హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియాలని కెసిఆర్ ఆకాంక్షించారు. గంగా జమునా తహజీబ్ జీవన విధానం మరింతగా పరిఢవిల్లాలని సోదర భావ స్ఫూర్తి గొప్పగా బలపడాలని అభిలషించారు. రంజాన్ పర్వదినాన్నిప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని, అన్ని మతాలకు సమాన గౌరవవాన్ని ఇస్తూ మత సామరస్యం కోసం తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు.
ఆర్థికంగా వెనకబడిన ముస్లింల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, షాదీ ముబారక్ ద్వారా పేదింటి ఆడ పిల్లలకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందన్నారు. పేదింటి ముస్లిం ఆడ పిల్లల జీవితాల్లో గుణాత్మక మార్పుకు దోహదపడడం గొప్పవిషయమన్నారు. ముస్లిం మైనార్టీ బిడ్డల చదువు కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు విజయవంతమయ్యాయని కితాబిచ్చారు. ప్రత్యేక గురుకులాలు సత్ఫలితాలను అందిస్తుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో ముస్లింల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వారి జీవితాల్లో గుణాత్మక అభివృద్ధికి బాటలు వేస్తుండడం పట్ల కెసిర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా వైరస్ తిరిగి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ నిబంధనలను అనుసరించి ముస్లిం సోదరులు ప్రార్థన చేసుకోవాలని కెసిఆర్ సూచించారు.