హైదరాబాద్: తెలంగాణలో పల్లెలు, పట్టణాలు వందశాతం అభివృద్ధి జరగాలని.. దానికోసం అందరి భాగస్వామ్యం అవసరమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ఆదివారం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై సిఎం కెసిఆర్ ప్రగతిభవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులకు సిఎం దిశా నిర్దేశం చేశారు. స్థానిక సమస్యల పరిష్కారానికి అడిషనల్ కలెక్టర్లకు రూ.25 లక్షల చొప్పున కేటాయించారు. అదనపు కలెక్టర్లు, డిపివోలు కష్టపడుతున్నా.. ఆశించినంత మేర పనులు జరగట్లేదని చెప్పారు. అధికారుల పనితీరుపై నివేధికలు తెప్పించుకుంటున్నా..10రోజుల సమయం ఇచ్చి ఆకస్మిక తనిఖీలకు వస్తా, చెప్పినా కూడా పనితీరు మెరుగుపడకుంటే క్షమించేది లేదని హెచ్చరించారు. విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం ఉంటే ఎవరు చెప్పినా విననని, ఏవైన తప్పులుంటే 10రోజుల్లో సరిదిద్దుకోవాలని సూచించారు. గ్రామసభలు నిర్వహించకుంటే సర్పంచ్ లు, కార్యదర్శులను సస్పెండ్ చేయాలన్నారు. వైద్య, ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తామని, ఆస్పత్రి భవనంపైనే హెలికాప్టర్ దిగేలా హెలిప్యాడ్ లు ఏర్పాటు చేస్తామన్నారు. పల్లె ప్రకృతి వనాల కోసం ప్రభుత్వ భూమి లేకుంటే.. ప్రైవేట్ భూములు తీసుకోవాలన్నారు. పల్లెలు, పట్టణాల అభివృద్ధిలో భాగంగా తాను కూడా ఒక జిల్లాను దత్తత తీసుకుంటాని తెలిపారు. వర్షాలు పడుతున్నాయి.. హరితహారం కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పారు. ఈనెల 20న సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల్లో.. జూన్ 21న వరంగల్ జిల్లాలో ఆకస్మిక తనిఖీ చేయనున్నట్లు సిఎం కెసిఆర్ తెలిపారు.
CM KCR Review with Officials at Pragathi Bhavan