Tuesday, November 5, 2024

సిఎం కెసిఆర్ చెప్పిన మిడతల దండు కథ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మన ప్రాంతానికి సాధారణంగా మిడతల దండు రాదని, ఈ మధ్య మిడతల బెడద లేదని సిఎం కెసిఆర్ తెలిపారు. వెనుకటి కాలంలో ఉండేదని అన్నారు. పొలం కౌలుకు చేసుకుంటుంటే కృష్ణవేణమ్మ కొంత తీసుకుని పోయిందని, బిలబిలాక్షులు(మిడతలు) కూడా కొంత తీసుకుపోయిందని బాధపడుతూ మహాకవి శ్రీనాథుడు నిర్బంధంలో ఉండి చనిపోయే సమయంలో పాడతాడని చెప్పారు. ఈ మధ్యకాలంలో మన దగ్గర మిడతల బెడద లేదని అన్నారు. మధ్య ఆసియా నుండి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీదుగా గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రానికి మిడతల దండు వస్తూంటుందని, ఈ మిడతల దండు హర్యానాలోకి వచ్చి అక్కడి నుండి మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోకి ప్రవేశించి, ఆదిలాబాద్ సరిహద్దు దాకా విస్తరిస్తూ వస్తున్నదని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తే ఆదిలాబాద్ ఉత్తర భాగాన ఉన్న కలెక్టర్లను, ఎస్పీలను అప్రమత్తం చేసి ప్రజలను, పంటలను కాపాడుకునేందుకు ఫైరింజన్లు,

స్ప్రేలతో సన్నద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నుండి ఒక మహిళా ఆఫీసర్, మన దగ్గర అగ్రికల్చర్ యూనివర్సిటీలోని ఇద్దరు ఎంటమాలజిస్టులు దీని పర్యవేక్షణ కోసం వచ్చారని, వారికి హెలికాప్టర్ ఇచ్చి సరిహద్దులకు పంపామని గుర్తు చేశారు. మహారాష్ట్రలోనే మిడతల దండును చంపేయడం వల్ల, అవి మన దాకా రాలేదని తెలిపారు. అనంతరం ఆ ఇద్దరు ఎంటమాలిస్టులు తనను కలిసి హెలికాప్టర్ ఇచ్చి, గౌరవించి బాగా చూసుకున్నారని ధన్యావాదాలు తెలిపారని చెప్పారు. సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ కాలంలోనూ ఈ సమస్యకు పరిష్కారం ఎందుకు కనుక్కోలేదని తాను వారిని నా అకడమిక్ ఇంట్రస్ట్ కొద్దీ ప్రశ్నించానని గుర్తు చేశారు. అందుకు వారు బదులిస్తూ సార్ మిడతలను చంపలేము, నిర్మూలించలేము… అది అసాధ్యమని చెప్పారని అన్నారు. మనిషి 4 లక్షల సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చాడు… కానీ ఈ మిడతలు, బాక్టీరియాలు, ఇతరత్రా 8 లక్షల సంవత్సరాల క్రితమే ఉద్భవించాయని,

అవి నిద్రాణంగా ఉంటాయని, వాటికి వ్యతిరేక చర్యలతో ప్రకోపం చెంది ఇబ్బందులు కలిగిస్తాయని ఎంటమాలజిస్టులు చెప్పారని తెలిపారు. కరోనా కూడా అటువంటిదేనా అంటే అటువంటిదే అని వారు చెప్పారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్ని ఎలా రక్షించుకోవాలో సలహాలివ్వాలని అడిగితే, ఎక్కడైతే వైద్యారోగ్య వ్యవస్థ పకడ్బందీగా ఉంటుందో అక్కడ తక్కువ నష్టాలు జరుగుతాయని, లేకపోతే నష్టాలు ఎక్కువగా జరుగుతాయని వారు తెలిపారని పేర్కొన్నారు. ఆరోగ్యశాఖ ప్రాధాన్యతను దీన్ని ద్వారా అర్థం చేసుకోవచ్చని వివరించారు. అప్పటి నుండి ఎలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేలా ఆరోగ్యశాఖను తీర్చిదిద్దాలని భావించి, ఆరోగ్య శాఖ మంత్రులను, అధికారులను పిలిచి గంటలు, రోజులు, వారాల తరబడి చర్చించి అవసరమైన ఆర్థిక ప్రేరణ ఇవ్వడానికి బడ్జెట్ కేటాయింపులు కూడా భారీగా పెంచి ఈ శాఖను మనం ముందుకు తీసుకుపోతున్నామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News