హైదరాబాద్: కేంద్రంలో తెలివి తక్కువ ప్రభుత్వం ఉంది.. ఘోరమైన పద్దతిలో దేశాన్ని నాశనం చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ప్రగతి భవన్ లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై మీడియాతో సిఎం కేసిఆర్ మాట్లాడుతూ.. ”ఆర్థికమంత్రి దారుణమైన బడ్జెట్ ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశకు గురి చేసింది. బడ్జెట్ లో అందరికీ గుండుసున్న. కేంద్ర బడ్జెట్ పైన పటారం.. లోన లోటారం. ఈ ప్రభుత్వం ఎవరి కోసం ఉన్నట్లు?. బడ్జెట్ ప్రవేశ పెడుతూ మహాభారతంలోని శాంతిపర్వం శ్లోకాన్ని నిర్మల చెప్పారు.. ప్రవచించింది అధర్మం, అసత్యం. సాగు చట్టాల ఉద్యమంలో మరణించిన రైతుల గురించి బడ్జెట్ లో కనీసం ప్రస్తావించలేదు. వ్యవసాయ రంగానికి జీరో బడ్జెట్. పైగా ఎరువుల మీద రూ.35వేల కోట్ల సబ్సీడి తగ్గించారు. విద్యుత్ సంస్కరణలంటూ మెంటల్ కేసు పట్టుకున్నారు. రైతుల నుంచి విద్యుత్ ఛార్జీలు చేయాలన్నదే అసలు సంగతి. ఎస్సీల జనాభాపై కేంద్రం చెబుతున్న లెక్కలు తప్పు. దేశంలో ఎస్సీ, ఎస్టీల జనాభా చాలా పెరిగింది. దిక్కుమాలిన గుజరాత్ మోడల్ అడ్డం పెట్టుకుని నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు. కరోనా సమయంలో ఈ ప్రభుత్వం ఎంత దరిద్రంగా వ్యవహరించిందో చూశాం. పవిత్రమైన గంగానదిలో శవాలు తేలేలా చేసిన ప్రభుత్వమిది” అని మండిపడ్డారు.
CM KCR Slams Centre over Union Budget 2022