన చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు.

పబ్లిక్ గార్డెన్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఎప్పటి మాదిరిగానే నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్లో నిర్వహించాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రగతి భవన్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. రాష్ట్రం సాధించిన ప్రగతిని తెలియజేస్తూ ప్రసంగాలుండాలన్నారు. ఈ ప్రసంగాలను కలెక్టర్లు నిర్దిష్టమైన సమగ్ర సమాచారంతో తయారుచేయాలన్నారు. మండుటెండల నేపథ్యంలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ఉదయం 9 గంటలకు ప్రారంభించి, త్వరగా ముగించాలన్నారు. సాయంత్రం వేళ హైదరాబాద్ రవీంద్ర భారతిలో, జిల్లా కేంద్రాల్లో కవి సమ్మేళనం కార్యక్రమాలను నిర్వహించాలని సిఎం సూచించారు. తెలంగాణ కేంద్రంగా కవితలను తీసుకురావాల్సిందిగా కవులను, రచయితలను ఆహ్వానించాలని ఆదేశించారు.

గ్రామీణక్రీడా ప్రాంగణాల ఏర్పాటు

భవిష్యత్తు తరాలు శారీరక ధారుడ్యం, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు తోడ్పడే విధంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో “తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం” ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19వేల గ్రామాలు, 5వేల వార్డులు, మొత్తంగా 24 వేల “గ్రామీణ క్రీడా కమీటీల”ను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో క్రీడలను నిర్వహించడం కోసం ఈ కమీటీలు పనిచేస్తాయని సిఎం తెలిపారు. జూన్ 2 రాష్ట్ర అవిర్భావ దినోత్సవం నాడు ఎంపిక చేసిన కొన్ని గ్రామల్లొ క్రీడా ప్రాంగణాలను ప్రారంభించాలన్నారు.

దశలవారీగా దళితబంధు

ఈ ఏడాది నియోజకవర్గానికి 1500 మంది చొప్పున దళితబంధు పథకం లబ్దిదారులను ఎంపిక చేసే ప్రక్రియను కొనసాగించాలని అధికారులకు సిఎం కెసిఆర్ సూచించారు. ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత దశల వారీగా దళితబంధు పథకాన్ని అమలు చేయాలన్నారు. దళితబంధు పథకం అమలులో మరింత వేగం పెంచాలని సిఎం అధికారులను ఆదేశించారు.

ముందంజలో నూతన తెలంగాణ రాష్ట్రం

పంటల ఉత్పత్తిలో, తలసరి ఆదాయంలో ప్రధానమంత్రి స్వంత రాష్ట్రం గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక వంటి దశబ్దాలుగా స్థిరపడిన రాష్ట్రాలకంటే తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని సిఎం తెలిపారు. నిజమైన స్ఫూర్తి, లక్ష్యంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయనడానికి తెలంగాణ ఒక ఉదాహరణగా నిలిచిందని సిఎం తెలిపారు. అడవులు, తాగునీరు, సాగునీళ్లు, ఆరోగ్యరంగం, మన ఊరు – మన బడి, దళితబంధు ఇలా అనేక రంగాల్లో తెలంగాణ అద్భుతమైన ప్రగతి దిశగా ముందుకు సాగుతున్నదని సిఎం తెలిపారు.భవిష్యత్తు తరాలు సుఖవంతంగా ఉండాలంటే మనం ప్రత్యేక శ్రద్ధ వహించి, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు.

ప్రజారోగ్యం… వైద్యంలో పురోగతి

రాష్ట్రంలో మొత్తం 10 వేల పడకల సామర్థ్యంతో 6 కొత్త మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానాలను నిర్మించుకోనున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. వరంగల్‌లో 24 అంతస్తుల్లో 38 విభాగాలతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. అలాగే హైదరాబాద్ నలువైపులా 2000 పడకల సామర్థ్యం గల సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్‌ను అల్వాల, సనత్ నగర్, గడ్డి అన్నారం, గచ్చిబౌలి నిమ్స్ లలో ఢిల్లీ ఎయిమ్స్ తరహాలో టిమ్స్ పేరుతో నిర్మిస్తున్నామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కలిపి 57 వేల ఆక్సిజన్ బెడ్స్ కలిగిన సామర్థ్యం రాష్ట్ర వైద్య రంగంలో ఏర్పడ్డట్లు వివరించారు. 550 టన్నుల ఆక్సిజన్ ఇక్కడే ఉత్పత్తి చేసే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనే శక్తి తెలంగాణ రాష్ట్రానికి ఉందని సిఎం తెలిపారు.

