మన తెలంగాణ/ హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ప్రగతిభవన్ లో సిఎం నేతృత్వంలో మంగళవారం జరిగిన ఉన్నతస్థాయి స మీక్షా సమావేశంలో సచివాలయం ప్రారంభోత్స వానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలు.. సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఉదయం శాస్త్రోక్తంగా నిర్వహించే కార్యక్రమాలను రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి నిర్వహిస్తారు. అనంతరం పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ప్రారంభ కార్యక్రమం ఉంటుంది. సంబంధిత సమయంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. సచివాలయం ప్రాంరంభం కాగానే ముందుగా కెసిఆర్ తన చాంబర్‌లో ఆసీనులౌతారు. ఈ సందర్భంగా వెంటవచ్చిన మంత్రులు కార్యదర్శులు సిఎంవో సిబ్బంది తదితర సచివాలయ సిబ్బంది వారి వారి చాంబర్లల్లోకి వెల్లి వారి సీట్లల్లో ఆసీనులౌతారు.
ఈ కార్యక్రమానికి సచివాలయ సిబ్బందితో పాటుమంత్రులు, ఎంపీలు , ఎంఎల్‌సిలు,ఎంఎల్‌ఎలు, రాష్ట్రస్థాయి కార్పోరేషన్ చైర్మన్లు, అన్ని శాఖల హెచ్‌ఒడిలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ చైర్మన్లు జిల్లా గ్రంథాలయాల చైర్మన్లు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు మున్సిపల్ మేయర్లు తదితరులు పాల్గొంటారు.
అందరూ కలిపి దాదాపు 2500 మంది హాజరవుతారని అంచనా.ఆహ్వానితులకు భోజనాలు ఏర్పాటు చేస్తారు.
పలు రకాల రక్షణ చర్యలు
నూతన సచివాలయంలో రక్షణ సహా పలు రకాల పకడ్బందీ చర్యలు చేపట్టడం జరిగింది. సచివాలయంకు ఉన్న నాలుగు దిక్కుల్లో ప్రధాన ద్వారాలున్నాయి. వాటిల్లో…నార్త్ వెస్ట్ ద్వారం అవసరం వచ్చినపుడు మాత్రమే ఓపెన్ చేస్తారు. నార్త్ ఈస్ట్ ద్వారం గుండా సచివాలయ సిబ్బంది కార్యదర్శులు అధికారుల రాకపోకలుంటాయి. అదే వైపు పార్కింగు కూడా ఉంటుంది. సౌత్ ఈస్ట్ ద్వారం కేవలం విజిటర్స్ కోసం మాత్రమే. సచివాలయ సందర్శన సమయం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకుంటుంది. ఇక తూర్పు గేట్ (మెయిన్ గేట్) ముఖ్యమంత్రి, సిఎస్ , డిజిపి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ఎంపీలు, చైర్మన్లు ఇంకా ముఖ్యమైన ఆహ్వానితులు, దేశ విదేశీ అతిథులు ప్రముఖుల కోసం మాత్రమే వినియోగిస్తారు. వికలాంగులకు వృద్దుల కోసం ఎలక్ట్రికల్ బగ్గీల ఏర్పాటు ఉంటుంది. ప్రయివేట్ వాహనాలు సచివాలయంలోకి అనుమతి లేదు.