మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వినతిపత్రం అందజేస్తున్న సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క, ఎంఎల్‌ఎలు జయప్రకాశ్ రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, శ్రీధర్‌బాబు
మరియమ్మ లాకప్‌డెత్ ఘటనపై సిఎం సీరియస్
విచారణ జరిపి బాధ్యులపై చర్యలు
అవసరమైతే విధుల నుంచి తొలగింపు
మరియమ్మ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహం, రూ.15లక్షల ఎక్స్‌గ్రేషియా, కూతుళ్లకు చెరో రూ.10లక్షల ఆర్థికసాయం
బాధితులను పరామర్శించాలని ఎంపి నామా, మంత్రి పువ్వాడ, డిజిపిలకు కెసిఆర్ ఆదేశం
మరియమ్మ ఘటనపై ముఖ్యమంత్రిని కలిసిన కాంగ్రెస్ నేతల బృందం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో దళితుల మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోదని, తక్షణమే మరియమ్మ లాకప్‌డెత్‌పై విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిజిపి మహేందర్‌రెడ్డికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలిచ్చారు. దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ ఘటనపై శుక్రవారం నాడు హోంశాఖామంత్రి మహమూద్ అలీ, సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డిలతో సిఎం కెసిఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ మరియమ్మ కుమారుడు, కుమార్తెలను ప్రభుత్వం ఆదుకుంటుందని, దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ సంఘటనలో పోలీసుల తీరు పట్ల ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరియమ్మ కుమారుడు ఉదయ్ కిరణ్ కు ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహంతో పాటు, రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియాను అందజేయాలని,అలాగే మరియమ్మ ఇద్దరు కుమార్తెలకు చెరో రూ. 10 లక్షల రూపాయలను ఆర్థిక సహాయం అందచేయాలని సిఎస్ సోమేశ్ కుమార్‌ను సిఎం ఆదేశించారు. అదేవిధంగా మరియమ్మ మృతికి కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, నిజనిర్ధారణ చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే బాధ్యులైన పోలీసులను వెంటనే ఉద్యోగంలో నుంచి తొలగించాలని డిజిపి మహేందర్ రెడ్డి ని సిఎం ఆదేశించారు.
చింతకానికి వెళ్లి లాకప్ డెత్ సంఘటనా పూర్వాపరాలను తెలుసుకుని బాధితులను పరామర్శించి రావాలని డిజిపిని సిఎం ఆదేశించారు. ఈనెల 28వ తేదీన స్థానిక ఎంఎల్‌ఎ కాంగ్రెస్ శాసన సభా పక్షనేత భట్టి విక్రమార్కతో కలిసి స్థానిక మంత్రి పువ్వాడ అజయ కుమార్, ఎంపి నామా నాగేశ్వర్ రావు, జిల్లా కలెక్టర్‌లు బాధిత కుటుంబాలను కలిసి వారిని పరామర్శించి రావాలని సిఎం సూచించారు. దళితుల పట్ల సమాజం దృక్పథం మారవలసిన అవసరం ఉందని, ముఖ్యంగా పోలీసుల ఆలోచనా ధోరణి, దళితుల పట్ల, పేదల పట్ల సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. శాంతి భధ్రతలను కాపాడడంలో గుణాత్మక అభివృద్దిని సాధిస్తున్న రాష్ట్ర పోలీసు వ్యవస్థలో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమని వివరించారు. రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు పునరావృతమైతే ఇకపై క్షమించమని, దళితుల మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోబోదన్నారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
సిఎంకు కాంగ్రెస్ నేతల వినతి ః
దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ సంఘటనపై సత్వరమే విచారణ చేపట్టాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కాంగ్రెస్ నేతలు సిఎం కెసిఆర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సిఎంను కలిసి వారిలో సిఎల్‌పి నాయకుడు, మధిర ఎంఎల్‌ఎ భట్టి విక్రమార్క, ఎంఎల్‌ఎలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్‌సి సెల్ చైర్మన్ ప్రీతమ్ తదితరులున్నారు.