Monday, December 23, 2024

రోడ్లు అద్దంలా మెరవాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న రోడ్ల మరమ్మత్తుల పనులన్నీ శరవేగంగా పూర్తి కావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వచ్చే నెల రెండవ వారంలోగా పూర్తి కావాలన్నారు. ఇరిగేషన్ శాఖ మాదిరినే ఒక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను రూపొందించుకుని రోడ్లను నిత్యం పర్యవేక్షించాలన్నారు. సంబంధిత అధికారులు సాంప్రదాయ పద్దతిలో కాకుండా చైతన్యవంతంగా విభిన్నంగా ఇంజనీర్లు ఆలోచన చేయాలని సూచించారు.
స్వరాష్ట్రంలో పటిష్టంగా తయారు చేసుకున్న తెలంగాణ రోడ్లు.. రవాణా వత్తిడి వల్ల కాలానుగుణంగా మరమ్మత్తులు చోటు చేసుకుంటాయన్నారు. వాటిని గుంతలు లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణానికి వీలుగా నిరంతరం నిర్వహణ పనులు చేపట్టాలన్నారు. రవాణాకు సౌకర్యవతంగా రోడ్లు ఉండాలని సంబంధిత అధికారులకు సిఎం కెసిఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో పనులు పటిష్టంగా జరగాలంటే ఎస్‌ఇల సంఖ్య, ఇఇల సంఖ్య ఎంత ఉండాలో ఆలోచన చేయాలన్నారు. శాఖలో పెరుగుతున్న పనిని అనుసరించి ప్రతిభావంతంగా పర్యవేక్షణ చేసే దిశగా పని విభజన జరగాలన్నారు. ఇందుకు సంబంధించి అధికారులు సమీక్షించుకుని ప్రభుత్వానికి తుది నివేదికను అందచేస్తే….. వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించే అవకాశముంటుదన్నారు.

రోడ్లు భవనాల శాఖ, పంచాయతీ రాజ్ శాఖల పరిధిల్లో క్షేత్రస్థాయిలో పనులను మరింత పటిష్టపరిచేందుకు చేపట్టవలసిన నియామకాలు, అభివృద్ధి కార్యాచరణపై గురువారం ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అనంతరం పెరిగిన వనరులతో, రాష్ట్ర స్వయం ఉత్పాదక శక్తితో, అభివృద్ధి పనుల పరిమాణం రోజు రోజుకూ పెరుగుతున్నదన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న గుణాత్మక ప్రగతికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో కావాల్సినంత సిబ్బందిని నియమించుకుని, బాధ్యతల వికేంద్రీకరణ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కేవలం సాంప్రదాయ పద్దతిలో కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు ఆలోచనల్లోనూ మార్పులు రావాలన్నారు. కొత్తగా ఆలోచించి శరవేగంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుని, వానలకు వరదలకు పాడయిన రోడ్లను ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేయాలని కెసిఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వి.శ్రీనివాస్ గౌడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి, శాసనసభ్యులు జీవన్ రెడ్డి, బాల్క సుమన్, పైలట్ రోహిత్ రెడ్డి, దానం నాగేందర్, మైనంపల్లి హన్మంతరావులతో పాటు సిఎస్ సోమేశ్ కుమార్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సిఎం సెక్రటరీలు భూపాల్ రెడ్డి, స్మితా సభర్వాల్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావు, సంజీవరావు, ఆర్ అండ్ సెక్రటరీ శ్రీనివాసరాజు, రవీందర్ రావు, ఫైనాన్స్ సెక్రటరీ రోనాల్డ్ రాస్, సిఎం ఒఎస్‌డి ప్రియాంక వర్గీస్, సత్యనారాయణ రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అద్దంలా రోడ్లు మెరవాలి
రోడ్లు చెక్కు చెదరకుండా, అద్దాల మాదిరిగా ఉంచేందుకు అధికారులు నిరంతర నిర్వహణ చేపట్టాల్సిన బాద్యత ఆర్‌అండ్ బి, పంచాయితీ రాజ్ శాఖలదేనని కెసిఆర్ స్పష్టం చేశారు. ఆ దిశగా శాఖల్లో పరిపాలన సంస్కరణలు అమలు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో మరింత మంది ఇంజనీర్లను నియమించుకోవాలని సూచించారు. ఇతర శాఖల మాదిరిగానే ఆర్ అండ్ బి శాఖకు కూడా ఇఎన్‌సి అధికారుల విధానం అమలు చేయాలన్నారు. ప్రతి 5 లేదా 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ఎస్‌ఇ ఉండే విధంగా, టెరిటోరియల్ సిఇలను కూడా నియమించాలన్నారు.

