హైదరాబాద్: దళితబంధు పథకాన్ని ఒక ఉద్యమంలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా ముందు హుజూరాబాద్ లో దళితబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో దళితబంధు పథకం అమలు లోటు పాటులను, దళిత ప్రజల మనోభావాలను, వారి అవసరాలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా.. రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భాగాల్లో వున్న, దళిత శాసన సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాలను ఎంపిక చేసి ఆ మండలాల్లో అన్ని కుటుంబాలకు హుజూరాబాద్ తో పాటు దళితబంధును అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
దీనికిగాను.. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలం, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలాలను సిఎం కెసిఆర్ ఎంపిక చేశారు.
ఈ 4 మండలాల్లో వున్న అన్ని దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింపచేస్తుంది. సిఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయా జిల్లాల మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్ లో సమీక్షా సమావేశాన్ని సిఎం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో నిర్ణయాలు తీసుకుని ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేయనున్నారు.
CM KCR Select another 4 Medals for Dalit Bandhu