గ్రామీణాభివృద్ధిలో స్థానిక ప్రజా ప్రతినిధుల పాత్రను క్రియాశీలం చేస్తాం
ఇకపై జిల్లా పరిషత్, మండల
పరిషత్‌లకు బడ్జెట్లో నిధుల కేటాయింపు
నిర్ధిష్టమైన నిధులు, విధులు అప్పగిస్తాం
ప్రగతి భవన్లో సంబంధిత
అధికారులతో సిఎం కెసిఆర్ సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్ : స్థానిక స్వపరిపాలన సంస్థలను మరింత బలోపేతం చేసి, గ్రామీణాభివృద్ధిలో వారి పాత్రను క్రియాశీలం చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం ఇస్తున్న మాదిరిగానే జిల్లా పరిషత్, మండల పరిషత్ లకు కూడా నిధులు రానున్న వార్షిక (2021-2022) బడ్జెట్లో కేటాయిస్తామన్నారు. అలాగే నిర్ధిష్టమైన విధు లు అప్పగిస్తామని సిఎం స్పష్టం చేశారు. మండ ల, జిల్లా స్థాయి అధికారుల అనుమతులు అవసరం లేకుండానే, గ్రామ పంచాయతీలు తమ నిధులను సంపూర్ణంగా వినియోగించుకునే అధికారం కొత్త పంచాయతీ రాజ్ చట్టం కల్పించిందని సిఎం కెసిఆర్ అన్నారు. దీనిని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సిఎం కెసిఆర్ సోమవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, కమిషనర్ రఘునందన్ రావు, డిప్యూటీ కమిషనర్ రామారావు, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రభుత్వ విప్‌లు గువ్వల బాలరాజు, బాల్క సుమన్, శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య, దుర్గం చిన్నయ్య, దివాకర్ రావు, శంకర్ నాయక్, హర్షవర్థన్ రెడ్డి, ఆదిలాబాద్ మాజీ జెడ్పి చైర్ పర్సన్ సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నదన్నారు. ఇందులో భాగంగానే గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ఆర్థిక సంఘం నిధులను నేరుగా మంజూరు చేస్తున్నదన్నారు. పంచాయతీలకు నెలకు రూ.308 కోట్ల చొప్పున, మున్సిపాలిటీలకు నెలకు రూ.148 కోట్ల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తున్నదన్నారు. నిధుల కొరత లేకపోవడంతో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.
గ్రామాల్లో ట్రాక్టర్లు, డంపుయార్డులు, నర్సరీలు, వైకుంఠధామాలు సమకూరాయన్నారు. ఇదే తరహాలో జిల్లా పరిషత్, మండల పరిషత్ లకు కూడా ప్రత్యేకంగా ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. ఈ నిధులను నరేగా లాంటి పథకాలతో అనుసంధానం చేసుకోవడం వల్ల మరిన్ని నిధులు సమకూరే అవకాశం ఉంటుందన్నారు. నిధులు ఇవ్వడంతో పాటు జిల్లా పరిషత్, మండల పరిషత్తులకు నిర్దిష్టమైన విధులు అప్పగించాలన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా, మండల పరిషత్ లకు ఎలాంటి బాధ్యతలు అప్పగించాలో అధికారులు సూచించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఆ సూచనలపై జిల్లా పరిషత్ చైర్ పర్సన్లతో తానే స్వయంగా చర్చిస్తామన్నారు. అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. మొత్తంగా జిల్లా, మండల పరిషత్ లను మరింత క్రియాశీలం చేసి, గ్రామీణాభివృద్ది కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం, గౌరవం పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సిఎం స్పష్టం చేశారు.
గ్రామ పంచాయతీలు తమ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా కొత్త చట్టంలో నిబంధన పెట్టామని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. కానీ కొన్ని చోట్ల రెండు లక్షల రూపాయలకు మించిన పనుల మంజూరుకు మండల అధికారుల నుంచి అనుమతి పొందాలనే పాత నిబంధన అమలు చేస్తున్నారన్నారు. ఇది కొత్త చట్టానికి విరుద్ధమన్నారు. గ్రామ పంచాయతీలు తమ నిధులను, తమ గ్రామ అవసరాలు తీర్చడానికి సంపూర్ణంగా వినియోగించుకునే హక్కు ఉన్నదన్నారు. ఇందులో ఎవరి జోక్యం అక్కరలేదని సిఎం పేర్కొన్నారు. ఈ విషయంలో అధికారులు మరో సారి స్పష్టత ఇవ్వాలని సిఎం ఆదేశించారు.