డిసెంబర్ నెల రెండవ వారం లోగా లోపు రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మత్తు పనులు పూర్తికావాలని కెసిఆర్ ఆదేశించారు. రోడ్లు ఎక్కడెక్కడ ఏమూలన పాడయ్యాయో సంబంధించిన పూర్తి వివరాలు క్షేత్రస్థాయి ఇంజనీర్ల దగ్గర ఉండాలన్నారు. రాష్ట్రంలో నాటి పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. రాష్ట్రం చాలా అభివృద్ధి చెందిందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న మద్దతుతో వ్యవసాయం అనుబంధ రంగాలలో సాధిస్తున్న ప్రగతి ద్వారా పల్లె పల్లెనా ట్రాక్టర్లు హార్వెస్టర్లు రోజు రోజుకూ పెరుగుతున్నాయన్నారు. ఆర్థికంగా బలపడుతున్న గ్రామీణ రైతాంగం వారి కుంటుంబాల రవాణా సౌకర్యార్థం కార్లు టు వీలర్లు కొనుక్కుంటున్నారన్నారు.

శాఖల బాధ్యతల్లో పునర్విభజన జరగాలి
రోడ్లు భవనాల శాఖ, పంచాయితీ రాజ్ శాఖలను పటిష్టం చేసుకునేందుకు పలు మార్గాలను అనుసరించాల్సి ఉందని సిఎం వ్యాఖ్యానించారు. ముఖ్యంగా శాఖల్లో బాధ్యతల పునర్విభజన జరగాలన్నారు. వానలకు, వరదలకు కొట్టుకు పోయిన రోడ్ల (ఎఫ్ డి ఆర్) ను మరమ్మత్తులు నిర్వహణ., కిందిస్థాయి ఇంజనీర్లు మరమ్మత్తులు తదితర పనులకు సత్వర నిర్ణయం తసుకుని పనులు చేపట్ట దిశగా నిధుల కేటాయింపులు వంటి మార్గాలను అవలంభించాలన్నారు. ఇందుకు సంబంధించి వర్క్ షాపులు నిర్వహించుకుని తగు నిర్ణయాలు తీసుకోవాలని సిఎం అన్నారు. రోడ్ల మరమ్మత్తుల కోసం టెండర్లు పిలిచి వారంలోగా కార్యాచరణ ప్రారంభించాలని సిఎం అన్నారు. అందుకు సంబంధించిన కార్యాచరణ పై తక్షణమే దృష్టి కేంద్రీకరించాలని మంత్రిని, ఉన్నతాధికారులను సిఎం ఆదేశించారు.

కఠిన నిబంధనలు అమలు చేయండి
గ్రామీణ ప్రాంతాల్లో కేజీ వీల్స్‌తో ట్రాక్టర్లను నడిపడం ద్వారా రోడ్లు పాడవుతున్న విషయాన్ని సంబంధిత అధికారులు ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ దృష్టికి తెచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ, రైతులను, ట్రాక్టర్ ఓనర్లు, డ్రైవర్లను చైతన్యం చేయాలన్నారు. ఇందుకు సంబంధించి కఠిన నిబంధనలు అమలు చేయాలని కెసిఆర్ ఆదేశించారు. పంచాయితీ రాజ్ శాఖ ఇంజనీర్లు వారి శాఖ పరిధిలోని పాడయిన రోడ్లను గుర్తించి మరమ్మత్తులు చేపట్టాలన్నారు. అటవీ భూములు అడ్డం రావడం ద్వారా రోడ్ల నిర్మాణం ఆగిపోతే, సమస్య పరిష్కారానికి వెంటనే సంబంధిత శాఖతో సమన్వయం చేసుకోవాలని సిఎం అన్నారు. రోడ్లకు వాడే మెటీరియల్ ఉత్పత్తిని హైదరాబాద్ కేంద్రంగా చేసుకోవాలని తద్వారా సమయాన్ని నాణ్యతను కాపాడుకోవచ్చన్నారు. అందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని అధికారులకు సిఎం సూచించారు. రాష్ట్రంలోని రోడ్ల మరమ్మత్తుకు రాష్ట్ర ఇరిగేషన్ శాఖకు మాదిరే ఆర్ అండ్ బీ శాఖకు కూడా మెయింటెనెన్స్ నిధులు పెంచినామని సిఎం అన్నారు.

