Monday, December 23, 2024

కేంద్రం నేరుగా పల్లెలకు నిధులు పంపడం చిల్లర వ్యవహారం: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR Review on Palle Pragathi and Pattana Pragathi

హైదరాబాద్: కేంద్రమే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చాలా చిల్లర వ్యవహారంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుపై బుధవారం ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలు కోసం చేపట్టాల్సిన కార్యాచరణతో పాటు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలు, వరి ధాన్యం సేకరణ, జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపై సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. “తెలంగాణ ప్రభుత్వం ప్రారంభ దశలో తీసుకున్న నిర్ణయాలు, ఎంచుకున్న ప్రాధాన్యతా క్రమాలు కొందరికి జోక్ లాగా కనిపించాయి. తెలంగాణ వచ్చిన ప్రారంభంలో నేను అటవీ శాఖ, అడవుల పరిరక్షణ మీద సమీక్ష సమావేశం నిర్వహిస్తే ఈ అడవులేంది అని కొందరు నవ్వుకున్నారు. కానీ నేడు దేశ పర్యావరణం, పచ్చదనంలో భాగస్వామ్యం పంచుకోవడంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. తెలంగాణ వచ్చేనాటికి అస్తవ్యస్తంగా, యుద్ధవాతావరణంతో కూడుకొని ఉన్న గ్రామీణ మంచినీటి వ్యవస్థను ఇవ్వాల దేశం గర్వించేలా మిషన్ భగీరథ ద్వారా తీర్చిదిద్దుకున్నాం. ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగునీటిని అందిస్తున్న పరిస్థితి దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేదు.
అన్ని రంగాల్లో జరిగిన తెలంగాణ అభివృద్ధిని ఇటీవల కొన్ని జాతీయ మీడియా ఛానళ్ళు ప్రసారం చేశాయి. ఇది చూసిన ఇతర రాష్ట్రాల వారికి ఆశ్చర్యం కలిగింది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి నాకు ఫోన్లు చేసి అడుగుతన్నారు. అంటే మనం అనతికాలంలో అనితర సాధ్యమైన అభివృద్ధిని సాధించాం. ఇందులో భాగస్వాములైన ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

పంచాయతీ రాజ్ వ్యవస్థలో మూడంచెల విధానం వచ్చిన తర్వాత నాటి రాజీవ్ గాంధీ నుంచి నేటి వరకు ప్రధాని పదవిలో ఉన్నవారు రాష్ట్రాలను నమ్మకుండా, కేంద్రమే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చాలా చిల్లర వ్యవహారంగా ఉంది. జవహర్ రోజ్ గార్ యోజన, ప్రధాని గ్రామ సడక్ యోజన, నరేగా వంటి పథకాలను రాష్ట్రాల ద్వారా కాకుండా కేంద్రమే నేరుగా ఢిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం సమర్థనీయం కాదు. రాష్ట్రాలలో నెలకొన్న స్థానిక పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తాయి. రోజువారి కూలీల డబ్బులు కూడా నేరుగా ఢిల్లీ నుంచి కేంద్రమే పంచాలనుకోవడం సరైన విధానం కాదు. 75 సంవత్సరాల అమృత మహోత్సవాల నేపథ్యంలో దేశంలో ఇంకా కరెంటు లేక పల్లెలు, పట్టణాలు చీకట్లలో మగ్గుతున్నాయి. త్రాగునీరు, సాగునీరు లేక ప్రజలు రోడ్ల మీదకు ఎక్కుతున్నారు. విద్య, వైద్యం అనేక రంగాలల్లో రావాల్సినంత ప్రగతి రాలేదు. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి అంశాల మీద దృష్టి పెట్టకుండా, రాష్ట్రాల విధులలో జోక్యం చేసుకోవానుకోవడం సమర్థనీయం కాదు” అని పేర్కొన్నారు.

CM KCR Review on Palle Pragathi and Pattana Pragathi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News