Monday, December 23, 2024

దశాబ్ది ఉత్సవాలకు ఘనంగా ముగింపు

- Advertisement -
- Advertisement -

నేడు బిజీ బిజీగా సిఎం కెసిఆర్ షెడ్యూల్
ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న సిఎం
మనతెలంగాణ/హైదరాబాద్: దశాబ్ది ఉత్సవాల చివరి రోజు (గురువారం) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది. ఉదయం మొదలుకుని రాత్రి వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో ఆసియాలో అతిపెద్దదైన ‘డబుల్ బెడ్‌రూం’ గృహ సముదాయాన్ని ప్రారంభించనున్నారు. అలాగే దశాబ్దాల కల ప్రత్యేక తెలంగాణ సాకారమైన వేళ ఉద్యమ నేపథ్యంలో ప్రాణత్యాగం చేసిన వారిని నిత్యం స్మరించుకునేలా హుస్సేన్‌సాగర్ తీరాన నిర్మించిన తెలంగాణ అమర వీరుల అఖండ జ్యోతిని సిఎం కెసిఆర్ అలాగే రంగారెడ్డి జిల్లా కొండకల్‌లో మేధా సర్వోగ్రూప్ నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో 200 పడకల ప్రభుత్వాసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల ముగింపు సభలో సిఎం పాల్గొననున్నారు. ఇట్లా పొద్దంతా ముఖ్యమంత్రి కెసిఆర్ పలు రకాల ప్రోగ్రామ్స్‌తో బిజీ బిజీగా ఉండనున్నారు.

సాయంత్రం అమరజ్యోతిని ప్రారంభించనున్న సిఎం కెసిఆర్
హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియెట్ సమీపంలో అద్భుతంగా నిర్మించిన అమర వీరుల అఖండ జ్యోతిని గురువారం(జూన్ 22) ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించనున్నారు. దీన్ని రూ.177.50 కోట్లు వెచ్చించి నిర్మించారు. ఓ వైపు హుస్సేన్ సాగర్, మరో వైపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ మధ్య దీన్ని నిర్మించారు. కాగా, ప్రపంచంలోనే అతి పెద్దదైన అతుకులు లేని స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేయడం దీని ప్రత్యేకత. గురువారం సాయంత్రం 5 గంటలకు అంబేద్కర్ విగ్రహం నుంచి స్మారక చిహ్నం వరకు ఆరు వేల మంది కళాకారులు ప్రదర్శన చేయనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు సిఎం కెసిఆర్ ఈ ప్రాంగణానికి చేరుకుంటారు. 12 తుపాకులతో అమరవీరులకు నివాళులర్పించే కార్యక్రమంలో సిఎం పాల్గొననున్నారు.

తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన తరువాత అమరజ్యోతిని సిఎం కెసిఆర్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత శిఖరాగ్రానికి చేరుకుంటారు. అమరవీరులకు నివాళులర్పిస్తూ ప్రముఖ కవి,ఎంఎల్‌సి దేశపతి శ్రీనివాస్ పాట పాడనున్నట్టు తెలుస్తోంది. తరువాత కొవ్వొత్తులు ప్రదర్శించి పది వేల మంది అమరవీరులకు నివాళులర్పిస్తారు.ఆ తరువాత సిఎం కెసిఆర్ ప్రసంగిస్తారు. 800 డ్రోన్లతో ప్రదర్శనతో పాటు అమరవీరుల కోసం జోహార్ అనే అక్షరాలతో స్మారక చిహ్నంపై లేజర్ షో ఉంటుంది. అమర వీరుల అఖండ జ్యోతికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. మొదటి అంతస్తులో మ్యూజియం, ఫొటో గ్యాలరీ ఉంది. రెండో అంతస్తులో 500 మంది కెపాసిటీ ఉన్న కన్వెన్షన్ హాల్, లాబీ ఏరియా ఉన్నాయి. మూడో అంతస్తు, టెర్రర్ అంతస్తులో రెస్టారెంట్, ఓపెన్ టెర్రస్ సిట్టింగ్ ఏరియాలున్నాయి.

ఉ.11 గంటలకు డిగ్నిటీ హౌసింగ్ టౌన్‌షిప్ ప్రారంభం
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్సీపురం మండలం కొల్లూరులో రెండో దశలో భాగంగా నిర్మించిన ‘డబుల్ బెడ్‌రూం’ పథకం ఇళ్లను ముఖ్యమంత్రి కెసిఆర్ లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.డిగ్నిటీ- హౌసింగ్ టౌన్‌షిప్‌లో బాగంగా 15,660 ఫ్లాట్స్‌ను నిర్మించారు. గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వం లబ్ధిదారులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉచితంగా అందిస్తున్న అతిపెద్ద హౌసింగ్ ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం.

రూ.1474.75 కోట్లుతో 117 బ్లాక్స్
కార్పొరేట్ స్థాయి అపార్ట్‌మెంట్ స్థాయిలో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం రూ.1474.75 కోట్లు ఖర్చు చేసింది. 117 బ్లాక్స్‌లో గృహాల నిర్మాణాలు చేపట్టారు. అవసరాన్ని బట్టి ప్రతి బ్లాక్ రెండు లేదా మూడు స్టేయిర్ కేస్‌ను ఏర్పాటు చేశారు. స్టిల్ట్ పార్కింగ్‌తో పాటు పెవ్ బ్లాక్, వాచ్ మెన్ గది ఏర్పాటు చేశారు. ప్రమాదాల నియంత్రణకు ఫైర్ ఫిటింగ్, 8 మంది కెపాసిటీ గల ప్రతి బ్లాక్‌కు రెండు చొప్పున 234 లిప్ట్‌లను ఏర్పాటు చేశారు. లిప్ట్, గృహాలకు నిరంతర విద్యుత్ కోసం పవర్ బ్యాక్ అప్ కోసం ప్రత్యేక జనరేటర్ ఏర్పాటు చేశారు.

రైల్వేకోచ్‌ల తయారీ పరిశ్రమ ప్రారంభం
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్ గ్రామ సమీపంలో వందేభారత్, మెట్రో కోచ్‌లు తయారు చేసే మేధా సర్వోగ్రూప్ రైల్వేకోచ్ పరిశ్రమను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించనున్నారు. ఇది ప్రైవేటు రంగంలో దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రైల్వేకోచ్ ఫ్యాక్టరీ. ఆ సంస్థ రూ.1000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 25 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టి ప్రాథమికంగా ఉత్పత్తి చేపడుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న రెండు వందేభారత్ రైళ్లకు ఈ ఫ్యాక్టరీ పరికరాలనే వినియోగిచారు. ఇప్పటికే 160 బోగీలు సరఫరా చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

మరో 75 ఎకరాల్లో వ్యాగన్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పరిశ్రమలో భద్రతా ఏర్పాట్లను హెచ్‌ఎండిఎ కమిషనర్ అర్వింద్‌కుమార్, సంగారెడ్డి కలెక్టర్ శరత్, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేశ్‌కుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పరిశీలించారు. కొల్లూరులో రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవం అనంతరం సిఎం నేరుగా కొల్లూరు ఔటర్ నుంచి ముత్తంగి జంక్షన్ వద్ద దిగి రైల్వేకోచ్‌కు చేరుకుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News