హైదరాబాద్‌కు వచ్చి సమయం వృధా చేసుకోవద్దు
కిందిస్థాయి ఇంజనీర్లు ప్రతిచిన్న పనికి హైదరాబాద్‌కు వచ్చి సమయం వృథా చేసుకోవద్దని సిఎం సూచించారు. వారి వారి స్థాయిని బట్టి వారే స్వయంగా ప్రజావసరాలను దృష్ట్యా, నిధులను ఖర్చే చేసే విధంగా ప్రభుత్వం నిధులను కేటాయిస్తుందన్నారు. ఎవరితో సంబంధం లేకుండా ఖర్చు చేసేందుకు డిఇఇ, ఇఇ, ఎస్‌ఇ స్థాయిల్లోని ఇంజనీర్లు ఎవరిదగ్గర ఎన్ని నిధులు కేటాయించాల్నో చర్చించి నిర్ణయించాలని అధికారులకు సూచించారు. రోడ్ల మెయింటెనెన్స్ పనులు సమర్ధవంతంగా ఉండాలంటే ఆ బాధ్యతను ఏ స్థాయి ఇంజనీరుకు అప్పగించాలో కూడా నిర్ణయించుకోవాలని సూచించారు. వానలు వరదల కారణంగా తెగిపోయిన రోడ్ల మరమ్మత్తులకు, సాధారణ రోడ్ల మరమ్మత్తులకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని రోడ్లు భవనాల శాఖ మంత్రిని, అధికారులను సిఎం ఆదేశించారు.

ఇంటికో బండి…వాడకో కారుంది
రాష్ట్రంలో ఇయ్యాల ఇంటికో బండి.. వాడకో కారున్నదని కెసిఆర్ అన్నారు. అటువంటప్పుడు గతంలోలా రోడ్లు ఖాళీగా ఉంటలేవన్నారు. రోడ్లు నిరంతరం వత్తిడికి గురవుతున్న నేపథ్యంలో వాటి నిర్వహణను ఛాలెంజ్ గా తీసుకోవాల్సిన అవసరమున్నదన్నారు. పలె,్ల పట్టణం అనే తేడా లేకుండా రోడ్ల మీద వాహనాల రద్దీ పెరిగిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో రాత్రి, పగలు వాహనాల రవాణాతో తాకిడికి గురయ్యే రోడ్లను పటిష్టంగా ఉంచుకోవాల్సిన బాధ్యత, ప్రజలకు రవాణాను నిరంతరం సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ఆర్ అండ్ బి పంచాయితీ రాజ్ శాఖలదేనని సిఎం స్పష్టం చేశారు. రోడ్లు మరమ్మత్తు ఒక నిరంతర ప్రక్రియగా భావించాలన్నారు. ఇంజనీర్లు ఎక్కడికక్కడ రోడ్లను దూరాల వారిగా విభజించుకుని పని విభజన చేసుకోవాలన్నారు. అందుకు నివేదికలు రూపొందించుకోవాలన్నారు. ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని, ఎప్పటికప్పుడు వర్క్ షాపులను నిర్వహించుకోవాలన్నారు.

సూపర్ స్పెషాలిటీ దవాఖానాలను పటిష్టంగా నిర్మించాలి
రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానలను పటిష్టంగా నిర్మించాలని సిఎం తెలిపారు. ప్రజల సౌకర్యార్దం వరంగల్ హైదరాబాద్‌లలోనూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానాలో ఇఎన్‌టి, డెంటల్, ఆప్తమాలజీ విభాగాల కోసం ఒకఫ్లోర్‌ను కేటాయించాలన్నారు. ఈ సందర్భంగా సిఎం దవాఖానాల నిర్మాణాల నమూనాలను సిఎం పరిశీలించారు. ఎత్తయిన అంతస్తులతో అన్ని విభాగాలకు ప్రత్యేకంగా వసతులను ఏర్పాటు చేస్తూ నిర్మాణాలు చేపట్టాలన్నారు. సూచించిన విధంగా నమూనాలను రూపొందించుకుని రావాలని ఆర్ అండ్ బి శాఖ అధికారులను సిఎం ఆదేశించారు. నూతన దవాఖానాలను అటు మెడికల్ విద్యార్థులకు ఇటు ప్రజల వైద్య సేవలకు అనుగుణంగా నిర్మించాలని సి ఎం అన్నారు. కార్పోరేట్ దవాఖానాలకు ధీటుగా వరంగల్ లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానా నిర్మాణం కావాలని సిఎం ఆదేశించారు.

CM KCR Review with Panchayat & roads building dept officials

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News