Monday, December 23, 2024

ఐదు నెలలైనా అనుమతులివ్వరా?

- Advertisement -
- Advertisement -

CM KCR review on work progress of irrigation projects

గోదావరి ప్రాజెక్టుల డిపిఆర్‌లపై కేంద్రం ఉలుకూపలుకు లేదు
ముఖ్యమంత్రి కెసిఆర్ అసహనం
జలసంఘం కోరుతున్న అదనపు సమాచారమివ్వండి
ఐదు ప్రాజెక్టులను గెజిట్ నుంచి తొలగించడానికి ప్రతిపాదనలు
కీలక ప్రాజెక్టులకు టెండర్ల ప్రక్రియ
సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష, అధికారులకు ఆదేశాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రంపై సిఎం కెసిఆర్ మరోసారి తీవ్ర అసహనం…ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్)లను కేంద్రానికి సమర్పించి నెలలు కావస్తున్నా, ఇప్పటి వరకు ఎలాంటి కదలికలేదని మండిపడ్డారు. ఈ విషయాన్ని పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం మాత్రం శూన్యమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సిఎం కెసిఆర్ సమీక్షించారు. ఇందుకు సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులకు సిఎం కెసిఆర్ పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా గోదావరి ప్రాజెక్టుల డిపిఆర్‌ల అనుమతుల పురోగతిని సిఎం అడిగి తెలుసుకున్నారు. కేంద్ర జల సంఘం వారు కోరుతున్న అన్ని వివరాలను, అదనపు సమాచారాన్ని సమర్పించి త్వరితగతిన అనుమతులు పొందాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

సీతారామ, సమక్కసాగర్, ముక్తేశ్వర (చిన్నకాళేశ్వరం) ఎత్తిపోతలు, చెనాక కొరాట బ్యారేజీ, చౌటుపల్లి హన్మంత్ రెడ్డి ఎత్తిపోతలు, మోడికుంట వాగు ప్రాజెక్టుల డిపిఆర్‌లు సమర్పించి 5 నెలలు గడిచినా కేంద్ర జల సంఘం నుంచి ఇంకా అనుమతులు రాకపోవడం పట్ల సిఎం కెసిఆర్ అసహనం వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు డిపిఆర్‌ను త్వరితగతిన సిద్దం చేసి కేంద్ర జలసంఘానికి, గోదావరి బోర్డుకు సమర్పించాలని సిఎం కెసిఆర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. గోదావరి బోర్డు అధికారులతో కూడా నిరంతరం సంప్రదింపులు జరిపి 5 గోదావరి ప్రాజెక్టులను గెజిట్ నోటిఫికేషన్ నుంచి తొలగించడానికి ప్రతిపాదనలు సిద్దం చేసి కేంద్ర జల సంఘానికి పంపించాలని అధికారులను సిఎం ఆదేశించారు. సాగునీటి శాఖలో ప్రస్థుత సంవత్సరంలో ముఖ్యమైన ప్రాజెక్టుల టెండర్లు పిలవడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

నాగార్జునసాగర్ ఎడమ కాలువపై నిర్మించ తలపెట్టిన లిఫ్టు పథకాలు., గట్టు ఎత్తిపోతల పథకం., కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాల్లో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాలెన్స్ పనులు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిపోయిన రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పనులు, బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా నిర్మించే బ్యారేజి, చెన్నూర్ ఎత్తిపోతల పథకం, కడెం నదిపై నిర్మించ తలపెట్టిన కుప్టి ప్రాజెక్టులకు టెండర్లు పిలువాలని ఇరిగేషన్ అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రతిపాదించిన ముఖ్యమైన ప్రాజెక్టుల నిర్మాణాలు సంపూర్ణమౌతాయన్నారు. సాగునీటిరంగంలో రాష్ట్ర ప్రభుత్వవం నిర్దేశించుకున్న ప్రతిపాదిత లక్ష్యాలను చేరుకుంటామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీష్ రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంఎల్‌సి వెంకట్రామ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణా రావు, రజత్ కుమార్, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఎఎం రిజ్వీతో పాటు సిఎంఒ అధికారులు స్మితాసబర్వాల్, రాజశేఖర్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ అధికారులు, శ్రీనివాస రావు, రమేశ్ రెడ్డి, గంగాధర్, చంద్రశేఖర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ అధికారులు ఇఎన్‌సి గణపతి రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ , ఇరిగేషన్ శాఖ అధికారులు ఈఎన్సీ మురళీధర్ రావు, ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ లు మురళీధర్, హరి రామ్, సిఎం ఒఎస్‌డి శ్రీధర్ రావు దేశ్‌పాండే, ఎస్‌ఇ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News