ప్రపంచానికి తెలంగాణ ఒక బెంచ్ మార్క్

మొట్టమొదటి సారి ప్రపంచానికి గ్రీన్ ఫండ్ కాన్సెప్ట్‌ను తెలంగాణ పరిచయం చేసిందని సిఎం అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు తమ వేతనంలో 100 నుండి 500 రూపాయల వరకు ప్రతి నెలా కంట్రిబ్యూట్ చేసే విధానం, అడ్మిషన్లు, రిజిస్ట్రేషన్ ఫీజుల్లో కొంత గ్రీన్ ఫండ్ వసూలు చేస్తున్నాన్నారు. స్థానిక సంస్థల నిధుల్లో 10 శాతం బడ్జెట్ ను హరితహారానికి కేటాయించడం తప్పనిసరన్నారు. ఈ నిబంధనను కచ్చితంగా అమలుచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లో భాగంగా జరుగుతున్న అన్ని పనులను మంత్రులు, చీఫ్ సెక్రటరీలు, జెడ్‌పి ఛైర్మన్‌లు, శాసనసభ్యులు, కలెక్టర్లు, లోకల్ బాడీ కలెక్టర్లు, డిపిఒలు, నిరంతరం తనిఖీలు చేసి, ఎవరి పరిధిలో వారు రెగ్యులర్ గా సమీక్ష జరపాలని ఆదేశించారు.

పాలమూరు భేష్

మహబూబ్‌నగర్ లో 2087 ఎకరాల్లో అద్భుతంగా నిర్మించిన పార్కును ఆదర్శంగా తీసుకొని, ఇతర జిల్లాల్లో కూడా అర్బన్ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సిఎం సూచించారు. హైదరాబాద్‌కు ఒఆర్‌ఆర్ గ్రీన్ నెక్లెస్ వంటిదన్నారు. దాని గ్రీనరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరక్టర్‌లను ఈ సందర్భంగా సిఎం ఆదేశించారు. జాతీయ రహదారులకు ఇరువైపులా చెట్ల పెంపకం విషయంలో జెడ్పీ ఛైర్మన్లు, కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మల్టీ లేయర్ ప్లాంటేషన్ చేపట్టాలని సిఎం ఆదేశించారు.

కోల్పోయిన స్వర్గాన్ని తిరిగి తెచ్చుకుందాం

అడవులను పునరుజ్జీవింప చేయడం ద్వారా కోల్పోయిన స్వర్గాన్ని మళ్ళీ తెచ్చుకుందామని సిఎం పిలుపునిచ్చారు. ఈ విషయంలో అటవీ శాఖ అధికారులు, కలెక్టర్లు, ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

పక్కరాష్ట్రాల ప్రజలకూ తెలంగాణే ఆదెరువు

తెలంగాణలో ఉన్న నిరంతర విద్యుత్, వ్యవసాయానికి అందిస్తున్న పథకాలు సహా తదితర సంక్షేమ పథకాలను రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న ప్రజలు అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని వార్తలొస్తున్నాయని సిఎం తెలిపారు. కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్ బిజెపి శాసనసభ్యుడు రాష్ట్రంలోని అమలు చేస్తున్న పథకాలను కర్నాటకలో అమలు చేయాలని, లేకపోతే తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని కోరుతున్న విషయాన్ని గమనించాలని సిఎం అన్నారు.

ప్రతి వైకుంఠధామానికి నీటిని అందించాలి

రాష్ట్రంలోని ప్రతి గ్రామపంచాయతీ వైకుంఠధామానికి 10 రోజుల్లోగా మిషన్ భగీరథ మంచినీటి కనెక్షన్ అందించాలని కలెక్టర్లను సిఎం కెసిఆర్ ఆదేశించారు. గ్రామపంచాయతీల పరిధిలో ఉండే పాఠశాలలు, అంగన్‌వాడీ, ఎఎన్‌ఎం తదితర ప్రజావినియోగ సంస్థల పరిశుభ్రం, త్రాగునీటి వసతి తదితర బాధ్యతలు గ్రామపంచాయతీలు నిర్వహించేలా డిపిఒలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. చెరువులు, వాగులు, వర్రెలు, వంకలు,నదులు, ఉపనదుల తీరాల వెంట గ్రీన్ కవర్ అవకాశం ఉన్న ప్రతి చోట మొక్కలు నాటించాలని ఆదేశించారు. మున్సిపల్ వార్డుల్లో నర్సరీలు ఏర్పాటు చేయకపోతే, దానికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలనీ, ఈ నర్సరీల విషయంలో తనిఖీలు నిర్వహించాలనీ చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరక్టర్ లకూ సీఎం సూచించారు. మంత్రులు జిల్లాల్లో మున్సిపాలిటీల పై ఛైర్మన్ లు, మేయర్లు, కమిషనర్లతో ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. తాను ఆకస్మిక తనిఖీలు చేపడతానని సిఎం స్పష్టం చేశారు.

ఇస్టా అధ్యక్షునికి అభినందన

ఆసియా ఖండం లోనే తొలి సారిగా ఇస్టా (అంతర్జాతీయ విత్తన పరీక్ష సంఘం) ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన సంధర్భంగా తెలంగాణ విత్తన సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె. కేశవులును సిఎం కెసిఆర్‌అభినందించారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి దక్కిన అరుదైన గౌరవమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ విత్తన భాండాగారంగా ఐక్యరాజ్యసమితి గుర్తించిన విషయాన్ని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ గుర్తుచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News