కనిష్టంగా రెండేళ్ల సర్వీసుకే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్
నిబంధనలను సవరించిన రాష్ట్ర ప్రభుత్వం
ఫైలుపై ముఖ్యమంత్రి కెసిఆర్ సంతకం..వెంటనే జారీ అయిన జివొ
మన తెలంగాణ/హైదరాబాద్: పదోన్నతులకు కనిష్ట సర్వీసు రెండేళ్లుగా నిర్ణయిస్తూ జిఏడి సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది. దీనికి సంబంధించి అడ్‌హక్ నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించి జిఓ నెంబర్ 3ను జారీ చేసింది. సోమవారం ఈ అంశంపై సిఎం కెసిఆర్ సానుకూల నిర్ణయం తీసుకొని దస్త్రంపై సంతకం చేయగా, ఆ వెంటనే సిఎస్ సోమేష్‌కుమార్ సోమవారం సాయంత్రం ఈ జిఓను జారీచేశారు. ఈ రెండేళ్ల సర్వీసు కాలపరిమితి ఈ ఏడాది ఆగష్టు 31వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. పదోన్నతుల ప్రక్రియలో భాగంగా ఉమ్మడి రాష్ట్రం నుంచి రాష్ట్ర ఆవిర్భావం తరువాత పలు జిఓలను ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్ర ఆవిర్భావం తరువాత 2016 జనవరి 1న జిఓ 4ను, 2016 సెప్టెంబర్ 2న జిఓ 345, 2018 మే 18వ తేదీన 85, 2018 జూన్ 05వ తేదీన 1073 జిఓలను ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్ర ఆవిర్భావం తరువాత కొత్త జోన్‌లు, మల్టీజోన్లతో క్యాడర్ స్ట్రెంత్ నిర్ధారించడంలో జాప్యం తలెత్తింది. ఖాళీల గుర్తింపు వంటి సమస్యలు ఎదురయ్యాయి. పదోన్నతులు, బదిలీలు నిలిచిపోయాయి. అందులో భాగంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం పదోన్నతులను కల్పించడంతో పాటు ఆ స్థానంలో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే కనిష్ట సర్వీస్‌ను మూడేళ్ల నుంచి రెండేళ్లకు కుదించి పదోన్నతులు వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కొత్తగా జిఓ 3ను సోమవారం సాయంత్రం జారీ చేసింది. ఈ ఉత్తర్వులు కేటగిరీ గ్రేడ్‌ల వారీగా ఉద్యోగులకు అడ్‌హక్ విధానంలో వర్తించనున్నాయి. వారి పదోన్నతులు, బదిలీలు తదుపరి ఉన్నతస్థాయి పదోన్నతికి వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
CM KCR Sign on Govt Employees Promotion