Thursday, January 9, 2025

‘పోడు’ పండుగ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : పోడు భూములపై తమకు ప్రత్యేక విధానం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ అన్నారు. ఈ నెలాఖరులో పోడు భూముల పట్టాలు పంపిణీ ప్రారంభిస్తామని సిఎం అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. పట్టాలు పంపిణీ చేశాక రైతుబంధు, విద్యుత్, సాగునీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవా రం శాసనసభలో సిఎం కెసిఆర్ మాట్లాడారు. గిరిజనులకు గత పాలకు లు చేసిన మోసాలు అందరికీ తెలుసని, పోడు భూములపై తమకు ప్రత్యే క విధానం ఉందని వెల్లడించారు. భూమిలేని గిరిజన బిడ్డలకు దళితబంధు తరహాలోనే గిరిజన బంధు ఇచ్చి సాయం చేస్తామన్నారు. రాష్ట్రం లో 66 లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నాయని, అటవీ భూ ముల పై ఇప్పటికే నివేదికలు సిద్ధమయ్యాయని వెల్లడించారు. అన్ని పార్టీల నేతలు ఒప్పుకుంటే 11.5లక్షల ఎకరాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నా రు. గుత్తికోయలను తీసుకువచ్చి అడవులను నరికివేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అటవీ అధికారులపై దాడులు సరికాదన్నారు. గిరిజనులకు గత పాలకులు చేసిన మోసాలు అందరికీ తెలుసని పేర్కొన్నారు. పోడుభూములపై ప్రతిసారి రాజకీయం చేయడం సరికాదని ముఖ్యమంత్రి సూచించారు. పోడు భూములు అనేవి హక్కు కాదని, దురాక్రమణ అని స్పష్టం చేశారు. విచక్షణారహితంగా అడవులను నరికేయడం సరికాదని చెప్పారు. పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. పోడు, అటవీ భూములు పలువురికి ఆటవస్తువులా తయారయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులపై దౌర్జన్యం జరుగకుండా చూడాలని సూచించారు.అటవీ భూముల కోసం కొందరు అగ్ర కులస్థులు గిరిజన యువతులను పెండ్లి చేసుకుంటున్నారని చెప్పారు. ఖమ్మం జిల్లాలో పలువురు
ఉన్నత కులాలవారు అటవీ భూములను కబ్జాచేశారన్నారు. 10, 20 ఎకరాల పోడు భూములు ఎవరికైనా ఉంటాయా అని ప్రశ్నించారు.

గిరిజనుల హక్కులు కాపాడాల్సిందే..

గిరిజనుల హక్కులు కాపాడాల్సిందేనని, అందులో ఎలాంటి సందేహం లేదని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. పోడుభూముల దురాక్రమణ జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అటవీ సంపద ఉండాలా, కనుమరుగు కావాలా అని ప్రశ్నించారు. నర్సాపూర్ అడవి ఎలా ఎడారైందో మనమంతా చూశామన్నారు. అడవుల పునరజ్జీవనం చేసే ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో 7.8 శాతం గ్రీన్ కవర్ పెరిగిందని ప్రశంసలు వస్తున్నాయని తెలిపారు.

దళితబంధు తరహాలోనే గిరిజన బంధు

పోడు భూముల విషయంలో తమకు స్పష్టత ఉందని కెసిఆర్ తెలిపారు. పోడు భూముల సర్వే పూర్తయిందని వెల్లడించారు. ఈ నెలాఖరులో పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పుడు సాగుచేసుకుంటున్న వారికి పట్టాలు ఇస్తామని, అయితే పట్టాలు ఇచ్చాక గజం భూమిని ఆక్రమించబోమని ప్రభుత్వానికి హామీ ఇవ్వాలని చెప్పారు. ఎవరైనా దాన్ని అతిక్రమిస్తే పోడు పట్టాలు రద్దు చేస్తామని హెచ్చరించారు. చెట్లు నరకబోమని సంతకాలు పెడితేనే భూములు పంచుతామని స్పష్టం చేశారు. తీర్మానానికి ముందుకురాని గ్రామాలకు పట్టాలిచ్చేది లేదని అన్నారు. భూముల పంపిణీ పూర్తయ్యాక అటవీ ప్రాంతాలను ఆక్రమిస్తే ఊరుకునేది లేదని, పట్టాలను రద్దుచేస్తామని స్పష్టం చేశారు. భూమిలేని గిరిజన బిడ్డలకు దళితబంధు తరహాలోనే గిరిజన బంధు ఇచ్చి సాయం చేస్తామని వెల్లడించారు.

సాయుధ దళాలతో పహారా

గిరిజనులపై పోలీసులు, అటవీ అధికారులు దాడిచేయవద్దని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. అదేసమయంలో అధికారులపైనా గిరిజనుల దాడులు సహించబోమని అన్నారు. గుత్తికోయల గూండాగిరి మంచిది కాదని చెప్పారు. అడవిని నరికేసి భూములు ఇవ్వండని అడగడం సబబుకాదని హితవు పలికారు. ఇక నుంచి అటవీ ప్రాంతంలోని ఒక్క చెట్టును కూడా కొట్టనివ్వమని స్పష్టం చేశారు. అడవుల నరికివేతకు ఎక్కడో చోట ఫుల్‌స్టాప్ పడాలన్నారు. గజం అటవీ భూమి కూడా ఆక్రమణకు గురికావొద్దని, ఆక్రమణను సర్కార్ సహించదని తెలిపారు. అటవీ సరిహద్దులు పెట్టి సాయుధ దళాలతో పహారా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

గిరిజనుల పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు మరిన్ని చర్యలు చేపడతామని తెలిపారు. అడవుల రక్షణ అనేది మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.. పోడు భూముల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంలో గిరిజనులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సీతక్కతో పాటు ఎమ్మెల్యేలు వీరయ్య, సుదర్శన్‌రెడ్డిలు కూడా పోడు భూములపై గతంలో ఇచ్చిన హక్కు పత్రాలను సమీక్షించాలని కోరారు. ఆ హక్కు పత్రాలపై అనేక అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News